బాలులారా.. రండు.. జాలమేలనే నేడు? చల్లులు భుజియించు సమయమయ్యే అలసియున్నారెంతో పలుకులో దైన్యంబు మిమ్మావరించెనో మిత్రులారా!
ఈ పద్యం మీకు గుర్తుందా స్కూల్లో చదువుకున్నప్పుడు చట్టులారగించుట. అనే పాఠంలో శ్రీకృష్ణుడు తనతో పాలు కలిసి గోవులు కాస్తున్న గోప బాలకులను లంచ్ కి పిలుస్తాడు. తానొక భగవంతుడన్న విషయం మరిచి వారితో సమానంగా తన ఆహారాన్ని పంచుకొని, వారు తెచ్చిన ఆహార పదార్థాలను తింటూ లంచ్ చేస్తాడు. నలుగురితో కలిసి తినడంలో ఉన్న ఆనందాన్ని శ్రీకృష్ణుడు త్రేతాయుగంలోనే చెప్పాడు. మరి ఈ కాలంలో ఎలా తింటున్నారు? నలుగురితో కలిసి తింటున్నారా?
శ్రీకృష్ణుడి చుట్టూ కూర్చున్న గోప బాలకులు చద్ది మూటలు విప్పారు. తన మూటలోంచి ఉదగాయ తీసి అందరికీ ఒకడు ఊపిస్తాడు. ఇంకొకడు భక్ష్యాలు చూసి నోరూరేలా చేస్తాడు. ఇంకొకడు తను తెచ్చుకున్న పదార్థాలన్నీ దోస్తులతో కలిసి పంచుకొని, వారు పెట్టింది తిని కడుపు నింపుకుంటాడు. అలా ఒకరు తెచ్చుకున్న ఫుడ్ ఇంకొకడు పంచుకొని, నవ్వుతూ, ముచ్చట్లు పెడుతూ ఆరోజు శ్రీకృష్ణుడితో కలిసి గోపబాలకులందరూ లంచ్ చేస్తారు. పోతన రచించిన మహా భాగవతంలోని ఈ ఘట్టం గురించి తెలుగు మాష్టారు చెప్పుంటే అందరూ ఇష్టంగా, ఇంట్రెస్ట్ విని ఉంటారు. కలిసి తినడంలో ఉన్న ఆనందం అది. అయితే..
ఈరోజుల్లో జనాలు అలా తింటున్నారా? అంటే లేదనే చెప్పాలి. ఎవరికి అకలేసినప్పుడు వాళ్లు టిఫిన్ బాక్సులు ఓపెన్ చేసి లంచ్ కానిచ్చేస్తున్నారు. పక్కవాడు ఉన్నాడో లేదో. అసలు వాళ్లు తినడానికి ఏమైనా తెచ్చుకున్నాడో లేదో కూడా ఆలోచించడం లేదు. నిజానికి ఇది ఎవరి తప్పు కాదు. కాలక్రమేణా మనిషి ఆలోచనలో, ప్రవర్తనలో వచ్చిన మార్పు ఒంటరి జీవితానికి అలవాటు పడడం కూడా ఒక కారణంగా నిపుణులు చెప్పున్నారు.. కానీ ఇప్పుడు కాలమహిమో లేదంటే.. తోటివారితో పోటీ పడే లైఫ్ స్టైల్ కారణమో కానీ భోజనం చేసే పద్ధతి చాలా మారిపోయింది.
ఒకప్పుడు మగవాళ్లు ఉద్యోగం చేస్తే ఆడవాళ్లు ఇంట్లో ఉండే ఇంటిపనులు చక్కబెట్టేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. భార్యాభర్తలిద్దరు పనిచేస్తేనే గానీ.. అవసరాలు తీరని పరిస్థితి. ఈ క్రమంలోనే చాలా ఇళ్లలో వంట చేయడం కూడా మానేశారు. దారిలో బ్రేక్ ఫాస్ట్ చేయడం, అకలేసినప్పుడు ఆన్లైన్లో ఏదో ఒకటి ఆర్డర్ చేయడం కడుపు నింపేసుకోవడం.. ఈ లైఫ్ స్టైల్ కి అలవాటు పడ్డారు అందరూ. దీంతో.. నలుగురితో కలిసి భోజనం చేసే పద్ధతికి ఎప్పుడో టాటా చెప్పేశారు. ఒకప్పుడు శుభకార్యాలు జరిగితే అందరినీ చక్కగా కింద కూర్చోబెట్టి విస్తర్లు వేసి భోజనం వడ్డించేవారు. పంక్తిలో కూర్చున్న అందరికీ అన్నీ ఐటమ్స్ పచ్చాక భోజనం చేయడం మొదలు పెట్టేవాళ్ళు. పంక్తిలో ఉన్న పెద్దవారు ముందుగా ఒక ముద్ద తిన్న తర్వాత మిగతా వాళ్లు భోజనం చేయడం మొదలు పెట్టేవాళ్లు.
కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి చూద్దామన్నా ఎక్కడా కనిపించదు.. అన్నీ బఫే డిన్నర్లు. టేబుల్ సిస్టమ్ భోజనాలే. చేతిలో ప్లేట్ పట్టుకొని వడ్డించే వాళ్ల దగ్గరికి వెళ్లి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ వడ్డించుకోవాలి. కడుపు నిండగానే.. ప్లేట్ అక్కడ పడేసి చేతులు కడుక్కొని వెళ్లిపోవడం తంతుగా మారింది. అయితే ఒకప్పుడు అలా ఉండేది కాదు.. పంక్తిలో కూర్చుంటే అందరి కంటే ముందే భోజనం పూర్తి చేసినప్పటికీ, అందరు తినే వరకు వెయిట్ చేయాల్సిందే. దీని వల్ల ఒకరి మీద ఒకరికి గౌరవభావం ఉండేది. క్రమక్రమంగా ఈ పద్ధతే కనిపించడం లేదు. పంక్తి భోజనాల విలువ తెలిపేందుకు ఇప్పటికీ కొంతమంది వన భోజనాలు, కార్తీక భోజనాల పేరుతో పంక్తి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు
నలుగురితో భోజనం చేయడమంటే అదేదో... కడుపులో నాలుగు మెతుకులు నింపుకోవడం కాదు. నలుగురితో కలిసి భోజనం చేసే పద్దతిని బట్టి ఒక వ్యక్తి పట్ల అక్కడివారికి ఒక స్పష్టమైన అభిప్రాయం ఏర్పడుతుంది. ఇంట్లో భోజనం చేసేటప్పుడు ఎలా ఉన్నాపెద్ద ఇబ్బంది ఉండదు గానీ, అదే ఎవరింటికైనా అతిథిగా వెళ్ళినప్పుడో, ఆఫీసులో క్లయింట్లతో వ్యాపార భాగస్వాములతో కలిసి, ప్రముఖులతో భోజనం చేయాల్సి వచ్చినప్పుడు తోటివారికి ఇబ్బంది కలిగిందని రీతిలో వ్యవహరించటం చాలా ముఖ్యం. అందుకే.. నలుగురితో కలిసి భోజనం చేసేటప్పుడు ఎలా వ్యవహరించాలో కొన్ని సూచనలు మీకోసం..
ఇలా చేయండి..
- డైనింగ్ టేబుల్ కుర్చీ బరబరా లాగకుండా నెమ్మదిగా ఎత్తి వెనక్కి తీసి కూర్చోవాలి. ఒకవేళ కింద కూర్చునే పంక్తి భోజనం అయితే.. పక్కవారికి ఇబ్బంది కలగకుండా కూర్చోవాలి.
- మిగిలిన అతిధులు వచ్చేవరకు ఎదురుచూడాలి. ఏమి వంటకాలు చేశారని ముందుగా గిన్నెల మూతలు తీసి చూడరాదు. అది అమర్యాదగా ఉంటుంది.
- అందరూ కూర్చున్న తర్వాత టేబుల్ మీద బోర్లించిన ప్లేట్ ను నెమ్మదిగా తీసి మీకు అనువుగా పెట్టుకోవాలి.
- భోజనం చేసేటప్పుడు తుమ్ము, దగ్గు వస్తే కర్టీస్ లేదా టిష్యూ అడ్డుపెట్టుకోవాలి. తోటివారికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి.
- భోజనం చేసేటప్పుడు మౌనంగా, ముభావంగా ఉండకూడదు. సరదాగా మాట్లాడుతూ ఉంటే బాగుంటుంది.. తోటి వారిని కలుపుకుపోవాలి
- నలుగురితో కలిసి భోజనం చేయడం వల్ల ఒంటరితనం అనే భావన నుంచి బయటపడొచ్చు.
- ఒకరి ఫుడ్ ఐటమ్స్ ఒకరు పంచుకొని తినడం వల్ల స్నేహభావం పెరుగుతుంది.
- నిశ్శబ్దంగా, ముభావంగా తినేవారి కంటే.. నలుగురితో మాట్లాడుకుంటూ.. కలిసి తివేవారే ఆరోగ్యంగా ఉన్నట్టు, వారిలో జీర్ణక్రియలు సజావుగా జరుగుతున్నట్టు పరిశోధనల్లో వెల్లడైంది.
- కంచంలో వడ్డించిన పదార్థాలన్నీ తినాలని ఏంలేదు. నచ్చనివి వదిలేయటానికి మొహమాటపడాల్సిన పనిలేదు. అవసరమైతే, మీకు ఇష్టం లేని ఆహార పదార్థాలు వడ్డించుకోకపోవడమే బెటర్. అలాగే, కంచాన్ని పదార్థాలతో నింపేయకండి. చూసేవారికి మీ మీద అగౌరవభావం ఏర్పడుతుంది.