ప్రియుడిని హత్య చేయడంతో ప్రియురాలు సూసైడ్‌‌‌‌

ప్రియుడిని హత్య చేయడంతో ప్రియురాలు సూసైడ్‌‌‌‌

గోదావరిఖని, వెలుగు : ఓ మహిళ భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి ప్రేమించిన వ్యక్తితో కలిసి ఉంటోంది. దీంతో మహిళ తమ్ముడు, ఆమె భర్త  కలిసి ఆ వ్యక్తిని హత్య చేశారు. తర్వాత ఇరుకుటుంబాల వారు ఆదరించకపోవడంతో మనస్తాపానికి గురైన మహిళ ఆత్మహత్య చేసుకుంది. గోదావరిఖనిలోని హనుమాన్‌‌‌‌నగర్‌‌‌‌కు చెందిన గండ్రెడ్డి శివకుమార్‌‌‌‌తో అంజలి (28)కి తొమ్మిదేండ్ల కింద వివాహం కాగా వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అంజలి.. భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి మూడు నెలలుగా తమ బంధువైన వినయ్‌‌‌‌కుమార్‌‌‌‌తో కలిసి యైటింక్లయిన్‌‌‌‌ కాలనీలో ఉంటోంది.

ఈ నెల 10న అంజలి మొదటి భర్త శివకుమార్‌‌‌‌, ఆమె తమ్ముడు కుమారస్వామి కలిసి యైంటిక్లయిన్‌‌‌‌ కాలనీలోని  ఇంటికి వచ్చి వినయ్‌‌‌‌కుమార్‌‌‌‌ను హత్య చేశారు. ఆ తర్వాత అంజలిని అటు వినయ్‌‌‌‌కుమార్‌‌‌‌ తల్లిదండ్రులు, ఇటు ఆమె తల్లిదండ్రులు ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో పోలీసులు ఆమెను పెద్దపల్లిలోని సఖి సెంటర్‌‌‌‌కు తరలించారు. అక్కడి నుంచి అంజలి ఏపీలోని గుంటూరు జిల్లా కేంద్రంలోని నల్లచెరువు కాలనీలో ఉండే తన చిన్నమ్మ ఇంటికి వెళ్లింది. మానసికంగా కుంగిపోయిన అంజలి ఆదివారం సాయంత్రం తన చిన్నమ్మ ఇంట్లో లేని టైంలో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మరో వైపు వినయ్‌‌‌‌కుమార్‌‌‌‌ను హత్య చేసిన శివకుమార్‌‌‌‌, కుమారస్వామిని గోదావరి బ్రిడ్జి వద్ద అదుపులోకి తీసుకున్నట్లు టూటౌన్‌‌‌‌ సీఐ ప్రసాదరావు తెలిపారు.