ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
  • ఉమ్మడి జిల్లాలో గతేడాదికంటే మెరుగుగా ఇంటర్ ఉత్తీర్ణత శాతం
  • నిజామాబాద్​ జిల్లా స్టేట్​లో 25వ స్థానం
  • చివరి స్థానంలో నిలిచిన కామారెడ్డి జిల్లా

నిజామాబాద్​/కామారెడ్డి, వెలుగు :  ఇంటర్ పరీక్షా ఫలితాల్లో  నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో బాలికలే పైచేయి సాధించారు. ప్రథమ, ద్వితీయ, ఒకేషనల్​ కోర్సుల్లోనూ గర్ల్స్​ ఆధిపత్యం చాటారు.  గతేడాది కంటే ఉత్తీర్ణత శాతం పెరిగింది.  నిజామాబాద్​ జిల్లాలో ఇంటర్ సెకండ్ ఇయర్​ పరీక్షలు మొత్తం 13,945 మంది రాయగా, అందులో 8,117 (58.20 శాతం) మంది పాస్​ అయ్యారు. వారిలో గర్ల్స్​ 5,309 కాగా, బాయ్ 2,808 మంది ఉన్నారు. 

ఫస్ట్​ ఇయర్​లో 15,056 మంది పరీక్షలు రాయగా, 8,035 మంది పాస్​ (53.37 శాతం)  అయ్యారు. అందులో గర్ల్స్​ 5,191 కాగా, బాయ్స్​ 2,844 మంది ఉన్నారు. ఒకేషనల్ ఫస్ట్​ ఇయర్​ పరీక్షలకు 2,790 మంది స్టూడెంట్స్ అటెండ్​ కాగా, 1,223 మంది పాస్​ (43.83 శాతం) అయ్యారు. వారిలో గర్ల్స్​ సంఖ్య 756 కాగా, బాయ్స్​ 467 మంది ఉన్నారు. సెకండ్​ ఇయర్​ ఒకేషనల్ ఎగ్జామ్​ రాసిన మొత్తం స్టూడెంట్స్​ 2,042 కాగా, 1,231మంది (60.28 శాతం) ఉత్తీర్ణత సాధించారు.  అందులో బాలికలు 666, బాయ్స్​ 565 మంది ఉన్నారు. 

ఉత్తమ మార్కులు సాధించిన సర్కార్ స్టూడెంట్స్..

ఇంటర్మీడియెట్ పరీక్షా ఫలితాల్లో జిల్లాలోని గవర్నమెంట్ కాలేజీ స్టూడెంట్స్ ఉత్తమ మార్కులు సాధించి ప్రతిభను చాటుకున్నారు. ఇందూర్ గర్ల్స్ జూనియర్ కాలేజీకి చెందిన మలిహ ఆర్ఫీన్ (బైపీసీ 974/1,000), బి.జోతిర్మయి (ఎంపీసీ 956/1,000), ఆర్మూర్ గవర్నమెంట్ గర్ల్స్ కాలేజీలో సోఫియా కుల్సుం (బైపీసీ 967/1,000), మనస్విని (932/1,000) , ఒకేషనల్ కోర్సులో ఎస్.పూజ (974/1,000) పొందారు. వారిని డీవీఈవో రవికుమార్ అభినందించారు.

కామారెడ్డి జిల్లాలో..

జిల్లాలో ఈసారి సెకండ్ ఇయర్​లో  54.93 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఫస్ట్ ఇయర్​లో 48.96 శాతం మంది పాసయ్యారు. కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్ స్పెషల్​  ఫోకస్​ పెట్టారు. గవర్నమెంట్ జూనియర్ కాలేజీ విద్యార్థులు, తల్లిదండ్రులు, లెక్చరర్లతో మీటింగ్​లు నిర్వహించారు. ఆయా సబ్జెక్టుల్లో వెనుకబడిన వారిపై  లెక్చరర్లు ప్రత్యేక శ్రద్ధ చూపారు.  ఈ ఏడాది సెకండ్ ఇయ్యర్​లో 6,485 మంది పరీక్షకు హాజరు కాగా, వీరిలో 3,562 మంది పాసయ్యారు.  

ఇందులో బాలురు 3,026 మందిలో  1,347 మంది  ఉత్తీర్ణులయ్యారు. బాలికలు   3,459 మందికిగాను 2,215 మంది పాసయ్యారు. ఒకేషనల్​లో  1,237 మందికి గాను  792 మంది ( 64 శాతం) పాసయ్యారు. ఫస్ట్​ ఇయర్​లో మొత్తం  6,828 మంది స్టూడెంట్స్​లో  3,343 మంది పాసయ్యారు.  వీరిలో బాలురు  3,119 మందిలో  1,169 మంది, బాలికలు  3,709 మందిలో 2,174 మంది పాసయ్యారు.  ఒకేషనల్​లో  1,912 మందిలో  1,030 మంది ( 54.13 శాతం)  ఉత్తీర్ణులయ్యారు. గవర్నమెంట్​ జూనియర్​ కాలేజీల్లో చాలా చోట్ల ఉత్తీర్ణత  శాతం తక్కువగా ఉంది. కస్తూర్బా, మాడల్​ కాలేజీల్లోని విద్యార్థులకు మెరుగైన మార్కులు వచ్చాయి.