సత్తాచాటిన పేదింటి జ్యోతులు..ఒకరికి 4.. ఇంకొకరికి 2 ప్రభుత్వ కొలువులు

బోథ్​, వెలుగు : పేదిండ్లలో పుట్టిన ఆ అమ్మాయిలు పరిస్థితులకు ఎదురీది సత్తా చాటారు. పట్టుదలతో కష్టపడి ప్రభుత్వ కొలువులు సాధించారు. ఏకంగా ఒకరు నాలుగు ఉద్యోగాలు సాధిస్తే, మరొకరు రెండు కొలువులతో ఔరా అనిపించారు. బోథ్​ మండలం సోనాల గ్రామానికి చెందిన బోయిన్​పల్లి రాములు, లక్ష్మి దంపతులు గ్రామంలో చిన్నపాటి దుకాణంలో పూజా సామగ్రి అమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. వీరి మూడో కూతురు జ్యోతి చిన్ననాటి నుంచి చదువుల్లో రాణిస్తూ వచ్చింది. ఇటీవల విడుదలైన ఫలితాల్లో సత్తా చాటి  ఒకేసారి నాలుగు కొలువులు సాధించింది.

టీజీటీ, పీజీటీ, డీఎల్​తోపాటు తాజాగా ప్రకటించిన జేఎల్​కు ఎంపికై ఔరా అనిపించింది. టెన్త్​ క్లాస్​వరకు గ్రామంలోని జడ్పీ హైస్కూల్​లో చదివిన జ్యోతి.. ఇంటర్​బజార్​హత్నూర్​లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో, అనంతరం అక్కడి పద్మావతి డిగ్రీ కాలేజీలో తెలుగు లిటరేచర్ పూర్తిచేసింది. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ తెలుగు, తెలంగాణ యూనివర్సిటీలో 2021లో బీఈడీ పూర్తి చేసి సెట్ ఉత్తీర్ణత పొందింది.

2023లో కస్తూర్బా గాంధీ విద్యాలయాల పరిధిలో సీఆర్టీ తెలుగు సబ్జెక్టులో జిల్లాలో మొదటి ర్యాంకు సాధించి నేరడిగొండలోని కేజీబీవీలో ఉద్యోగం పొందింది. తాజాగా ఎంపికైన నాలుగు ఉద్యోగాల నుంచి డిగ్రీ కాలేజీలో అధ్యాపక ఉద్యోగంలో చేరుతానని తెలిపారు. మొదటి ప్రయత్నంలోనే నాలుగు ఉద్యోగాలు సాధించడంతో జిల్లా ప్రజలు ఆమెను అభినందిస్తున్నారు.

నాడు తమ్ముడు.. నేడు అక్క

బోథ్​ మండలం పార్డి ‘బి’  దేవుల్ ​నాయక్​తండాకు చెందిన రాథోడ్​ భీంరావు, హీరాబాయి దంపతుల కూతురు రాథోడ్​ జ్యోతి మొదటి ప్రయత్నంలోనే రెండు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైంది. 2019లో ఆమె తమ్ముడు అర్జున్​ రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి సత్తా చాటగా.. ఇపుడు అక్క జ్యోతి టీజీటీ, జేఎల్​కు ఎంపికైంది. మరోసారి గ్రామం పేరును చాటిన జ్యోతి కుటుంబాన్ని గ్రామస్తులు అభినందించారు.