రైతులకు నష్ట పరిహారం ఇవ్వండి.. అప్పుడే ప్రాజెక్టు పనులు ప్రారంభించండి: డీకే అరుణ

నాగర్ కర్నూల్: పాలమూరు రంగారెడ్డి  ఎత్తిపోతల ప్రాజెక్టు  పనులు ప్రారంభించే ముందు భూమిని కోల్పోతున్న రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. ప్రాజెక్టు కింద భూమిని కోల్పోయిన తాండూరు మండలం కుమ్మెర గ్రామ రైతు అల్లోజి మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.. అల్లోజీ మృతదేహానికి నివాళులర్పించి ఆయన కుటుంబాన్ని డీకే అరుణ పరామర్శించారు.   

ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ.. ఎన్నికల్లో లబ్ధి కోసమే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తున్నారని ఆరోపించారు. రైతులకు నష్టపరిహారం  ఇవ్వకుండా ప్రాజెక్టు పనులు మొదలు పెట్టడమేంటని ప్రశ్నించారు. ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం సీఎం కేసీఆర్ చేస్తున్నారని డీకే అరుణ అన్నారు.  రీడిజైన్ పేరుతో ప్రాజెక్టు నిధులను కమిషన్ల రూపంలో కాజేస్తున్నారని డీకే అరుణ మండిపడ్డారు. తక్షణమే రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.