- కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు డిప్యూటీ సీఎం భట్టి విజ్ఞప్తి
- రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు రిలీజ్ చేయండి
- సీఎస్ఎస్లలో వెసులుబాటు కల్పించండి
- మూసీ రివర్ ఫ్రంట్‌కు అధిక నిధులు కేటాయించండి
- కేంద్ర బడ్జెట్ సన్నాహక సమావేశం, 53వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్‌కు హాజరు
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలోని పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కల్పించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. అలాగే, మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు అధిక నిధులు కేటాయించాలని కోరారు. రీజినల్ రింగ్ రోడ్(ఆర్ఆర్ఆర్) పూర్తికి నిధులివ్వడంతోపాటు రాష్ట్రానికి మరిన్ని నవోదయ స్కూళ్లను మంజూరు చేయాలని విన్నవించారు. వీటితో పాటు రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాడాలని కోరారు. శనివారం నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఢిల్లీలోని భారత్ మండపంలో కేంద్ర బడ్జెట్ సన్నాహక సమావేశం, 53వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరిగాయి. ఈ సమావేశాలకు తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు శ్రీదేవి, కృష్ణ భాస్కర్ హాజరయ్యారు. అనంతరం ఢిల్లీ తెలంగాణ భవన్లో డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడారు. ఈ భేటీల్లో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సలహాలు, సూచనలు చేసినట్లు తెలిపారు. రాష్ట్రాలకు వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాలను (సీఎస్ఎస్) అనౌన్స్ చేసినప్పుడు ఎలాంటి బ్రాడింగ్ షరతులు, పరిమితులు లేకుండా వెసులుబాటు కల్పించాలని కోరినట్టు తెలిపారు. సీఎస్ఎస్ లను పున: సమీక్షించి, అనవసరమైన పథకాలను తొలగించి, ఆప్షనల్‌గా కొత్త పథకాలను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని సూచించామన్నారు. ప్రత్యేక ఆర్థిక సాయం పథకాన్ని ఏడాదికి రూ. 2.5 లక్షల కోట్లకు పెంచి, అన్ని కేంద్ర పథకాలను కొనసాగించాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. దేశంలో యువతీ యువకుల నిరుద్యోగ సమస్యను దృష్టిలో పెట్టుకొని స్కిల్ డెవలప్మెంట్సెంటర్లు, ఉద్యోగావకాశాలు కల్పించే పరిశ్రమల ఏర్పాటుపై కేంద్ర బడ్జెట్లో నిర్ణయాలు జరగాలని చెప్పామన్నారు. రాష్ట్రాలకు ఆర్థిక సంఘాల సిఫార్సుల ప్రకారం పన్ను విభజనలో వారి వాటా తగ్గిందని, అందువల్ల మొత్తం పన్ను ఆదాయానికి సెస్‌లు, సర్ చార్జీల వాటా 10% మించకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరామని చెప్పారు.
వెనకబడిన జిల్లాలకు ఫండ్స్ కోసం వినతి
దేశంలో తెలంగాణ అనేక రంగాల్లో గొప్ప పురోగతిని సాధించడంతో పాటు జాతీయ ఆర్థిక వ్యవస్థకు విలువైన భాగస్వామిగా ఉందని భట్టి అన్నారు. సీఎస్ఎస్ కింద విడుదలయ్యే నిధుల తగ్గింపు, కేంద్ర పన్నుల వాటాల్లో నష్టం వంటి రెండు ప్రధాన అంశాలతో ఇబ్బందులు పడుతున్నదని చెప్పారు. సీఎస్ఎస్ ల కింద 2023–24 ఏడాదికిగానూ రూ.4.60 లక్షల కోట్లు కేంద్రం రిలీజ్ చేయగా, తెలంగాణకు రూ.6,577 కోట్లు మాత్రమే వచ్చాయని వివరించారు. ఏపీ పునర్విభజన చట్టం– 2014, సెక్షన్ 94(2) కింద తెలంగాణలోని ఆనాటి 9 వెనకబడిన జిల్లాలకు ఏటా రూ.450 కోట్లు ఇచ్చేలా చట్టంలో పొందుపరిచారన్నారు. ఈ నిధుల విడుదలలో కేంద్రం జాప్యంతో రూ.2,250 కోట్లు రాష్ట్రానికి పెండింగ్‌లో పడిందని చెప్పారు. ఈ నిధులను తక్షణమే విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరామన్నారు. హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని ప్రస్తుత అన్ని జిల్లాలను వెనుకబడినవిగా ప్రకటించి, ఈ గ్రాంటును వచ్చే ఐదేండ్లు పొడిగించాలని విజ్ఞప్తి చేశామని చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన మొదటి ఏడాది సీఎస్ఎస్ గ్రాంట్ల రూపంలో తెలంగాణకు కేటాయించిన రూ.495.21 కోట్లను కేంద్రం పొరపాటుగా ఏపీకి విడుదల చేసిందని, ఈ మొత్తాన్ని తెలంగాణకు ఇవ్వాలని కోరామన్నారు.
కోయగూడ, ఇల్లందు గనులు సింగరేణికి ఎందుకు రాలేదు?
సింగరేణి బొగ్గు గనుల వేలానికి సంబంధించిన అంశంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు భట్టి కౌంటర్ ఇచ్చారు. బొగ్గు గనుల వేలం చట్టాన్ని బీజేపీ తీసుకొస్తే.. దానికి బీఆర్ఎస్ ఓట్లు వేసి మద్దతు తెలిపిందన్నారు. అప్పుడు బీఆర్‌ఎస్ మద్దతు ఇవ్వడం వల్లే 2014-–2023 మధ్య వేసిన వేలంలో ప్రైవేట్ కంపెనీలకు ఈ బొగ్గు గనులు దక్కాయని చెప్పారు. కేటీఆర్ చెబుతున్నట్టు బీఆర్ఎస్ ఆ వేలాన్ని అడ్డుకుంటే.. కోయగూడ, ఇల్లందులో చేసిన రెండు ఆక్షన్‌లు సింగరేణికి రావాలి కదా? అని ప్రశ్నించారు. సింగరేణికి రాకుండా ప్రైవేటు కంపెనీలకు ఎందుకు వెళ్లాయో కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు. అది కూడా వాళ్లకు సంబంధించిన ‘అవంతిక’, ‘అరబిందో’లకే వేలం దక్కేలా చేశారని ఆరోపించారు. ఈ అవంతిక, అరబిందో అనే కంపెనీలు ఎవరివో? వీటి వెనక ఎవరు ఉన్నారు? అనేది ఇన్వెస్ట్ గేషన్ జర్నలిస్టులు బయటకు తీయాలని సూచించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇంకెక్కడ ఉందని, వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలుస్తుందని భట్టి ధీమా వ్యక్తం చేశారు.
వంద శాతం రుణమాఫీ చేస్తం
రాష్ట్రంలో 100 శాతం రుణ మాఫీ చేస్తామని, అర్హులైన వారందరికీ రూ.2 లక్షల లోపు రుణమాఫీ వర్తిస్తుందని భట్టి క్లారిటీ ఇచ్చారు. లబ్ధిదారుల అకౌంట్లలో ఈ నిధులను జమ చేయనున్నట్టు తెలిపారు. జీతాల చెల్లింపులపై జూనియర్ డాక్టర్లు చేస్తోన్న సమ్మెపై భట్టి స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి వారంలో జీతాలు చెల్లించేలా స్ట్రీం లైన్ చేస్తున్నట్టు తెలిపారు. తొలుత ప్రభుత్వ ఉద్యోగులు, తర్వాత కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, ఇతర బిల్స్ అంశాలను ఒక్కటొక్కటిగా క్లియర్ చేస్తున్నామని స్పష్టం చేశారు.
వీటిని జీఎస్టీ నుంచి మినహాయించండి
తెలంగాణ ప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, ఇందులో భాగంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించనున్నామని భట్టి తెలిపారు. విద్య, వెల్ఫేర్ దిశలో చేపట్టబోయే ఈ నిర్మాణాలకు జీఎస్టీని మినహాయించాలని కోరామన్నారు. ఇలాంటి మినహాయింపుల ద్వారా రాష్ట్రాలు అదనపు స్కూళ్లను నిర్మించడానికి మరిన్ని వనరులను వస్తాయని, విద్యపై ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కును బలోపేతం చేయడానికి వీలు కల్పిస్తుందని చెప్పారు. తెలంగాణ లో వాడే ఫెర్టిలైజర్‌పై జీఎస్టీ ని 18 నుంచి 5 శాతానికి తగ్గించాలని విజ్ఞప్తి చేశామన్నారు. బీడీ ఆకులపై కూడా జీఎస్టీని తగ్గించాలని కోరామని చెప్పారు. అదనపు న్యూట్రల్ ఆల్కహాల్ (ఈఎన్ఏ)ని జీఎస్టీ పరిధి నుంచి మినహాయించాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు.