- 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతు
- 2018లో బీఆర్ఎస్కు జై..
- ఇటీవల చంద్రబాబు అరెస్ట్‌పై కేటీఆర్ కామెంట్లు
- సెటిలర్ల ఆగ్రహంతో ఆ పార్టీకి కొంత డ్యామేజ్
- టీడీపీ పోటీలో లేకపోవడంతో తమకే మద్దతు అంటున్న హస్తం
హైదరాబాద్, వెలుగు : గ్రేటర్ హైదరాబాద్ మినీ ఇండియా. ఇక్కడ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ముఖ్యంగా ఆంధ్ర, రాయలసీమ ప్రజలు ఎక్కువగా నివసిస్తుంటారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో సిటీలో సెటిలర్ల ఓట్లు కీలకంగా మారాయి. ప్రధానంగా కూకట్పల్లి, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, మల్కాజ్గిరి, పటాన్ చెరు, కుత్బుల్లాపూర్, మేడ్చల్ తదితర సెగ్మెంట్లలో వీరి ప్రభావం అధికంగా ఉంటుంది. కూకట్పల్లి, ఎల్బీనగర్, శేరిలింగంపల్లిలో గెలుపు, ఓటములను డిసైడ్ చేసేది వీరే అనడంలో సందేహం లేదు. దీంతో ఆయా సెగ్మెంట్లలో బరిలో నిలిచిన అభ్యర్థులు సెటిలర్లను తమవైపు తిప్పుకునేందుకు తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు. ఆంధ్రాలో ప్రధాన కులాలైన కమ్మ, కాపులతో పాటు ఇతర కులాలకు చెందిన ఓటర్లు ఉన్నారు. ఇక కమ్మ కులానికి చెందిన అభ్యర్థులను బరిలో నిలిపి బీఆర్ఎస్ సెటిలర్ల ఓట్లను ఆకర్షించాలని చూస్తుంటే, జనసేనతో పొత్తుతో కాపు ఓటర్లకు బీజేపీ గాలం వేస్తుంది. అయితే సెటిలర్ ఓటర్లు ప్రతి ఎన్నికల్లో చాలా తెలివిగా వ్యవహరిస్తూ.. ఒకరికే పట్టం కడుతూ వస్తున్నారు. రాష్ట్రం విడిపోయాక కూడా టీడీపీ2014 అసెంబ్లీ ఎన్నికల్లో 15 స్థానాలు గెలిచింది. ఇందులో ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్‌కు చెందిన సెటిలర్స్ ప్రభావంతో 10 స్థానాలను కైవసం చేసుకుంది. 2018 ఎన్నికల్లో ఆ స్థానాల్లో బీఆర్ఎస్ పాగా వేసింది. ఇలా రెండుసార్లు ఇతర పార్టీలకు అవకాశం ఇచ్చిన సెటిలర్లు ప్రస్తుతం తమకే అనుకూలంగా ఉంటారని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి.
కాంగ్రెస్‌కు కలిసొచ్చేనా..
సెటిలర్లు అధికంగా నివసించే కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్ తదితర సెగ్మెంట్లలో కాంగ్రెస్‌కు కలిసొచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆ మూడు చోట్ల ఓటు ఎవరికి అని సెటిలర్లను అడిగాతే.. చాలామంది ఈసారి కాంగ్రెస్‌కు చాన్స్ ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. సిటీలో టీడీపీకి ఓటు బ్యాంకు ఉండగా.. చంద్రబాబు అరెస్టు, ఇతర కారణాలతో ఈసారి ఆ పార్టీ పోటీలో లేదు. దీంతో టీడీపీ
సెటిలర్ల ఓటు బ్యాంక్ తమకే పడుతుందనే నమ్మకంతో కాంగ్రెస్ ఉంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పూర్వపు టీడీపీ నేత కావడం, వివిధ ఇంటర్వ్యూల్లో చంద్రబాబు తన రాజకీయ గురువు అని చెబుతుండటం సెటిలర్ల ఓట్లను ఆకర్షించడంలో భాగమే అని తెలుస్తోంది. సెటిలర్లను దృష్టిలో పెట్టుకొనే కూకట్ పల్లి కాంగ్రెస్ అభ్యర్థిగా సెటిలర్ బండి రమేశ్‌కు టికెట్ ఇచ్చారు. 2018 ఎన్నికల్లో పొత్తులో కాంగ్రెస్, టీడీపీ పొత్తు కూడా పెట్టుకుని పోటీ చేశాయి. చంద్రబాబునాయుడు అరెస్టును కూడా కాంగ్రెస్ నేతలు, సెటిలర్లు ఖండించారు. మల్కాజిగిరి నుంచి ఎంపీగా పోటీ చేసిన రేవంత్ కు అక్కడి టీడీపీ కార్యకర్తలు, సెటిలర్లు సహకరించారనే టాక్ ఉంది. దీంతో ఆయా అంశాలు తమకు కలిసొస్తాయని కాంగ్రెస్ భావి
స్తుంది. సినీ పరిశ్రమలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారికి కూడా కాంగ్రెస్ దగ్గరవుతున్నట్లు తెలుస్తుంది. దీనిలో భాగంగానే నిర్మాత నట్టికుమార్ సెటిలర్లు, టీడీపీ కార్యకర్తలు ఈసారి కాంగ్రెస్‌కు ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
బీజేపీ ప్లాన్ సక్సెస్ అవుతుందా.?
గ్రేటర్లో సెటిలర్ల ఓట్లను పొందడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. వీరిలో ప్రధానంగా కమ్మ, కాపు, ఎస్సీ ఓట్లు ఉన్నాయి. వారిని తమవైపు తిప్పుకునేందుకు జనసేన పార్టీలో పొత్తు పెట్టుకున్నట్లు తెలుస్తుంది. ఈ పొత్తులో భాగంగా రాష్ట్రంలో జనసేనకు 8 స్థానాలకు కేటాయించింది. కాపు ఓట్లే టార్గెట్‌గా అదే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి ప్రేమ్ కుమార్‌ను జనసేన కూకట్ పల్లి సెగ్మెంట్లో పోటీలో నిలిపింది. అయితే, ఏపీలో టీడీపీ, జనసేన పొత్తులో ఉన్నాయి. ఇక్కడ ఉన్న కమ్మ ఓట్లకోసం జనసేన– టీడీపీ పొత్తు, కాపు ఓట్ల కోసం జనసేనతో పొత్తు పనికి వస్తుందని బీజేపీ భావిస్తున్నది.
ALSO READ : పట్నంపై పట్టు ఎవరిది? .. ఇబ్రహీంపట్నం సెగ్మెంట్లో ట్రయాంగిల్ ఫైట్
కేటీఆర్ కామెంట్లతో దూరమైతున్నరా..
2018 ఎన్నికల్లో సెటిలర్లు ఎక్కువగా ఉండే స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించారు. ఈసారి బీఆర్ఎస్ ప్రభుత్వంపై పెరిగిన వ్యతిరేకత, చంద్రబాబు అరెస్టు, ఆందోళనలు, నిరసనలపై కేటీఆర్ కామెంట్లు సెటిలర్ల ఓట్లను దూరం చేయొచ్చననే అభిప్రాయం వ్యక్తమవుతుంది. పార్టీ ముఖ్య నేత చేసిన ఆ కామెంట్లు అభ్యర్థులకు చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. కేటీఆర్..కామెంట్లను టీడీపీ, కమ్మ సంఘాలు తీవ్రంగా పరిగణించాయి. దీంతో కూకట్ పల్లి బీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు ‘ ఇక్కడ సెటిలర్లు ఎవరూ లేరు. ఉన్నదంతా..హైదరాబాదీలే’ అని సర్దిజెప్పే ప్రయత్నం చేశారు. అయినా.. కేటీఆర్ తన వ్యాఖ్యల మంటను తగ్గించడానికి ఖమ్మంలో కేసీఆర్ రాజకీయ గురువు ఎన్టీఆర్ అంటూ ప్రశంసలు కురిపించారు. అలాగే, సెటిలర్ ఐటీ ఎంప్లాయీస్ ఓట్లు బీఆర్ఎస్కు పాజిటివ్‌గా పడొచ్చని తెలుస్తోంది.