లండన్ లో ఉన్న షేక్స్ పియర్ గ్లోబ్ థియేటర్ లో పెర్ఫామ్ చేసే గొప్ప అవకాశం వచ్చిన అతి తక్కువమంది యాక్టర్స్ లో గీతాంజలి ఒకరు. నాటకం అయినా, ఫిల్మ్ అయినా... అందులో గీతాంజలి కులకర్ణి ఉన్నారంటే, ఆమె తాలూకు మార్కు కచ్చితంగా ఉంటుంది. రెండు దశాబ్దాలకుపైగా ఎంతోమంది హృదయాలను గెలుచుకున్న గీతాంజలి సినిమాల్లో ఎలా యాక్టింగ్ చేస్తుందో మాటల్లో చెప్పక్కర్లేదు. అప్పటి ‘కోర్టు’ అయినా, రీసెంట్ గా వచ్చిన ‘ఫొటోగ్రాఫ్’ ‘తాజ్ మహల్-1989‘ అయినా ఆమె టాలెంట్ కి అద్దం పడతాయి. ఇక, ఈమెను మన తెలుగు వాళ్లకు పరిచయం చేయాలంటే ‘జయం మనదేరా’ మూవీలో బసవయ్యగా యాక్ట్ చేసిన అతుల్ కులకర్ణి లైఫ్ పార్ట్నర్... ఈమే! ఎన్ని నాటకాలు వేసినా బోర్ కొట్టదంటున్న టాలెంటెడ్ యాక్టర్ గీతాంజలి కులకర్ణి జర్నీ ఆమె మాటల్లోనే.
నా పేరు గీతాంజలి కులకర్ణి. తూర్పు ముంబైలో ఉన్న ఐఐటీ, పోవయ్‌లో పుట్టి పెరిగా. మా అమ్మ అక్కడ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్లో పనిచేస్తుండేది. అక్కడున్న కేంద్రీయ విద్యాలయ్ లోనే నేను చదువుకున్నా. మా కాలనీ మొత్తం మహారాష్ట్ర వాళ్లే ఎక్కువ. గణేశ్ చతుర్ధి వచ్చిందంటే చాలు స్కిట్స్, డ్సాన్స్ తో హంగామా చేసేవాళ్లం. నాటకాలకు ఎంతో ఇష్టంగా వెళ్లే మహారాష్ట్రియన్ కల్చర్‌లో పెరగడం వల్ల... చిన్నప్పటి నుండే నాకు థియేటర్ మీద ప్రేమ పుట్టింది. రెగ్యులర్‌గా థియేటర్‌కు వెళ్తుండేదాన్ని. ఆ ఇన్సిపిరేషన్ తోనే నేను డ్రామా సొసైటీ యాక్టివ్‌గా ఉండే రుయా కాలేజీకి వెళ్లాను. అక్కడ చాలా మోనో- యాక్టింగ్ కాంపిటీషన్స్‌లో గెలుచుకున్నా. నిజం చెప్పాలంటే, స్కూల్ కంటే కూడా మా కాలనీయే నన్ను క్రియేటివ్ పర్సన్‌గా తీర్చిదిద్దింది. నాటకాలతో పాటు టీవీ కూడా నన్ను జనానికి దగ్గర చేసింది. దూరదర్శన్‌లో నేను చూసిన ఆర్ట్ ఫిల్మ్స్‌కి లెక్కేలేదు. చదువు విషయానికొస్తే నేనంత మంచి స్టూడెంట్నేం కాదు. కానీ, టెన్త్‌లో ఉన్నప్పుడే అందరికంటే డిఫరెంట్‌గా ఏదో ఒకటి చేయాలని డిసైడ్ అయ్యా. నా చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ వల్ల నేచురల్ గానే యాక్టింగ్ పై ప్రేమ పుట్టింది. ఆ డ్రీమ్ తోనే ముందుకెళ్లాను.
ఎన్ఎస్డీ నాకు పునర్జన్మ ఇచ్చింది...
యాక్టింగ్ అంటే నవ్వడం, ఏడవడం ఈ రెండే అనుకునేదాన్ని. నేనెంత వరకు చదువుతాను అనేదానిపై నాకొక ఐడియా కూడా ఉండేది కాదు. కానీ, యాక్టింగ్ అంటే పిచ్చి. అందుకే, స్కాలర్ షిప్ గెలుచుకుని మరీ ఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్ఎస్డీ) లో అడుగుపెట్టా. ఎన్ఎస్డీలో చేరడం నాకొక పునర్జన్మ. మొత్తం మారిపోయా. హిస్టరీని, మనుషులను, లిటరేచర్ని, పాలిటిక్స్‌ని చూసే నా యాంగిల్ మారిపోయింది. అక్కడ టీచర్స్ చెప్పిన పాఠాలు నా మీద చాలా ఇంపాక్ట్ చూపించాయి. కారిడార్ లో నడుచుకుంటూ వెళ్తుంటే, టీచర్లు ఎదురొచ్చి... ‘దుపట్టాను ఇలా వేసుకోవాలి. మహారాణిలాగ నడవాలి’ అని చెప్పి చూపిస్తుండేవాళ్లు. ఎన్ఎస్డీకి దేశం నలుమూలల నుండి స్టూడెంట్స్ వస్తారు. వాళ్లతో మూడేళ్లు కలిసుంటాం. దాని వల్ల యాక్టర్ అవడానికి అవసరమైన ఫార్ములా నేర్చుకున్నానో, లేదో తెలియదు.. కానీ, ఎలా బతకాలనే విషయాన్ని మాత్రం చాలా క్లియర్‌గా తెలుసుకున్నాను. అదే అన్నింటికంటే ఇంపార్టెంట్ అని నేననుకుంటాను. ఈ విషయం నేను ఎన్ఎస్డీలో ఉన్నప్పుడు తెలియలేదు. కానీ, ఇరవై ఏళ్ల తర్వాత ఆ అనుభవాలు ఎంత విలువైనవో, లైఫ్‌ని లీడ్ చేయడానికి అవి ఇండైరెక్ట్‌గా ఎంతలా మోటివేట్ చేస్తాయో ఎక్స్ పీరియన్స్ చేస్తున్నా.
థియేటరే ప్రాణంగా
ఎన్ఎస్డీ నుండి తిరిగి ముంబై వచ్చాక, ఫిల్మ్స్ లోకి కాకుండా నాకు ఇష్టమైన నాటకాలు వేయడం మొదలుపెట్టా. ప్లేరైట్- డైరెక్టర్ పరేశ్ మొకషితో పని చేయడం వల్ల యాక్టింగ్ పై నాకు మంచి పట్టు చిక్కింది. పరేశ్ లవింగ్ పర్సన్. జనరల్‌గా డైరెక్టర్స్ ఫ్యూడల్ ఆటిట్యూడ్‌తో ఉంటారు. అప్పట్లో అదింకా ఎక్కువగా ఉండేది. ఎన్ఎస్డీ, మరాఠీ థియేటర్.. ఈ రెండింటిలోనూ ఎక్స్ పీరియన్స్ ఉండటం నాకు బాగా కలిసొచ్చింది. థియేటర్ తో పాటు టీవీ సీరియల్స్‌లో కూడా యాక్ట్ చేయడం మొదలుపెట్టా. టీవీ ఇండస్ట్రీలో సంపాదించిన డబ్బులతోనే బ్రెస్ట్ క్యాన్సర్ ఆధారంగా తీసిన ‘రికామి బజు’ ( యాన్ ఎంప్టీ కార్నర్) ప్లే ని ప్రొడ్యూస్ చేయగలిగా. అప్పుడే ప్రాసెస్‌లో భాగం కావాలని రియలైజ్ అయ్యా. ఆ ప్లేలో నేను డ్రైవర్‌గా, బ్యాక్ స్టేజ్ వర్కర్, ప్రొడ్యూసర్, యాక్టర్‌గా పని చేశా. నేను నాటకాలు ఎందుకు వేస్తున్నానో అప్పుడే పూర్తిగా అర్థం చేసుకున్నా.
బోర్ కొట్టదు..
సునీల్ షాన్ బాగ్‌తో ‘సెక్స్, మొరాలిటీ అండ్ సెన్సార్షిప్’ అతుల్ కుమార్ తో షేక్స్పియర్ రాసిన ట్వల్త్ నైట్ ఆధారంగా తీసిన ‘పియా బెహ్రూపియా’ మానవ్ కౌల్‌తో ‘హత్ కా ఆయా... శూన్యా’ మోహిత్ టకల్కర్ తో ‘ గజబ్ కహాని ’ వంటి పాపులర్ నాటకాల్లో యాక్ట్ చేశాక అవే నాకు చాలా కంఫర్టబుల్ అనిపించాయి. ఎన్నిసార్లు రిహార్సల్స్ చేసినా, 200- నుంచి 300 షోలు చేసినా సరే ఆ ప్రాసెస్ కొంచెం కూడా బోర్ కొట్టనంత ప్రేమ నాటకాల మీద కలిగింది. ‘ పియా బెహ్రూపియా’ ను గత ఏడు సంవత్సరాల నుండి చేస్తూనే ఉన్నాను. చేసిన ప్రతిసారి నాలో నేనే ఒక డిఫరెన్స్ కనుక్కుంటాను. లైవ్ పెర్ఫామెన్స్ లో ఒక థ్రిల్ ఉంటుంది. దాన్ని రెండో సారి చేయడానికి ఉండదు, రెండోసారి ఆలోచించడానికి ఉండదు. ఆ మూమెంట్ లో జీవించాలి అంతే. ఇది నాకు చాలా ఆర్గానిక్ గా అనిపిస్తుంది. ఇదొక రియల్ లైఫ్ అనిపిస్తుంది. టెక్నాలజీ ఎంత మారినా సరే ఈ కళలో ఒక సోల్ ఉంటుంది. 2009లో లండన్‌లో ఉన్న షేక్స్ పియర్ గ్లోబ్ థియేటర్ కూర్చొని నాటకం చూసిన నేను.. 2012లో ఆ స్టేజీ మీద ఉన్నా. అలాంటి గొప్ప స్టేజీ మీద యాక్ట్ చేసే అవకాశం వచ్చినప్పుడు ఇదొక మ్యాజిక్‌లాగా అనిపించింది. దాన్ని నేను నమ్మలేకపోయా. బట్, నేను దేవుడిని నమ్మను!
యాక్టింగ్ కెరీర్
2009లో ‘ఢిల్లీ-6’ అనే హిందీ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాను. ఆ తర్వాత రాగిణి ఎమ్ఎమ్ఎస్-2, పియా బెహ్రుపియా, కోర్టు, ఫోటోగ్రాఫ్, మరాఠీలో ఆనంది గోపాల్ వంటి మూవీస్, టీవీ సీరీస్‌ల్లో యాక్ట్ చేశా. టీవీ సీరీస్ లలో, ఆపరేషన్ ఎంబీబీఎస్, టీవీఎఫ్ లో వచ్చిన గుల్లక్, నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన సెలక్షన్ డే, తాజ్ మహల్-1989, నాకు మంచి పేరు తీసుకొచ్చాయి. ఆపరేషన్ ఎంబీబీఎస్ ఫస్ట్ సీజన్ లో నాది చాలా చిన్న రోల్. కానీ, సెకండ్ సీజ డైరెక్టర్ అమృత్ నా రోల్ ని చాలా బాగా రాశాడు. మెడికల్ కాలేజీ డీన్ గా యాక్ట్ చేసి, ప్యాండమిక్ లో డాక్టర్లు పడిన కష్టాలను బయటపెట్టిన ఈ రోల్ ని చూసి నాకు ఎన్ని మెసేజ్‌లు వచ్చాయో లెక్కలేదు. ‘మేడం నేను ఏడ్చాను’ అని వచ్చిన మెసేజ్‌లకు ఏమని రిప్లయ్ ఇవ్వగలం? కమర్షియల్ మూవీస్ కాకుండా కూడా నేను ఇలాంటి ఇండిపెండెంట్ సినిమాలు చేయడానికి ఇష్టపడతా. రియాలిటీ ఆఫ్ లైఫ్‌ని స్ర్కీన్ మీదకు తీసుకురావడానికి ట్రై చేస్తా. అందుకే, స్క్రిప్ట్ చదివాకే నేను యాక్ట్ చెయ్యాలా? వద్దా? అని డిసైడవుతా.
మాది మినిమలిజం
నేను, అతుల్ కెరీర్ మొదలుపెట్టినప్పుడు మాకేం లేదు. అవకాశాలు కూడా లేవు. అప్పటి నుండి అడ్జెస్ట్ అవ్వడం అలవాటు చేసుకున్నాం. బతకడానికి ఏమేం కావాలో అర్థం చేసుకున్నాం. మనకు ఫ్రిడ్జ్ అక్కర్లేదు, మంచం అక్కర్లేదు ఇలా అవసరం లేనివాటిని వదిలేసి ఇద్దరం మినిమలిజం వైపు మళ్లాం. మా ఇంట్లో చాలా తక్కువ ఫర్నిచర్ ఉంటుంది. సోఫా, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, బెడ్స్ కూడా మా ఇంట్లో ఉండవు. ఇల్లు ఖాళీగా ఉంటేనే, దానికి ఒక ఆత్మ ఉంటుందనే విషయాన్ని కూడా రియలైజ్ అయ్యాం. మేమిద్దరం ఫ్లోర్ పైనే పడుకుంటాం. లైఫ్ ని లగ్జరీ గా మార్చుకోవడం కంటే, మనం సంపాదించినదాన్ని తిరిగి సొసైటీకి ఇవ్వడమే లైఫ్ పర్పస్ అని మేం బాగా నమ్ముతాం. ఇక, నా పర్సనల్ లైఫ్ గురించి సోషల్ మీడియాలో పంచుకోవడం కూడా ఇంట్రెస్ట్ ఉండదు. అందుకే, నా గురించి సోషల్ మీడియాలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉండదు.
మా డ్రీమ్ ప్రాజెక్ట్
ఎడ్యుకేషన్‌కి సంబంధించి రకరకాల సమస్యలను చర్చించే గ్రామ్ మంగల్ ఆర్గనైజేషన్‌ని చూశాక, నేను, అతుల్ కలిసి ఒక ట్రస్ట్ పెట్టాలనుకున్నాం. రూరల్ మహారాష్ట్ర వడాలో క్వాలిటీ ఎడ్యుకేషన్ సపోర్ట్ ట్రస్ట్ (క్వాస్ట్) పుట్టింది. ఈ ట్రస్ట్ ద్వారా మూడు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసున్న పిల్లలకు ఫ్రీగా రీడింగ్ మెటీరియల్స్, టెక్ట్స్ బుక్స్‌ని పంచుతున్నాం. మేం పొందింది పదిమందికి పంచాలనే ఉద్దేశంతో ఫెలోషిప్ ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ చేశాం. పిల్లలకోసం నాటకాలు ప్రదర్శించడానికి లోకల్ యాక్టర్స్‌తో కలిసి పని చేస్తున్నాం. దీనికోసం ముందుగా కొన్ని కథలను గ్రామాల్లో పర్ఫార్మ్ చేయడం మొదలుపెట్టాం. వాటిని చిన్మయ్ కెల్కార్ డైరెక్ట్ చేశాడు. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. తర్వాత మాకు ’గోస్ట్రాంగ్’ ని మొదలుపెట్టడానికి ఫండింగ్ వచ్చింది. దీని ద్వారా ఫ్యూచర్ తాలూకు నాటకాల ఆడియన్స్‌ని ప్రిపేర్ చేస్తున్నాం. నాటకాల్లో యాక్ట్ చెయ్యగల యాక్టర్స్‌ని తయారు చేస్తున్నాం. అలా ఈ ట్రస్ట్ ద్వారా ఎవరూ నమ్మలేని వర్క్ బయటకు వస్తోంది. ‘గోస్ట్రాంగ్’ కోసం నేను నాటకాలు డైరెక్ట్ చేశా. చేస్తున్నా. అలాగే నాకు ఉత్సాహం, సంతోషం కలిగించే ఫిల్మ్స్ కూడా చేస్తున్నాను. ఒక మనిషికి ఇంతకు మించి ఏం కావాలి? నేను చేసే పనిని ప్రేమిస్తా. సేమ్ వేవ్ లెంగ్త్ ఉన్న మనుషులతోనే పని చేస్తా. ఈ అవకాశం ఎంతమందికి ఉంటుంది? నేను దాన్ని సంపాదించా!
ప్రేమ ప్రయాణం
1993లో డ్రామా స్కూల్లో చదువుతున్నప్పుడు అతుల్ కులకర్ణి నాకు సీనియర్. ఆయన నాకన్న వయసులో ఎనిమిదేండ్లు పెద్దవాడు. అప్పటికే మంచి యాక్టర్ కూడా. అందరూ అతడి యాక్టింగ్‌ని కళ్లార్పకుండా చూస్తూ ఉండేవాళ్లు. ఎవ్వరైనా సరే అతని టాలెంట్, పర్సనాలిటీని చూస్తూ ఇంప్రెస్ అవ్వకుండా ఉండలేరు. మూడు సంవత్సరాలు డేటింగ్ చేసిన తర్వాత, అంటే నా గ్రాడ్యుయేషన్ అయిన వెంటనే మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. పెళ్లి విషయం ఇంట్లో చెప్పినప్పుడు... ‘మేజర్ అయ్యాక నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయానికి నీదే రెస్పాన్సిబిలిటీ’ అన్నారు మా పేరెంట్స్. నా నిర్ణయం సరైనదే అని ప్రూవ్ చేసుకున్నా. పెళ్లికి ముందే అతుల్, నేను కలిసి మాకు పిల్లలు వద్దని డిసైడ్ అయ్యాం. విచిత్రం ఏంటంటే ఎన్ఎస్డీలో నేను, అతుల్ ఒక్కసారి కూడా కలిసి యాక్ట్ చేయలేదు. అతని టాలెంట్ ముందు నేను నిలవలేను అనిపించేది. ఇప్పుడైతే అతడికి అపోజిట్ గా యాక్ట్ చేయడానికి అస్సలు భయపడను.
::: గుణ