కేటీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని గీత కార్మికులు..
పెండింగ్ బిల్లులు చెల్లించాలని మధ్యాహ్న భోజన కార్మికులు..
యాదాద్రి, సూర్యా పేట, నల్గొండ అర్బన్, వెలుగు: ఉమ్మడి జిల్లా కలెక్టరేట్లు సోమవారం ధర్నాలతో దద్దరిల్లాయి. అంగన్‌వాడీ ఉద్యోగులు ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సిఫారసుల ప్రకారం కనీస వేతనం రూ.26 వేలు, పెన్షన్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ నల్లచీరలతో మహాధర్నా నిర్వహించారు. నల్గొండలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం 2017 నుంచి అంగన్వాడీలకు టీఏడీఏలు చెల్లించడం లేదని, 2018లో కేంద్రం పెంచిన రూ.1500 కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. చాలామంది రిటైర్మెంట్ అవుతున్నా వారికి పెన్షన్ ఇవ్వడంలేదని వాపోయారు.
రూ.6 వేల పెన్షన్‌తో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్ కు రూ.5 లక్షలు, ఆయాకు రూ. 3 లక్షలు చెల్లించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చినపాక లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షుడు ఎండీ సలీం, యాదాద్రి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దాసరి పాండు కల్లూరు మల్లేశం, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పొడిచెట్టి నాగమణి, ప్రధాన కార్యదర్శి బొందు పార్వతి, వర్కింగ్ ప్రెసిడెంట్ కె. విజయలక్ష్మి, నేతలు పాల్గొన్నారు.
గీత కార్మికుల ఆధ్వర్యంలో..
గౌడ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కల్లుగీత కార్మికులు డిమాండ్ చేశారు. సోమవారం సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి కలెక్టరేట్ల ఎదుట మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గీతకార్మికులందరికీ టూవీలర్లతో పాటు రుణాలు మంజూరు చేయాలని కోరారు. బీసీ కుల వృత్తిదారులకు ప్రభుత్వం ఇస్తామన్న రూ. 1 లక్ష ఆర్థిక సాయాన్ని తమకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సొసైటీలకు భూమి, కల్లు మార్కెట్, జిల్లా కేంద్రంలో నీరా, తాటి ఈత ఉత్పత్తుల పరిశ్రమలకు రూ.5 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని కోరారు. అనంతరం కలెక్టర్లకు వినతి పత్రం అందించారు. సూర్యాపేటలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఏలుగురి గోవిందు , మడ్డి అంజిబాబు, నల్గొండ జిల్లా అధ్యక్షుడు కొండ వెంకన్న, ప్రధాన కార్యదర్శి అచ్చాలు, యాదాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి బొలగాని జయ రాములు నేతలు పాల్గొన్నారు.
మధ్యాహ్న భోజన కార్మికుల ఆధ్వర్యంలో..
పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయాలని మధ్యాహ్న భోజన వర్కర్స్ యాదాద్రి కలెక్టరేట్, సూర్యాపేట డీఈవో ఆఫీస్ ముందు టమాట, మిర్చి కూరగాయలతో ధర్నా నిర్వహించారు. యాదాద్రిలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు ప్రేమ పావని మాట్లాడుతూ.. కూరగాయల ధరలు పెరగడంతో ప్రభుత్వం ఇచ్చే డబ్బులు దేనికీ సరిపోవడం లేదని వాపోయారు. అవి కూడా నెలల తరబడి పెండింగ్‌లో పెడుతోందని మండిపడ్డారు. సబ్సిడీపై కూరగాయలు ఇవ్వడంతో పాటు మోనూ చార్జిలు పెంచాలని డిమాండ్ చేశారు ఇప్పటికే పెంచిన రూ. 3 వేల వేతనం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ సూర్యాపేట జిల్లా కన్వీనర్ చెరకు యాకలక్ష్మి, మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షురాలు ఉప్పమ్మ, పట్టణ అధ్యక్షురాలు బంటు సైదమ్మ, పిట్టల నాగమణి, దేసోజు రమణ, దాసు పాల్గొన్నారు.