ఎల్బీనగర్, వెలుగు: వృద్ధురాలికి లిఫ్ట్ ఇచ్చిన ఓ వ్యక్తి.. ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లిన ఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పీఎస్ పరిధిలో జరిగింది. బండరావిర్యాలలో మైనింగ్ కోసం భూములు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించకపోవడంతో సద్దుపల్లి చౌరస్తాలో 200 రోజులుగా భూ నిర్వాసితులు నిరసన దీక్ష చేస్తున్నారు. బండరావిర్యాలకు చెందిన నిర్వాసితురాలు ముల్లి బాలమ్మ(58) సైతం ప్రతిరోజు దీక్షలో పాల్గొంటోంది.
శుక్రవారం కూడా దీక్షలో పాల్గొన్న బాలమ్మ సాయంత్రం నడుచుకుంటూ ఇంటికి వెళ్తోంది. ఆమెను బైక్‌పై వెంబడించిన ఓ వ్యక్తి లిఫ్ట్ ఇస్తానని చెప్పాడు. బాలమ్మను ఇంటికి దగ్గరలో దింపాడు. ఆమె బైక్ దిగి వెళ్లిపోతుండగా మెడలోని 2.5 తులాల బంగారు గొలుసుకుని లాక్కుని ఆ వ్యక్తి పారిపో యాడు. బాధితురాలి కంప్లయింట్‌తో కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.