జూలూరుపాడు, వెలుగు: తమకు కేటాయించిన డబుల్ బెడ్రూం ఇండ్లను ఆక్రమించుకున్నవారిని ఖాళీ చేయించి అప్పగించాలని డిమాండ్ చేస్తూ సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని బీమ్లాతండాలో లబ్ధిదారులు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. పాపకొల్లు గ్రామ పంచాయతీ పరిధిలోని బీమ్లాతండాలో 51 డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టారు. 2020లో గ్రామసభ నిర్వహించి లాటరీ పద్ధతిలో అర్హులను ఎంపిక చేశారు.
వారిలో 40 మంది గృహ ప్రవేశం చేయగా మిగిలిన11 ఇండ్లను ఇతరులు ఆక్రమించుకున్నారు. ఇది తెలిసిన 11 మంది లబ్ధిదారులు తమకు ఇండ్లు కేటాయించాలని రెవెన్యూ ఆఫీసర్ల చుట్టూ తిరిగినా లాభం లేకుండా పోయింది. దీంతో ఆగ్రహించిన వారు సోమవారం వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. సీఐ వసంతకుమార్ అక్కడికి వచ్చి తహసీల్దార్‌తో మాట్లాడి న్యాయం చేస్తానని చెప్పడంతో ఆందోళన విరమించారు. తహసీల్దార్ శారదను వివరణ కోరగా డబుల్ బెడ్రూం ఇండ్లపై కొందరు కోర్టును ఆశ్రయించారని, ఆ తీర్పు ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు.