కృష్ణా నీళ్ల పంపిణీ బాధ్యత బ్రిజేశ్‌‌‌‌ ట్రిబ్యునల్‌‌‌‌కే ఇవ్వండి

  • జలశక్తి శాఖ కార్యదర్శికి రజత్ కుమార్ లేఖ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: కృష్ణా నీళ్ల పంపిణీ బాధ్యతలను బ్రిజేశ్ కుమార్‌‌‌‌ ట్రిబ్యునల్‌‌‌‌కే ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్ర సర్కారు కోరింది. ఇరిగేషన్‌‌‌‌ స్పెషల్‌‌‌‌ సీఎస్‌‌‌‌ రజత్‌‌‌‌ కుమార్‌‌‌‌ శుక్రవారం కేంద్ర జలశక్తి శాఖ సెక్రటరీ పంకజ్‌‌‌‌ కుమార్‌‌‌‌కు లేఖ రాశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కృష్ణా నీళ్లలో న్యాయబద్ధమైన వాటా కోసం ఇంటర్‌‌‌‌ స్టేట్‌‌‌‌ వాటర్‌‌‌‌ డిస్ప్యూట్స్‌‌‌‌ యాక్ట్‌‌‌‌, 1956లోని సెక్షన్‌‌‌‌ -3 ప్రకారం ట్రిబ్యునల్‌‌‌‌ ఏర్పాటు చేయాలని 2014 జులై 14న సుప్రీంకోర్టులో పిటిషన్‌‌‌‌ దాఖలు చేశామని తెలిపారు. సుప్రీంకోర్టులో ఈ పిటిషన్‌‌‌‌ పెండింగ్‌‌‌‌లో ఉందని వివరించారు.

2020 అక్టోబర్‌‌‌‌ 6న నిర్వహించిన రెండో అపెక్స్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ సమావేశంలో కృష్ణా నీళ్ల పంపిణీపై చర్చించామని చెప్పారు. సుప్రీంకోర్టులో తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌ను విత్‌‌‌‌ డ్రా చేసుకుంటే లీగల్‌‌‌‌ ఒపీనియన్‌‌‌‌ తీసుకొని కొత్త ట్రిబ్యునల్‌‌‌‌ ఏర్పాటు చేస్తామని లేదా ఇప్పటికే ఉన్న బ్రిజేశ్‌‌‌‌ ట్రిబ్యునల్‌‌‌‌కు రెఫర్‌‌‌‌ చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అపెక్స్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ తీసుకున్న నిర్ణయం మేరకు తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌‌‌‌ను విత్‌‌‌‌ డ్రా చేసుకుందని తెలిపారు.
అవకాశాలు చాలా తక్కువ
ఏపీ విభజన చట్టంలోని సెక్షన్‌‌‌‌ 89 ప్రకారం తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా నీళ్ల పునఃపంపిణీ వివాదం బ్రిజేశ్‌‌‌‌ కుమార్‌‌‌‌ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ-2) ఎదుట విచారణలో ఉందని రజత్‌‌‌‌కుమార్ తెలిపారు. ఈ సెక్షన్‌‌‌‌ ప్రకారం నీళ్లు మళ్లీ పంపిణీ చేసేందుకు పరిమిత అవకాశాలు మాత్రమే ఉన్నాయని, ఈ విషయాన్ని ట్రిబ్యునల్‌‌‌‌ 2016 అక్టోబర్‌‌‌‌ 19న నిర్వహించిన విచారణ సందర్భంగా చెప్పిందన్నారు. ఇంటర్‌‌‌‌ స్టేట్‌‌‌‌ వాటర్‌‌‌‌ డిస్ప్యూట్స్‌‌‌‌ యాక్ట్‌‌‌‌లోని సెక్షన్‌‌‌‌ -3 ప్రకారమే రెండు భాగస్వామ్య రాష్ట్రాల మధ్య నీటి పంపిణీకి అవకాశం ఉందని పేర్కొన్నారు. కృష్ణా బేసిన్‌‌‌‌లోని ఇతర రాష్ట్రాలకు చేసిన కేటాయింపులను సమీక్షించాలని తాము కోరడం లేదని, కృష్ణా నదిలో 75 శాతం డిపెండబులిటీ వద్ద ఉన్న నికర జలాలనే శాస్త్రీయంగా తెలంగాణ ప్రాంతానికి కేటాయించాలని కోరుతున్నామని తెలిపారు.
574 టీఎంసీలివ్వాలి
రాష్ట్ర విభజన తర్వాత కృష్ణా బోర్డు 2015లో తాత్కాలిక పద్ధతిన ఉమ్మడి ఏపీకి ఉన్న కేటాయింపుల్లో తెలంగాణకు 299, ఏపీకి 512 టీఎంసీలను సర్దుబాటు చేసిందని రజత్‌‌‌‌కుమార్ తన లేఖలో వివరించారు. బేసిన్‌‌‌‌ పారా మీటర్స్‌‌‌‌, కరువు పీడిత ప్రాంతాలు, బేసిన్‌‌‌‌లోని జనాభా ఆధారంగా తెలంగాణకు 75% డిపెండబులిటీ వద్ద 574.6 టీఎంసీలు కేటాయించాలని కోరుతూ బ్రిజేశ్‌‌‌‌ ట్రిబ్యునల్‌‌‌‌ ఎదుట తాము వాదనలు వినిపిస్తున్నామన్నారు. ఏపీ విభజన చట్టంలోని సెక్షన్‌‌‌‌ 84(3) ప్రకారం నీటి పంపకాలకు ట్రిబ్యునల్‌‌‌‌ తీర్పు ఫైనల్‌‌‌‌ అని పేర్కొన్నారని గుర్తు చేశారు. కేంద్రానికి కూడా నీళ్లు పంపిణీ చేసే అధికారం లేదని ఆ సెక్షన్‌‌‌‌ స్పష్టతనిచ్చిందన్నారు. తమ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు, కృష్ణా నీళ్లను పునఃపంపిణీ చేసే బాధ్యతను కేడబ్ల్యూడీటీ -2కు ఇవ్వాలన్నారు. రెండో అపెక్స్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ భేటీలో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలన్నారు.