
నారాయణపేట/గద్వాల, వెలుగు: కూతుళ్లపై వివక్ష చూపకుండా కొడుకులతో సమానంగా చదివించి తల్లిదండ్రులు వారి హక్కులను కాపాడాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ‘మిషన్ వాత్సల్య’ జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో ‘ఇది మా సమయం, మా హక్కులు, మా భవిష్యత్’ అనే అంశం పై సంతకాల సేకరణ నిర్వహించారు. ఈ కార్యక్రమాని హాజరైన కలెక్టర్ మొదటి సంతకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు ఎంతో శక్తి వంతులని, వారికి అవకాశం ఇచ్చిన ప్రతి రంగంలో పురుషులకు దీటుగా విజయాలు సాధిస్తున్నారన్నారు. అలాగే జడ్పీ చైర్పర్సన్ వనజమ్మ కూడా సంతకం చేశారు.
ఆడబిడ్డల సంరక్షణపై అవగాహనకల్పించాలి
ఆడబిడ్డల సంరక్షణ పై సమాజంలో అవగాహన కల్పించాలని గద్వాల కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. సోమవారం బాలికల దినోత్సవం సందర్భంగా చైల్డ్ వెల్ఫేర్ బాలల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాలికలు విద్య, పోషణ, చైల్డ్ మ్యారేజెస్, లైంగిక, శారీరక వేధింపులకు గురవుతున్నారన్నారు. వీటి నుంచి వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. వెల్ఫేర్ఆఫీసర్ ముసాయిదా బేగం, జడ్పీ సీఈవో విజయ నాయక్, ఆర్డీవో రాములు పాల్గొన్నారు.