జయశంకర్ భూపాలపల్లి/భూపాలపల్లి రూరల్/ఏటూరునాగారం/ములుగు, వెలుగు : భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను బుధవారం సెంట్రల్ టీం మెంబర్స్ పరిశీలించారు. అనంతరం ఆయా జిల్లాల్లో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాల్లో జరిగిన నష్టంపై కలెక్టర్లు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సెంట్రల్ టీంకు వివరించారు. భూపాలపల్లి జిల్లా జెన్‌కో గెస్ట్‌హౌజ్‌లో జరిగిన రివ్యూలో కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ చిట్యాల, రేగొండ, గణపురం మండలాల్లో ఒక్క రాత్రిలోనే 60 సెంటీమీటర్ల వర్షం పడడంతో తీవ్ర నష్టం జరిగిందని, 6 మండలాల పరిధిలోని 32 గ్రామాలు దెబ్బతిన్నాయని, నలుగురు చనిపోగా, మరో వ్యక్తి గల్లంతైనట్లు చెప్పారు.
ALSO READ:కార్పొరేటర్లకు నిధులు ఇవ్వాలి : బీజేపీ కార్పొరేటర్లు
భారీ వరదల వల్ల 162 చెరువులకు నష్టం కలిగిందని, 42 ఇండ్లు పూర్తిగా, 486 ఇండ్లు పాక్షికంగా కూలిపోగా, 15,690 ఎకరాల్లో వరి, 15,381 ఎకరాల్లో పత్తి, 2,500ఎకరాల్లో మిర్చి, 264 ఎకరాల్లో ఇతర పంటలు నష్టం వాటిల్లిందని కలెక్టర్ చెప్పారు. ములుగు కలెక్టరేట్‌లో ప్రత్యేక అధికారి యస్. కృష్ణఆదిత్య, కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడారు. వరదల వల్ల 54 గ్రామాలు, 27 లోతట్టు ప్రాంతాల్లో నష్టం జరిగిందని, 17 మంది నీటిలో చనిపోయినట్లు తెలిపారు. 3,135 ఎకరాల్లో వరి, 3,020 ఎకరాల్లో పత్తి, 124 ఎకరాల్లో మిర్చి కలిపి మొత్తం 7,766 ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. చెరువులు, పంచాయతీ రాజ్, ఆర్‌అండ్‌బీ రోడ్లు, విద్యుత్‌లైన్లకు నష్టం జరిగిందని వివరించారు. ఆయా రివ్యూల్లో ఎస్పీలు పుల్ల కరుణాకర్, గాష్ ఆలం, డీఎఫ్‌వో రాహుల్ కిషన్ పాల్గొన్నారు.
నష్టం వివరాలు ఇవ్వాలి
భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వరదల వల్ల జరిగిన నష్టం రిపోర్టు అందజేయాలని సెంట్రల్ టీం మెంబర్, ఎన్‌డీఎంఏ జాయింట్ సెక్రటరీ కునాల్ సత్యార్థి ఆదేశించారు. రివ్యూ అనంతరం ఆయన మాట్లాడుతూ నీటిపారుదల శాఖ కింద దెబ్బతిన్న చెరువులు, కాల్వల రిపేర్లకు ప్రపోజల్స్ పంపించాలని సూచించారు. దెబ్బతిన్న పంచాయతీ, ఆర్‌అండ్‌బీ రోడ్లు, హైవేలకు సంబంధించి విపత్తు చట్టం కింద సాయం, తదితర వివరాలతో రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు. బాధితులకు పరిహారం అందించే విధంగా ప్రపోజల్స్ రెడీ చేయాలని సూచించారు.
ఫీల్డ్ లెవల్‌లో పర్యటించాలి
మహబూబాబాద్, వెలుగు : ఆఫీసర్లు ఫీల్డ్ లెవల్‌లో పర్యటించి వరదల వల్ల కలిగిన నష్టంపై రిపోర్టు ఇవ్వాలని మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. కలెక్టర్ శశాంక, జడ్పీచైర్మన్ ఆంగోత్ బిందు, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డితో కలిసి బుధవారం రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పంటలు, రోడ్లు, విద్యుత్ శాఖకు జరిగిన నష్టంపై రిపోర్టులు ఇవ్వాలని సూచించారు. తాత్కాలిక పనులు, శాశ్వత పనులకు సంబంధించిన రిపోర్టులను వేర్వేరుగా ఇవ్వాలని చెప్పారు.