బల్దియాలో టెస్ట్ లేకుండానే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ..!

బల్దియాలో టెస్ట్ లేకుండానే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ..!
  • రిటెన్ టెస్ట్ లేకుండానే కట్టబెట్టే ప్రయత్నం
  • తమ వాళ్ల కోసం మెరిట్ క్యాండిడేట్స్ కి అన్యాయం చేస్తున్న అధికారులు

హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ లోని ఐటీ డిపార్ట్ మెంట్ లో అనలిస్ట్ ల ఉద్యోగాల భర్తీ పై అనుమానాలు తలెత్తుతున్నాయి. అర్హత ఉన్న వారికి కాకుండా బడా లీడర్లు, కార్పొరేటర్లు, అధికారులకు దగ్గరి వాళ్లకు కట్టే బెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఐటీ డిపార్ట్ మెంట్ లో 6 అనలిస్ట్, 14 జూనియర్ అనలిస్ట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. దాదాపు రిక్రూట్ మెంట్ ప్రక్రియ తుది దశకు చేరినట్లు సమాచారం. ఈ రిక్రూట్ మెంట్ జరుగుతున్న విషయమే పెద్దగా బయటకు తెలియకుండా చేస్తున్నారు. దీంతో చాలా మంది డిగ్రీ, పీజీ, బీటెక్, ఎంటెక్ చదివిన స్టూడెంట్స్ వీటికి అప్లయ్ చేసుకోలేకపోయారు. ఇక అప్లయ్ చేసిన వారిలో మెరిట్ ఉన్న వాళ్లను కాకుండా సరైన అర్హతలు లేని వారి పేర్లనే సెలక్ట్ చేశారని జీహెచ్ఎంసీలోని అధికారులే చర్చించుకుంటున్నారు.

గుట్టు చప్పుడు కాకుండా..

బల్దియాలో అనలిస్ట్ పోస్టుకు దాదాపు రూ. 33 వేలు జీతంగా ఇస్తున్నారు. దీంతో ఈ పోస్టు లకు చాలా డిమాండ్ ఉంది. ఎంతో మంది ఐటీ చదివిన వారు  జాబ్​ల కోసం ప్రైవేట్ కంపెనీల చుట్టూ తిరుగుతున్నారు. అలాంటి వారికి జీహెచ్ఎంసీ లో రిక్రూట్ చేస్తున్న జాబ్ ల కోసం ఎగ్జామ్ పెట్టి తీసుకుంటే క్వాలిటీ, సబ్జెక్ట్ ఉన్న వారికి జాబ్స్ వచ్చే అవకాశం ఉండేది. కానీ ఈ మొత్తం భర్తీ ప్రక్రియను గుట్టు చప్పుడు కాకుండా చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీసెస్ (టీఎస్ టీఎస్ ) తో కలసి బల్దియా అధికారులు నెల రోజులుగా రిక్రూట్ మెంట్  చేస్తున్నారు. గతంలోనే స్టాడింగ్ కమిటీ ఈ పోస్టులకు అఫ్రూవల్ ఇచ్చిందంటూ లో లోపలే పోస్టులు నింపేస్తున్నారు. ఇప్పటికే 20 మంది పేర్లను ఖరారు చేశారని, నామామాత్రం ఇంటర్వ్యూలు నిర్వహించి వారికే ఉద్యోగాలు కట్టబెడతారని తెలుస్తోంది.

ఎగ్జామ్ లేకుండానే..

గతంలో ఈ పోస్టులను భర్తీ చేసినప్పుడు రిటెన్ టెస్టు లు నిర్వహించారు. కానీ ఈ సారి మాత్రం రిటైన్ ఎగ్జామ్ కూడా నిర్వహించ లేదని అధికారులే చెబుతున్నారు. పాత పాలక వర్గం గడువు ముగుస్తున్నందున చాలా మంది వారికి కావాల్సిన వారినే ఈ పోస్టుల్లో భర్తీ చేసేందుకు ఇలా చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రిటైన్ టెస్టు లేకుండా 20 మంది పేర్లను దాదాపు ఖరారు చేశారని సమాచారం. ఇందులో చాలా మందికి సరైన అర్హతలు కూడా లేవని బల్దియాలో చర్చించుకుంటున్నారు. పోస్టుల కోసం అప్లయ్ చేసి వారిలో అన్ని విద్యార్హాతలు, టెక్నికల్ స్కిల్స్ ఉన్న వాళ్లు కూడా ఉన్నప్పటికీ వారిని కాదని వేరే వాళ్లను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

నెలఖారున ముగియనున్న ఏజెన్సీ గడువు

బల్దియా ఐటీ డిపార్ట్ మెంట్ లో మొత్తం 40 మంది అవసరం అని తేల్చారు. గతంలో స్టాడింగ్ కమిటీ ఆమోదంతో   30 మందిని రిక్రూట్ చేసుకున్నారు. ఈ రిక్రూట్ మెంట్, ఉద్యోగుల జీతాలు, మెయింటెనెన్స్ ను ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించారు. ఇందులో 18 మంది ఉద్యోగం మానేయటంతో 12 మంది మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో మరో 20 మందిని హడావుడిగా రిక్రూట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఏజెన్సీ గడువు గతేడాది ఫిబ్రవరిలోనే ముగిసినప్పటికీ ఏడాది పాటు ఎక్స్ టెన్షన్ ఇచ్చారు. ఈ ఎక్స్ టెన్షన్ కూడా ఫిబ్రవరి నాటికి ముగియనుంది. ఈ లోపే మళ్లీ ఉద్యోగులను నియమిస్తున్నారు. మళ్లీ ఈ ఏజెన్సీకి కాంట్రాక్ట్ దక్కుతుందో లేదో తెలియకుండానే ఉద్యోగాలు రిక్రూట్ చేస్తుండటంపై అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. బల్దియాలో పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తికి సంబంధించిందే ఈ ఏజెన్సీ అని అధికారులు చర్చించుకుంటున్నారు.