అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా:  పాయల్ శంకర్

ఆదిలాబాద్, వెలుగు: బీజేపీ ఆదిలాబాద్ అసెంబ్లీ టికెట్ ను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ కు కేటాయించడంతో సోమవారం నవశక్తి దుర్గామాత ఆలయంలో పూజలు చేసి ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలు జోగు రామన్నకు మూడు సార్లు ఎమ్మెల్యేగా అవకాశమిస్తే అభివృద్ధిని పక్కన బెట్టి సొంత లాభం చూసుకున్నారని, ఇన్నేండ్లపాటు అధికారంలో ఉండి ఎవరికీ న్యాయం చేయలేదన్నారు.

మూడు సార్లు పోటీ చేసి ఓడిపోయినా.. అనుక్షణం ఆదిలాబాద్​ ప్రజల వెంటే ఉంటూ ఏ ఆపద వచ్చినా ఆదుకున్నానని, ఈసారి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. అభివృద్ధి చేసి చూపుతానన్నారు. పదేండ్లుగా ఎన్నో కేసులు తన మీద, కార్యకర్తల మీద వేసినా ప్రజల సంక్షేమం కోసం పోరాడుతూనే ఉన్నామన్నారు. మంగళవారం బేల మండలం సదల్పూర్ గ్రామంలోని ఆదివాసీల ఆరాధ్య దైవం బైరాన్ దేవ్ ఆలయంలో పూజలు చేసి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు వేణుగోపాల్, మయూర్ చంద్ర, రఘుపతి, జోగు రవి, అకుల ప్రవీణ్, దినేశ్ మాటోలియా పాల్గొన్నారు.