ప్రతి వారం రిపోర్ట్​ ఇవ్వండి .. 4 నెలల్లో బ్రిడ్జి పనులు కావాలి : ఎమ్మెల్యే వివేక్​వెంకటస్వామి

కోల్​బెల్ట్: క్యాతన్​పల్లి రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి పనులను త్వరగా పూర్తి చేయాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​వెంకటస్వామి అన్నారు. సంబంధిత ఆర్ అండ్ బీ అధికారులు ప్రతి వారం పనుల నివేదికలను అందించాలని సూచించారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం క్యాతన్​పల్లి మున్సిపాలిటీలో మార్నింగ్ వాక్ సందర్భంగా రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి పనులను పరిశీలించారు. 

అనంతరం వివేక్​మాట్లాడుతూ ‘ నేను పెద్దపల్లి ఎంపీగా పనిచేసిన కాలంలో రామకృష్ణాపూర్(క్యాతన్ పల్లి), రామగుండంలో రెండు రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు మంజూరు చేయించిన. క్యాతన్ పల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జికి కేంద్రం నుంచి రూ.33 కోట్ల నిధులు ఇప్పించాను. రామగుండం ఫ్లైఓవర్ పనులు పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పదేళ్లు దాటిన క్యాతన్​పల్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు పూర్తి కాలేదు.

 బ్రిడ్జి లేక వేల మంది ప్రజలు నిత్యం రైల్వే గేట్ వద్ద గంటల తరబడి నిరీక్షిస్తూ ఇబ్బందులు పడుతున్నరు. ఇక్కడ తరచూ ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నాయి. వారి ఇబ్బందులు తొలగించేందుకు ఎమ్మెల్యే కాగానే ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు పూర్తి చేయించడంపై టాప్ ప్రియార్టీ ఇచ్చాను. 4 నెలల్లో బ్రిడ్జి పనులు పూర్తి చేస్తామని కాంట్రాక్టర్లు, అధికారులు హామీ ఇచ్చారు. పనులను సత్వరమే పూర్తి చేయాలి. ఒక్కొక్కటిగా అభివృద్ధి పనులను పూర్తి చేసేందుకు ప్రజలు సహకరించాలి’ అని అన్నారు.