
- నాలుగేండ్లుగా ప్రేమించి మొహం చాటేశాడని ఆరోపణ
- ఇద్దరూ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లే..
ములుగు, వెలుగు : నాలుగేండ్లుగా ప్రేమిస్తూ..పెండ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ములుగులో ప్రియుడి ఇంటి ఎదుట ఓ ప్రియురాలు బైఠాయించింది. తనకు న్యాయం చేయాలని, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఎక్కెల గ్రామానికి చెందిన యువతి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో బీట్ఆఫీసర్. ఇదే శాఖలో బీట్ ఆఫీసర్‌గా పని చేస్తున్న మంకిడి శ్రీధర్ తాను నాలుగేండ్లుగా ప్రేమించుకున్నామని, పెండ్లి వరకు వచ్చే సరికి వద్దంటున్నాడని ఆరోపించింది. ఈ విషయం గురించి పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ జరిగిందని, వారు పెండ్లి చేసుకోవాలని చెప్పినా ఒప్పుకోవడం లేదని వాపోయింది.
దీంతో సోమవారం ములుగులోని లారీ ఆఫీస్ వెనకాల ఉన్న శ్రీధర్ ఇంటి ముందు తల్లిదండ్రులు, బంధువులతో కలిసి బైఠాయించింది. తనను పెండ్లి చేసుకోకపోతే చావే దిక్కని వాపోయింది. సాయంత్రం వేళ వచ్చిన పోలీసులు యువతితో పాటు ఆమె బంధువులను.. శ్రీధర్‌ను, కుటుంబసభ్యులను పీఎస్‌కు తీసుకువెళ్లారు. యువతిని ఫిర్యాదు చేయాలని సూచించగా కంప్లయింట్ చేయదలుచుకోలేదని, ఇద్దరికీ పెండ్లి చేయాలని కోరింది. దీంతో ఇరువర్గాలు వెళ్లి మాట్లాడుకొని రావాలని పంపించారు.