ఉమ్మడి మెదక్ జిల్లాలో బాలికలదే పైచేయి .. ఇంటర్​ ఫలితాల్లో స్వల్పంగా పెరిగిన ఉత్తీర్ణత శాతం

ఉమ్మడి మెదక్ జిల్లాలో బాలికలదే పైచేయి .. ఇంటర్​ ఫలితాల్లో స్వల్పంగా పెరిగిన ఉత్తీర్ణత శాతం

మెదక్​/ సిద్దిపేట/ సంగారెడ్డి, వెలుగు: ఇంటర్ ​ఫలితాల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో బాలికలే పైచేయి సాధించారు. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి మూడు జిల్లాల్లోనూ ఫస్టియర్​, సెకండియర్​లో బాలికలే ఎక్కువ మంది పాస్​అయ్యారు. గతేడాది ఫలితాలతో పోలిస్తే సిద్దిపేట జిల్లా ఫస్ట్​, సెకండ్ ఇయర్లలో మెరుగైన ఫలితాలు సాధించింది. సంగారెడ్డి జిల్లాలో సైతం ఫస్ట్​, సెకండ్​ఇయర్లలో పాస్​పర్సంటేజీ కొంత మేర పెరిగింది. మెదక్ జిల్లాలో సెకండ్​ఇయర్​లో ఉత్తీర్ణత శాతం కొంత పెరగగా, ఫస్టియర్​లో స్వల్పంగా తగ్గింది. 

సిద్దిపేట జిల్లాలో..

ఇంటర్​పరీక్షా ఫలితాల్లో సిద్దిపేట జిల్లా గతేడాదితో పోలిస్తే మెరుగైన ఫలితాలు సాధించింది. ఫస్టియర్​లో 51.49 శాతం, సెకండ్​ఇయర్​లో 59.50 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్​పరీక్షలకు మొత్తం 9,791 మంది హాజరు కాగా 5,042 మంది పాసై 51.49 శాతం ఉత్తీర్ణత సాధించారు.  గతేడాది కేవలం 47.10 శాతం మాత్రమే సాధించారు. సెకండ్​ఇయర్​లో మొత్తం 9,217 మంది పరీక్షలకు హాజరవగా 5,490 మంది ఉత్తీర్ణులై 59.50 పాస్​పర్సంటేజీ సాధించారు. గతేడాది 59.30 శాతం మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ఫస్టియర్​, సెకండ్​ఇయర్లలో బాలురతో పోలిస్తే బాలికలే అధికంగా ఉత్తీర్ణత సాధించారు.

 ఒకేషనల్ విభాగంలో సెకండ్ ఇయర్​లో మొత్తం 2,234 మంది పరీక్షలకు హాజరు కాగా అందులో 1,350 మంది పాసయ్యారు. 60.43 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్ లో మొత్తం  2,621 మంది పరీక్షలకు హాజరు కాగా వీరిలో 1,360  మంది పాసయ్యారు. 51శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. సిద్దిపేట గవర్నమెంట్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ కు చెందిన కదుర్ల వనిత ప్రియదర్శిని ఎంపీసీ ఫస్టియర్ లో 470 మార్కులకు 468 మార్కులు సాధించగా, అదే కాలేజీ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థిని ఇమ్రా సదాఫ్  989 మార్కులు సాధించింది. సిద్దిపేట మాస్టర్ మైండ్స్ జూనియర్ కాలేజీ విద్యార్థిని అప్సానా జబీన్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీలో 440 మార్కులకు 433 మార్కులు సాధించింది.

మెదక్ జిల్లాలో..

జిల్లాలో సెకండ్ ఇయర్​లో మొత్తం 5,067 మంది పరీక్ష రాయగా అందులో 3,013 మంది 59.46 శాతం  పాసయ్యారు.  బాలురు 2,168 మంది పరీక్ష రాస్తే 1,109 మంది 51.5 శాతం పాసయ్యారు. బాలికల్లో 2,899 మంది పరీక్ష రాయగా అందులో 1,904  మంది  65.6 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఫస్టియర్​లో మొత్తం 5,519 మంది పరీక్ష రాయగా అందులో 2,587 మంది 46. 8 శాతం ఉత్తీర్ణులయ్యారు. బాలురు 2,370 మంది పరీక్ష రాయగా వారిలో 874 మంది  36.88 శాతం, బాలికలు 3,149 మంది పరీక్ష రాయగా వారిలో 1,713 మంది 54.4 శాతం 
ఉత్తీర్ణులయ్యారు. 

సంగారెడ్డి జిల్లాలో.. 

జిల్లాలో సెకండ్​ఇయర్​ లో మొత్తం 14,259 మంది పరీక్ష రాయగా, 9,817 మంది 68.8 శాతం పాసయ్యారు.  బాలురు 5,764 మంది పరీక్ష రాయగా వారిలో 3,301 మంది  57.27 శాతం,  బాలికలు 8,495 మంది పరీక్ష రాయగా వారిలో 6,516 మంది  76.70 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఫస్టియర్​లో మొత్తం 15,960 మంది పరీక్ష రాయగా వారిలో 9,644 మంది 60.43 శాతం  మంది పాసయ్యారు. బాలురు 6,573 మంది పరీక్ష రాయగా వారిలో 3,087 మంది 46.96 శాతం,  బాలికలు 9,387 మంది పరీక్ష రాయగా వారిలో 6,557 మంది 69.85 శాతం పాసయ్యారు.

చేర్యాల, తూప్రాన్ స్టూడెంట్స్​కు మెరుగైన ర్యాంకులు

సిద్దిపేట/ తూప్రాన్, : ఇంటర్​ ఫలితాల్లో సిద్దిపేట జిల్లా చేర్యాల కేజీబీవీ సెకండ్​ఇయర్​ఎంపీహెచ్ డబ్ల్యూ చదువుతున్న సాయిదీప్తి 995/1000 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలవగా, ఫస్ట్​ఇయర్​ఎంపీహెచ్ డబ్ల్యూ విద్యార్థిని స్పందన 494/500 మార్కులు సాధించింది. ఇదే కాలేజీలో సీఈసీ  ఫస్టియర్​చదువుతున్న  అక్షయ  589/500 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం సాధించింది. ఎంపీసీ ఫస్ట్ ఇయర్ లో మెదక్ జిల్లా తూప్రాన్ గీతా జూనియర్ కాలేజీ విద్యార్థులు కృతిక 470 మార్కులకు 468 సాధించి రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించింది. బైపీసీ విభాగంలో సెకండ్ ఇయర్ లో శ్రీజ 1000 మార్కులకి 994 సాధించి రాష్ట్ర స్థాయిలో  రెండో ర్యాంక్ సాధించింది. గీతా కాలేజ్ కరస్పాండెంట్ రామాంజనేయులు, చైర్​పర్సన్​ఉష హర్షం వ్యక్తం చేసి స్టూడెంట్స్​ను అభినందించారు.