మారని ‘మన బడి’..అమ్మాయిల టాయిలెట్లకుడోర్లు లేవు.. పైకప్పు లేదు

  • మారని ‘మన బడి’..అమ్మాయిల టాయిలెట్లకుడోర్లు లేవు.. పైకప్పు లేదు
  • ఫండ్స్‌‌ ఇయ్యని సర్కారు.. ఇష్టారాజ్యంగా పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు
  • బిల్లులు రావడంలేదని మధ్యలోనే నిలిపివేత
  • పాత బిల్డింగులు పడగొట్టి.. గుంతలు తవ్వి వదిలేస్తున్నరు
  • కొన్ని చోట్ల తూతూమంత్రంగా రిపేర్లు.. సున్నమేసి మేనేజ్
  • ఏడాదిగా ఇదే పరిస్థితి.. స్టూడెంట్లకు ఇక్కట్లు

జగిత్యాల / నెట్‌‌వర్క్, వెలుగు: రాష్ట్ర సర్కారు ప్రారంభించిన ‘మన ఊరు- – మన బడి’ పథకం అమలు తీరు.. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా తయారైంది. ప్రభుత్వ పెద్దలు చెప్తున్న మాటలకు.. వాస్తవ పరిస్థితులకు పొంతన ఉండటం లేదు. చేతిలో పైసలు లేకపోవడంతో హెచ్ఎంలు, స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీ (ఎస్ఎంసీ)లు, కాంట్రాక్టర్లు పనులను తమకు తోచినట్లు చేస్తున్నారు. బాయ్స్, గర్ల్స్ టాయిలెట్లను అడ్డదిడ్డంగా కట్టేస్తున్నారు. చాలాచోట్ల నిర్మాణాలకు గుంతలు తవ్వి, కొన్నిచోట్ల పిల్లర్లు లేపి వదిలేశారు. అదనపు గదులు, కిచెన్​షెడ్లు, కాంపౌండ్​ వాల్స్​ను అత్యంత నాసిరకంగా నిర్మిస్తున్నారు. ఇంకొన్నిచోట్ల పాత బిల్డింగులకు తూతూమంత్రంగా రిపేర్లు చేసి, సున్నమేసి మేనేజ్ ​చేస్తున్నారు. నల్లా కనెక్షన్ ​ఇచ్చి, దానికో పైపు పెట్టి నీటి సౌకర్యం కల్పించినట్లు రాసుకుంటున్నారు.సర్కారు నుంచి బిల్లులు రాకపోవడంతో కొంతమంది కాంట్రాక్టర్లు అదనపు గదులు, కిచెన్​షెడ్లు, టాయిలెట్లకు తాళాలు వేసుకొని వెళ్లిపోతున్నారు. సమస్య సర్కారు దగ్గరే ఉండడంతో ఆఫీసర్లు చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. దీంతో స్టూడెంట్లకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు.

మధ్యలోనే ఆగిన పనులు

రాష్ట్రవ్యాప్తంగా 26,065 సర్కారు స్కూళ్లు ఉన్నాయి. ‘మన ఊరు.. మనబడి’ స్కీం కింద రూ.7,290 కోట్లతో మూడు విడుతల్లో మౌలిక వసతులు కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మొదటి విడతలో రూ.3,497 కోట్లతో 9,123 బడులను డెవలప్ చేస్తామని గతేడాది ఫిబ్రవరిలో జీవో రిలీజ్ చేసింది. ఎంపిక చేసిన బడుల్లో పాత బిల్డింగులకు రిపేర్లతోపాటు, అదనపు గదులు, టాయిలెట్స్, కిచెన్ షెడ్స్, కాంపౌండ్ వాల్ నిర్మాణం, లైటింగ్, ఫర్నిచర్, డిజిటల్ క్లాసులు, గ్రీనరీ, తాగునీరు లాంటి 12 రకాల ఫెసిలిటీస్​కల్పించాల్సి ఉంది. పనుల విలువ రూ.30 లక్షల్లోపు ఉన్నచోట్ల హెచ్ఎంలకు, స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీ (ఎస్ఎంసీ)లకు, స్థానిక సర్పంచులకు, రూ.30 లక్షలు దాటిన పనులను టెండర్ ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగించారు. ఈ క్రమంలో కొత్త నిర్మాణాలు చేపట్టేందుకు వందలాది స్కూళ్లలో పాత నిర్మాణాలు కూల్చేశారు. శిథిలమైన టాయిలెట్లు, అదనపు గదులు, ప్రహరీలు కూల్చి, ఈజీఎస్ స్కీం కింద గుంతలు తవ్వించారు. తర్వాత హెచ్ఎంలు, ఎస్​ఎంసీలు, సర్పంచులు, కాంట్రాక్టర్లు తమ దగ్గర ఉన్న పైసలతో నిర్మాణాలు మొదలుపెట్టారు.

సర్కారు నుంచి ఫండ్స్​ రాకపోవడంతో మధ్యలోనే వదిలేశారు. ఉన్న అదనపు గదులను కూల్చివేయడంతో గత్యంతరం లేక టీచర్లు.. ఒక్కో గదిలో రెండు, మూడు క్లాసుల స్టూడెంట్లను కూర్చోబెడ్తున్నారు. టాయిలెట్లు లేకపోవడంతో ఒంటికి, రెంటికి ఆరుబయటకు వెళ్తున్నారు. కొన్నిచోట్ల ఫండ్స్​చాలక టాయిలెట్లు కట్టి ఓపెన్​గా వదిలేయడంతో బాలికలు ఇబ్బంది పడ్తున్నారు. గత వేసవి సెలవుల్లోనే పూర్తికావాల్సిన పనులు ఏడాదిగా కొనసాగుతుండడంతో ఆఫీసర్లు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల స్టూడెంట్ల ప్రాణాలు పోతున్నాయి. ఈ నెల 3న వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మంచన్ పల్లి ప్రభుత్వ స్కూల్ లో పనులు జరిగే చోట కరెంట్ వైర్లు తాకి దీక్షిత(9) అనే నాలుగో తరగతి చిన్నారి చనిపోయింది. ‘మన ఊరు – మన బడి’ కింద ఎంపికైన తమ స్కూల్​లో టాయిలెట్స్​పూర్తికాక, ఇబ్బంది పడ్తున్నామని జగిత్యాల ఓల్డ్ హైస్కూల్​లో ఆరో తరగతి చదువుతున్న విశ్వంక్.. ప్రజావాణిలో అదే రోజు కలెక్టర్‌‌కు ఫిర్యాదు చేయడం గమనార్హం.

పది శాతం కూడా ఫండ్స్​ ఇయ్యలే

మొదటి విడత మన ఊరు– మన బడి స్కీం కోసం రూ.3,497 కోట్లు కేటాయిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కాలంలో కేటాయించింది రూ.300 కోట్లు మాత్రమే. అంటే పది శాతం కూడా కేటాయించలేదు. దీంతో సమగ్ర శిక్షా అభియాన్​, సీడీఎఫ్,  జిల్లాపరిషత్, మండల పరిషత్ నిధులు, ఉపాధి హామీ స్కీమ్, నాబార్డ్ నుంచి నిధులు సమీకరిస్తామని సర్కారు చెప్పినా ఆచరణలో సాధ్యం కాలేదు. దీంతో తొలిదశలో ఎంపిక చేసిన 9,123 బడుల్లో మండలానికి రెండు స్కూళ్ల చొప్పున 1,200 బడులను మాత్రమే ఇప్పటివరకు పూర్తిస్థాయిలో డెవలప్​చేశారు. మిగిలిన చోట్ల పనులు అరకొరగా సాగుతున్నాయి. కొన్నిచోట్ల కాంట్రాక్టర్లు తమ సొంత డబ్బులతో పనులు కంప్లీట్ చేసినా సర్కారు నుంచి బిల్లులు వచ్చేదాకా ఆయా నిర్మాణాలను అప్పగించే పరిస్థితి లేదంటూ తాళాలు వేసుకొని వెళ్లిపోతున్నారు. 

ఏ జిల్లాలో చూసినా..

సీఎం కేసీఆర్ సొంత జిల్లా సిద్దిపేటలో వర్గల్ మండలం నాచారం హైస్కూల్ కు మన ఊరు -మన బడి పథకం కింద రూ.1.30 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో ఆరు అదనపు గదులు, డైనింగ్ హాల్ నిర్మాణంతో పాటు, స్కూల్లో మైనర్, మేజర్ రిపేర్లు చేపట్టాలి. ఎవరూ ముందుకురాకపోవడంతో రెండు నెలల క్రితం ఓ కాంట్రాక్టర్‌‌కు బలవంతంగా పనులు అప్పగించారు. దీంతో అదనపు గదుల నిర్మాణం కోసం పునాదులను తవ్వి కాంట్రాక్టర్ పత్తా లేకుండా పోయాడు. పనులు చేసినా ఫండ్స్ రావనే అనుమానంతోనే చేతులెత్తేశాడని చెప్పుకుంటున్నారు.


పెద్దపల్లి జిల్లా మంథనిలోని చైతన్యపురి కాలనీ జడ్పీహెచ్ఎస్ బాయ్స్ హైస్కూల్‌ను మన ఊరు మన బడి కింద  ఎంపిక చేశారు. అప్పటికే అన్ని రకాల వసతులు ఉన్నప్పటికీ పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి అవసరం లేకున్నా రూ.12 లక్షలతో అదనంగా టాయిలెట్స్, డైనింగ్ హాల్ నిర్మించారు. తర్వాత స్కూల్ మొత్తానికి సున్నం వేసి నిర్ణీత టైంలో వంద శాతం పనులు పూర్తయినట్లు చూపించారు. మండలంలో ఎన్నో స్కూల్స్ పడిపోయే పరిస్థితిలో ఉన్నా వాటిని ఎంపిక చేయకపోవడాన్ని జనం తప్పుపడ్తున్నారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం ఆలింపూర్ ప్రైమరీ స్కూల్‌లో మేజర్, మైనర్ రిపేర్లు, కరెంటు, వాటర్ సప్లై కోసం రూ.10.40 లక్షలు మంజూరయ్యాయి. ఇప్పటివరకు రూ.5 లక్షలతో కరెంట్, వాటర్​సప్లై పనులు చేసిన కాంట్రాక్టర్.. బిల్లులు రాకపోవడంతో చేతులెత్తేసి వెళ్లిపోయాడు. పనులు ఎక్కడివక్కడే ఆగిపోయాయి.మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం కొడిశెలమిట్ట ప్రైమరీ స్కూల్‌కు రూ.3.66 లక్షలు కేటాయించగా, అధికారుల పర్యవేక్షణ కరువైంది. దీంతో నిర్మాణ పనుల్లో క్వాలిటీ లేని ఇసుక, కంకరకు బదులుగా లోకల్ గా దొరికే ఏనెరాళ్లను వాడుతున్నారు.

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని కంకెట హైస్కూల్ లో ప్రహరీ గోడ, కిచెన్ షెడ్ పనులు చేసిన కాంట్రాక్టర్​కు రూ.18 లక్షల బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఆ పైసలు రాకపోవడంతో కాంట్రాక్టర్ మిగిలిన పనులు ఆపేశాడు. దీంతో స్కూల్​ఆవరణ, క్లాస్ రూమ్స్ అధ్వానంగా తయారయ్యాయి. బిల్లులు చెల్లిస్తే తప్ప మిగిలిన పనులు చేసే ప్రసక్తి లేదని కాంట్రాక్టర్ చెప్పాడు. మెదక్ జిల్లా నిజాంపేట జడ్పీ హైస్కూల్ లో సంపు, డైనింగ్ హాల్, ఎలక్ట్రిక్ వర్క్స్ లాంటి పనులకు రూ.19 లక్షలు శాంక్షన్ అయ్యాయి. వీటిలో ఎలక్ట్రిక్ వర్క్స్ చేసిన కాంట్రాక్టర్.. బిల్లులు రాకపోవడంతో పనులు ఆపేశాడు. దీంతో స్టూడెంట్స్ చెట్ల కింద, వారండాలో మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. సరిపడా టాయిలెట్స్ కూడా లేకపోవడంతో ఆరుబయటకు వెళ్తున్నారు.

 ‘మన ఊరు - మన బడి’లో భాగంగా జగిత్యాల జిల్లా మెట్‌‌పల్లి మండలం బండ లింగాపూర్ హైస్కూల్‌‌లో కట్టిన టాయిలెట్లు ఇవి. ఈ స్కూల్‌‌లో వివిధ అభివృద్ధి పనులు, రిపేర్ల కోసం సర్కారు రూ.22 లక్షలు కేటాయించింది. స్కూల్ మేనేజ్‌‌మెంట్ కమిటీ ఆధ్వర్యంలో రూ.3 లక్షలతో డైనింగ్ హాల్, నాలుగు బాత్ రూంలు, ఇతర పనులు చేశారు. కానీ సర్కారు రూ.80 వేలు మాత్రమే రిలీజ్ చేయడంతో మిగిలిన వర్క్స్ పెండింగ్‌‌లో ​పెట్టారు. వచ్చిన అరకొర ఫండ్స్‌‌తో గర్ల్స్ కోసం ఇట్లా టాయిలెట్లు కట్టి వదిలేశారు. చుట్టుపక్కల ఇండ్లు ఉండడంతో ​టాయిలెట్లలోకి వెళ్లలేక విద్యార్థినిలు ఇబ్బందిపడ్తున్నారు.