అమ్మకానికి ఆడపిల్లలు జగిత్యాల జిల్లాలో జోరుగా దందా

  •     ఆడ పిల్లలను వదిలించుకుంటున్న పేరెంట్స్​
  •     బ్రోకర్ల అవతారమెత్తుతున్న ఆర్ఎంపీలు, మెడికల్ ​స్టాఫ్​
  •     కారాలో దత్తతకు అవకాశమున్నా అవగాహన కరువు 

జగిత్యాల, వెలుగు : పుట్టిన పసిబిడ్డలను కొందరు నిర్దాక్షిణ్యంగా రోడ్డుపై వదిలేస్తుంటే.. మరికొందరు పైసల కోసం శిశువులను అమ్మేస్తున్నారు. ఈ వదిలివేతలు, అమ్మకాల్లోనూ ఆడశిశువులే ఎక్కువగా ఉంటున్నారు. మరోవైపు పిల్లలు కావాలనుకునే వారి అవసరాన్ని ఆసరాగా చేసుకొని కొందరు కొత్త దందాకు తెరలేపుతున్నారు. ముఖ్యంగా నిరుపేద కుటుంబాలనే లక్ష్యంగా చేసుకొని ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. ఈ దందాలో కొందరు  ఆర్ఎంపీలు, నర్సులు, మెడికల్ కాలేజీల స్టాఫ్.. బ్రోకర్ల అవతారమెత్తుతున్నారు. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో పనిచేసే కారా, సారా సంస్థల ద్వారా దత్తత తీసుకునే అవకాశమున్నా   పిల్లలు లేనివారు బ్రోకర్లను ఆశ్రయిస్తున్నారు.  మరోవైపు పోషించే స్థోమత లేనివారు పిల్లలను హ్యాండోవర్​ చేసేందుకు కఠిన రూల్స్​  ఉడడం శిశువుల  అమ్మకాలు పెరగడానికి కారణమవుతున్నాయి. 

ఏడాదికి 50కి పైగా ఘటనలు 

ఉమ్మడి జిల్లాలో ఆడ శిశువుల విక్రయాలు, వదిలేసిన ఘటనలు ఏటా 50కి పైగా చోటుచేసుకుంటున్నాయి. పెళ్లి కాకపోవడం, వివాహేతర సంబంధాలతో ప్రెగ్నెంట్ కావడం, మొదటి, రెండు కాన్పుల్లోనూ ఆడ పిల్లలు పుట్టడం వంటి కారణాలతో పసిపిల్లలను వదిలించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో సంతానం లేని వారికి అక్రమమార్గంలో దత్తత ఇవ్వడం, అమ్ముకోవడం చేస్తున్నారు. పోషించే స్థోమత లేని వారు చైల్డ్ డెవల్మెంట్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ కు తమ పిల్లలను అప్పగించే అవకాశం ఉన్నా దీనిపై అవగాహన లేకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 

పసికందుల అమ్మకాలేందుకు? 

దత్తత తీసుకోవాలనుకునే దంపతుల కోసం డిస్ట్రిక్ట్ చిల్ర్డన్​ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ వింగ్ ఆధ్వర్యంలో కారా(సెంట్రల్ అడప్షన్ రిసోర్స్ అథారిటీ), సారా( స్టేట్ అడప్షన్ రిసోర్స్ అథారిటీ) సంస్థలు పని చేస్తున్నాయి. ఇందులో దరఖాస్తు చేసుకునే దంపతులకు రూల్స్ మేరకు దత్తత ఇస్తారు. దంపతుల ఆర్థిక పరిస్థితి, క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ పై ఎంక్వైరీ చేసి, వయస్సు ఆధారంగా దత్తత ఇచ్చే అవకాశం ఉంది. అయితే సారా, కారాల ద్వారా దత్తత తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ సంతానం లేని దంపతులు శిశువులే కావాలని అందులోనూ మగపిల్లలను తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు. 

దీంతో మగశిశువుల కొరత ఏర్పడుతోంది. మరోవైపు శిశువులను హ్యాండోవర్​ చేసే రూల్స్​ కఠినంగా ఉండడంతోపాటు పేరెంట్స్​కు అవగాహన లేకపోవడంతో పురిట్లోనే శిశువులను అమ్ముతున్నారు. ముఖ్యంగా ఆడశిశువులను వదిలించుకునేందుకు పేరెంట్స్ రెడీ అవుతున్నారు. ఇలా అమ్మకాలకు హాస్పిటల్‌లో పనిచేసే కొందరు నర్సులు, సిబ్బంది, ఆర్ఎంపీలు బ్రోకర్ల అవతారమెత్తుతున్నారు. సంతానం లేనివారికి లక్షల రూపాయలకు శిశువులను అమ్ముతున్నారు. 

ఇటివల జరిగిన కొన్ని ఘటనలు

 జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామానికి చెందిన దంపతులకు మూడు నెలల క్రితం మూడో సంతానంగా ఓ పాప జన్మించింది. అప్పటికే ఇద్దరు బిడ్డలు ఉండగా  మళ్లీ ఆడపిల్ల పుట్టింది. దీంతో శిశువును అమ్మేందుకు బ్రోకర్ల ద్వారా ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 2న తండ్రి లక్ష్మణ్​  తల్లి దగ్గర నుంచి శిశువును తీసుకెళ్లి జమ్మికుంటవాసులకు అప్పగించారు. విషయం తెలుసుకున్న తల్లి జ్యోతి ఫిర్యాదు మేరకు పోలీసులు బిడ్డను మళ్లీ ఆమె దగ్గరకు చేర్చారు.

 ఇటీవల జగిత్యాలకు చెందిన ఓ మహిళ ఇల్లీగల్​సంబంధం కారణంగా మగ శిశువుకు జన్మనిచ్చింది. విషయం బటయకు పొక్కకుండా స్థానిక ట్రాన్స్ జెండర్ కు రూ.60 వేలకు అమ్మింది. ఆ ట్రాన్స్ జెండర్ శిశువుతో భిక్షాటన చేయించడంతో విషయం బయటపడి సంబంధిత ఆఫీసర్లు శిశువును చిల్డ్రన్స్ హోం కు తరలించారు.

 ఆరు నెలల క్రితం ఎన్జీవో పేరుతో రాజేశ్‌ అనే వ్యక్తి సంతానం లేని దంపతులను టార్గెట్ చేస్తూ ఒక్కొక్క జంట నుంచి సుమారు రూ.1 లక్ష నుంచి రూ. 2 లక్షలు వసూల్ చేశాడు. చిల్డ్రన్స్ ప్రొటెక్షన్ అండ్ డెవలప్మెంట్ ఆఫీసర్ల దృష్టికి రావడం తో పోలీసులకు ఫిర్యాదు చేయడం తో కేసు ఫైల్​అయింది. 

 గతంలో జగిత్యాల జిల్లా మెట్‌పల్లి బస్టాండ్ లో ఓ మహిళ తన రెండేళ్ల పసిబిడ్డను పోషించలేనని అమ్మేందుకు తిరిగింది. ఈ ఘటన అప్పట్లో స్థానికులను కలచివేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసి ఆరా తీయగా, చిన్నారికి ఆ మహిళ తల్లి కాదని దొంగలించి తీసుకువచ్చిందని తేలడంతో కేసు ఫైల్​చేసి చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు.

కారా ద్వారా దత్తత పొందాలి

కారా రూల్స్ ప్రకారం డాక్యుమెంట్స్ ను పొందుపర్చి నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత కావాల్సిన శిశువును దత్తత పొందే అవకాశం ఉంది. పసిపిల్లలను అమ్మడం, కొనడం చట్టరీత్య నేరం. ఎవరైనా పిల్లలను పొషించే స్థోమత లేని దంపతులు నేరుగా కారా ఆఫీసులో సంప్రదించాలి. ఇలాంటి దంపతుల పేర్లను గోప్యంగా ఉంచి రూల్స్ ప్రకారం పిల్లలను హ్యాండోవర్ చేసుకుంటాం. అనంతరం వారిని శిశు గృహాలకు తరలిస్తాం. దత్తత కోసం దరఖాస్తు చేసుకున్న దంపతుల అర్హతలను గుర్తించి పిల్లలను దత్తతకు ఇస్తాం.

- బోనగిరి నరేశ్‌, డీడబ్ల్యూవో, జగిత్యాల