
- భీష్మించుకు కూర్చున్న బాధితురాలు
- సంగారెడ్డి జిల్లా కల్హేర్‌లో ఘటన
నారాయణ్ ఖేడ్, వెలుగు : తనను మోసం చేసిన ప్రియుడిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ నియోజకవర్గంలోని కల్హేర్‌లో అతడి ఇంటిముందు బైఠాయించిందో యువతి. బాధితురాలి కథనం ప్రకారం.. ఏపీలోని గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం, తాళ్లచెరువు గ్రామానికి చెందిన కుంచెపు రజిత కొన్నాళ్ల నుంచి హైదరాబాద్ లో ప్రైవేటు జాబ్చేస్తోంది. మూడేండ్ల కింద అక్కడే కల్హేర్‌కు చెం దిన అల్లూరి రమేశ్‌తో పరిచయమైంది. ఏడాదిన్నర కింద హైదరాబాద్‌లో పెండ్లి చేసుకున్నాడు. తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పి ఒప్పిస్తానని 20 రోజుల కింద స్వగ్రామానికి వచ్చాడు. తర్వాత తిరిగి రాకపోగా రజిత నంబర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టాడు.
దీంతో ఆమె మూడు రోజుల కింద కల్హేర్ కు వచ్చి పోలీసులను కలిసింది. దీంతో ఎస్ఐ వెంకటేశం రమేశ్తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడారు. రెండు రోజుల్లో సమాధానం చెబుతామని వారు వెళ్లిపోయారు. రెండు రోజులు గడిచాక రమేశ్ కలిసి ఉండడానికి నిరాకరించడంతో రజిత సోమవారం అతడి ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. దీంతో రమేశ్ కుటుంబీకులు తాళం వేసి వెళ్లిపోయారు. న్యాయం జరిగేంత వరకు ఊరు విడిచి వెళ్లేది లేదంటూ రజిత భీష్మించుకు కూర్చుంది. దీంతో ఎస్ఐ వెంకటేశం.. రమేశ్ పెద్దనాన్నను పిలిపించి మాట్లాడారు. వీలైనంత తొందరలో రజిత సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తామని ఎస్ఐ చెప్పారు.