మునుగోడులో స్థానికేతరులు ఎవరూ లేరని సీఈసీ వికాస్ రాజ్ చెప్పారు. నాన్ లోకల్స్ ను గుర్తించి బయటకు పంపామని అన్నారు. మర్రిగూడలో రెండు వర్గాల మధ్య చిన్న ఘర్షణ చోటు చేసుకుందని, పోలీసులు వెంటనే వారిని చెదరగొట్టారని వికాస్ రాజ్ తెలిపారు. వీరిలో స్థానికేతరులుఉన్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, 42 మంది స్థానికేతరులను గుర్తించి మునుగోడు నుంచి పంపించేసినట్లు చెప్పారు. ఓటు కోసం డబ్బులు ఇవ్వడం, తీసుకోవడం తప్పన్న ఆయన.. ఓటుకు డబ్బు ప్రస్తావన రావడం దురదృష్టకరమన్నారు. ఓటర్లు అందరూ బాధ్యతగా ఓటుహక్కు వినియోగించుకోవాలని సూచించారు. మూడు చోట్ల ఈవీఎంలు మార్చి పోలింగ్ కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు.
ఒక దగ్గర వీవీప్యాట్ సమస్య వస్తే మార్చామన్న సీఈఓ వికాస్ రాజ్... మరొక కేంద్రంలో ఈవీఎం సమస్య తలెత్తిందని, దాన్ని కూడా సరిచేస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు 28 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. రెండు చోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారన్న ఆయన... కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి ఫిర్యాదుపై ఈసీతో మాట్లాడామని చెప్పారు. ఫిర్యాదు వచ్చిన సోషల్ మీడియా సైట్ ల పై లింక్ ల ద్వారా విచారణ చేస్తామని తెలిపారు.