కురుక్షేత్ర- ఖజురహో మధ్య నడిచే గీతా జయంతి ఎక్స్‌ప్రెస్ రైలులో ఆదివారం(అక్టోబర్ 13) ఉదయం మంటలు చెలరేగాయి. మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలోని ఇషానగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంటలు వ్యాపించడాన్ని గమనించిన ప్రయాణికులు వెంటనే రైల్వే సిబ్బందికి సమాచారం అందించగా.. వారు మంటలను ఆర్పివేశారు.
కోచ్ దిగువ భాగంలో రబ్బరు వేడెక్కడం వల్ల మంటలు చెలరేగాయని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో రైలు సుమారు గంటపాటు ఆలస్యంగా నిలిచిందని ఇషానగర్ స్టేషన్ మాస్టర్ ఆశిష్ యాదవ్ తెలిపారు.
రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్
మరో ఘటనలో ఉత్తరాఖండ్‌లోని రూర్కీ సమీపంలో రైల్వే ట్రాక్‌పై ఎల్‌పీజీ సిలిండర్ కనిపించడం కలకలం రేపింది. లలాండౌర్- ధంధేరా స్టేషన్ల మధ్య ఉదయం 6:35 గంటల ప్రాంతంలో ఈ ఘటన వెలుగు చూసింది. గూడ్స్ ట్రైన్ స్టేషన్ సమీపానికి వస్తుండగా.. పట్టాలపై గ్యాస్ సిలిండర్ ఉండటాన్ని లోకో పైలట్ గమనించారు. వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. అనంతరం అధికారులు సిలిండర్‌ను దూరంగా తీసుకెళ్లి పరిశీలించగా.. అది ఖాళీది అని తేలింది. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.