హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) చరిత్రలో తొలిసారిగా కీలక నిర్ణయం తీసుకుంది. బాలికల క్రికెట్ పోటీలను HCA అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్ రావు ఉప్పల్ స్టేడియంలో సోమవారం( August 12) ప్రారంభించారు . ఉమెన్స్ లీగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఆయన మాట్లాడుతూ అండర్-15లో 12 జట్లు, అండర్-17లో 12 జట్లు, అండర్-19లో ఆరు జట్లు పోటీ పడనున్నాయని చెప్పారు.
15 రోజుల పాటు జరగనున్న ఈ లీగ్‌లో సుమారు 450 మంది మహిళా క్రికెటర్లు ఆడనున్నారని చెప్పారు. మ్యాచ్‌లన్నీ హైదరాబాద్ కేంద్రంగానే జరగనున్నాయని, అయితే, ప్రతి జట్టు ఒక్క మ్యాచ్ అయినా ఉప్పల్‌లో ఆడేలా షెడ్యూల్ రూపొందించామని అన్నారు. భారత జట్టు మాజీ కెప్టెన్, హైదరాబాద్ దిగ్గజ క్రికెటర్ మిథాలీ రాజ్ వంటి మేటి క్రికెటర్లను తయారు చేయాలనే ఆశయంతో ఈ లీగ్‌కు రూపకల్పన చేశామన్నారు.
భవిష్యత్‌లో టీమిండియా, డబ్ల్యూపీఎల్‌కు తెలంగాణ ఆడబిడ్డలను ఆడించడమే తమ లక్ష్యమని తెలిపారు. అలానే తన సహచర అపెక్స్ కౌన్సిల్ సభ్యులతో చర్చించి, అన్ని సదుపాయాలున్న మహిళ క్రికెట్ అకాడమీ కూడా స్థాపించేందుకు కృషి చేస్తానని జగన్‌మోహన్ రావు చెప్పారు.