
- హౌసింగ్ అధికారుల అసోసియేషన్ విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ కోసం హౌసింగ్ కార్పొరేషన్ రిక్రూట్ చేసుకోనున్న నియామకాల్లో కారుణ్య కుటుంబాలకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని హౌసింగ్ ఏఈ, వర్క్ ఇన్ స్పెక్టర్ అసోసియేషన్ కోరింది. హౌసింగ్ కార్పొరేషన్ లో వర్క్ ఇన్ స్పెక్టర్స్, ఏఈ, డీఈఈ, ఈఈ, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్లుగా పని చేస్తూ అనేక మంది మరణించారని అసోసియేషన్ గుర్తు చేసింది.
ఆ కుటుంబాల్లో అర్హత ఉన్నవారికి ఈ నియామకాల్లో అవకాశం కల్పించాలని అసోసియేన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రవీందర్ రెడ్డి, బొగ్గుల వెంకట్రామ్ రెడ్డిలు ఆదివారం పత్రిక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు.100 కుటుంబాలు 2008 నుంచి కారుణ్య నియామకాల కోసం ఎదురు చూస్తున్నాయని నేతలు గుర్తు చేశారు. గత 10 ఏండ్లుగా అప్పటి ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోలేదని, ఈ ప్రభుత్వం అయినా వీరికి న్యాయం చేయాలని నేతలు విజ్ఞప్తి చేశారు. ఇందిరమ్మ స్కీమ్ ను విజయవంతం చేయడానికి గత ఏడాది నుంచి ఏఈ, డీఈఈలు, వర్క్ ఇన్ స్పెక్టర్లు గ్రామాలకు వెళ్లి సర్వేల్లో పాల్గొంటున్నారని నేతలు పేర్కొన్నారు. కాగా, ప్రభుత్వం ఇటీవల 390 ఏఈలను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించడానికి నోటిఫికేషన్ ఇచ్చింది.