కోల్‌బెల్ట్, వెలుగు : మందమర్రి ఏరియా సింగరేణి కల్యాణఖని ఓపెన్ కాస్ట్ నిర్వాసిత దుబ్బగూడెం ఆర్‌అండ్‌ఆర్ కాలనీ ఏర్పాటులో సింగరేణి యాజమాన్యం ఆలస్యం చేస్తోందని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. మంచిర్యాల జిల్లా కాసీపేట మండలం దుబ్బాగూడెం ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో చేపట్టిన పనులను సోమవారం ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ కళ్యాణిఖని ఓపెన్ కాస్ట్ మైన్ కోసం ఇండ్లు, భూములు కోల్పోయిన నిర్వాసితులకు సింగరేణి యాజమాన్యం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
పరిహారం కోసం దుబ్బగూడెం నిర్వాసితులు చాలా కాలం పాటు తిరిగారని, ఆలస్యంగా వచ్చినప్పటికీ తక్కువ పరిహారమే ఇచ్చారని అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్మాణాలు క్వాలిటీగా ఉండాలని, గ్రామస్తుల అవసరాలు తీర్చేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. గుడికి అనుబంధంగా మండపం కూడా కడితే గ్రామస్తులు ఫంక్షన్లు నిర్వహించుకునేందుకు వీలుంటుందన్నారు.
ఈ నెల 24న ఖానాపూర్‌లో నిర్వహించనున్న కాళేశ్వరంపై కాగ్ రిపోర్ట్ సదస్సుకు భారీ సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట ఆర్గనైజింగ్ సెక్రటరీ బి.బాబన్న, మంచిర్యాల జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాంచందర్‌రెడ్డి, గోనెల శ్రీనివాస్, విద్యార్థి, యువజన సమితి జిల్లా అధ్యక్షుడు బచ్చలి ప్రవీణ్‌కుమార్, సిరాజ్, సోషల్ మీడియా చైర్మన్ పాముల వెంకటసాయి పాల్గొన్నారు.