ముత్తారం, వెలుగు: ప్రేమించానని చెప్పి పెళ్లి చేసుకోకుండా మోసం చేసిన ప్రియుడి ఇంటి ముందు ఓ ప్రియురాలు బైఠాయించింది. బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం .. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఇప్పలపల్లి (రామకృష్ణాపూర్) గ్రామానికి చెందిన జనగామ విద్యాసాగర్ ప్రేమిస్తున్నానంటూ అదే గ్రామానికి చెందిన చిప్పకుర్తి రజిత(34) వెంటపడ్డాడు. ఈ విషయం తెలిసి 2008లో రజితకు ఆమె తల్లిదండ్రులు వేరే యువకుడితో పెళ్లి చేశారు.
కాగా తాను ఇప్పటికీ ప్రేమిస్తున్నాని, తనను పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానంటూ విద్యాసాగర్ ఆత్మహత్యాయత్నం చేశాడు. అది నమ్మిన ఆమె పెండ్లైన మూడు నెలలకే పుట్టింటికి వచ్చింది. ఈక్రమంలో తన భర్తతో విడాకులు కావాలని కోరగా 2021లో మంజూరయ్యాయి. అప్పటినుంచి పెళ్లి చేసుకోమని రజిత.. విద్యాసాగర్‌ను అడగగా వివిధ కారణాలు చెప్పి దాటేస్తూ వచ్చాడు. దీంతో ఆదివారం విద్యాసాగర్ తో పెళ్లి జరిపించాలంటూ ఇంటిముందు బైఠాయించింది. తనకు న్యాయం చేయాలంటూ రజిత 100కు ఫోన్‌చేసింది. పోలీసులు అక్కడికి చేరుకొని ఆమెను సముదాయించారు. అనంతరం సర్పంచ్ శ్రీనివాస్, కుటుంబ సభ్యులతో కలిసి రజిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.