ప్రజల చేతికే పైసలియ్యాలె..అపుడే ఎకానమీ పెరుగుతది

  • అప్పుడే కన్జూమర్​ డిమాండ్​ పెరుగుతుంది 
  • ఎకానమి తిరిగి గాడిన పడుతుంది

కరోనా మహమ్మారి వల్ల దెబ్బతిన్న ఎకానమీని మళ్లీ పరుగులు పెట్టించేందుకు మోడీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ఫస్ట్ క్వార్టర్ లో మైనస్ 23.9 శాతం లోటు నమోదు కావడం ఎకానమీ తిరిగి గాడిన పడేందుకు ఆర్థిక ప్రోత్సాహకాలను అందించాల్సిన తక్షణ అవసరాన్ని తెలియజేస్తోంది. ప్రభుత్వం తన స్ట్రాటజీలు, పద్ధతులను మార్చుకోకపోతే 2020–21లో జీడీపీ మైనస్10 శాతంతో ఎకానమీ మరింత దిగజారిపోతుంది. ఎకానమీ నెమ్మదించడం, ఆ వెంటనే లాక్ డౌన్ విధించడంతో ఎకానమీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అప్పటి నుంచి ఎకానమీని తిరిగి గాడిన పెట్టేందుకు ప్రభుత్వం అన్ని మార్గాలనూ అన్వేషిస్తోంది. కానీ అరకొర చర్యలతో ప్రయోజనం ఉండదు. అందుకే ఇన్వెస్ట్ మెంట్లు ఊపందుకోవడానికి ఒక పెద్ద స్ట్రాటజీ అవసరం. ప్రజలు ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు సాయపడేలా శక్తిమంతమైన ఆర్థిక ప్రోత్సాహకం ఇప్పుడు అవసరం. ఇది అంకెల గారడీలా ఉండకుండా ఫండ్స్ ట్రాన్స్ ఫర్ కావాలి. నేరుగా ప్రజల చేతిలో డబ్బును పెట్టాలి. అదే నిజమైన ప్రోత్సాహకం. ఇంతకుముందు మోడీ ప్రభుత్వం జీడీపీలో 10 శాతం మేరకు.. రూ.20 లక్షల కోట్లతో ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో ఎక్కువ భాగం లోన్లు, లిక్విడిటీ క్రియేషన్ రూపంలోనే ఉన్నది. వాస్తవానికి అసలైన ప్యాకేజీ రూ.1.86 లక్షల కోట్లే. అది జీడీపీలో 0.91 శాతమే. ప్రస్తుత సంక్షోభంతో పోల్చుకుంటే.. ఇది ఏ మూలకూ సరిపోదు. ఇప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొన్ని చర్యలను ప్రకటించారు. వాటిని ఆర్థిక ప్రోత్సాహకమని చెప్తున్నారు.

ఎల్టీసీ కొత్తది కాదు

లీవ్ ట్రావెల్ కన్సెషన్ (ఎల్టీసీ) అలవెన్స్ అనేది ఇదివరకే గవర్నమెంట్, పబ్లిక్ సెక్టార్ కంపెనీల ఉద్యోగుల శాలరీలో భాగంగా ఉంది. ఎల్టీసీ ఆఫర్ పై విధించిన షరతులను పరిశీలిస్తే.. ఉద్యోగులు తమ సొంత డబ్బును రూ.12 వేల నుంచి రూ.70 వేల వరకు ఖర్చుపెట్టాలి. ఒక నాన్ ఫుడ్ ఐటమ్ మాత్రమే కొనాలి. జీఎస్టీ రేట్ 12% కంటే ఎక్కువున్న వస్తువులే.. జీఎస్టీ నమోదు చేసుకున్న షాపులోనే కొనాలి. డిజిటల్ పేమెంటే చేయాలి. మార్చి 31, 2021కి ముందే కొనాలి. ఫైనాన్స్ మినిస్టర్ చేసిందేమిటంటే.. ప్రోత్సాహకం పేరుతో ప్రభుత్వ ఉద్యోగులు తమ డబ్బును తాము ఖర్చుపెట్టుకునేలా చేయడం. ఇది ప్రభుత్వానికి జీఎస్టీ రాబడిని పెంచుతుంది. కానీ కన్జూమర్ డిమాండ్ కు మాత్రం ఇది ప్రోత్సాహకం కాదు. ఎకానమీ వృద్ధి చెందేందుకు ఇలాంటి చర్యలు చాలా తక్కువగా ఉపయోగపడతాయి. ఇవి డిమాండ్, ఇన్వెస్ట్ మెంట్లకు ఉద్దీపనగా పని చేయవు. అయితే, ఎకానమీలో కన్జూమర్ డిమాండ్ కు ప్రోత్సాహకం అవసరమని లేటుగా అయినా గుర్తించడం మంచి విషయం.

 ఇప్పుడు ప్రకటించిన చర్యలు సరిపోవు

నిర్మలా సీతారామన్ రూ.12 వేల కోట్లు రాష్ట్రాలకు క్యాపిటల్ ఎక్స్​పెండిచర్ కింద ప్రకటించారు. 2020–21 ఏడాదికి రాష్ట్రాల మొత్తం క్యాపిటల్ ఎక్స్​పెండిచర్ బడ్జెట్ దాదాపు రూ.9 లక్షల కోట్లు. అంటే రాష్ట్రాల క్యాపిటల్ ఎక్స్​పెండిచర్ బడ్జెట్ కొంచెం మాత్రమే పెరిగింది. రాష్ట్రాల జీఎస్టీ బకాయిలు ఇంకా చెల్లించలేదు. పైగా లోటును పూడ్చుకునేందుకు కొత్త అప్పులు చేయాలంటూ రాష్ట్రాలకు కేంద్రం చెబుతోంది. గత ఆర్థిక సంవత్సరం నుంచీ ఎకానమీ నెమ్మదించడంతో జీఎస్టీ వసూళ్లు పడిపోయాయి. రాష్ట్రాల బడ్జెట్లు దెబ్బతిన్నాయి. రాష్ట్రాలు ఆల్రెడీ జీఎస్టీ 2017లో ప్రారంభమైనప్పటి నుంచి సేల్స్ ట్యాక్స్, వ్యాట్ వంటివి వదిలేసుకున్నాయి. కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించడంతో రూ.1.1 లక్షల కోట్లను రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం కింద పంచేందుకు కేంద్రం అంగీకరించింది. ఆర్థిక పరిస్థితి క్షీణించింది. రాష్ట్రాలు ఫండ్స్ కొరతతో అల్లాడుతున్నాయి. ఇన్వెస్ట్ మెంట్, డిమాండ్ పెంచేందుకు మోడీ సర్కార్ రూ. 10 లక్షల కోట్ల కార్పొరేట్ ట్యాక్స్ రద్దు చేసినా.. ప్రైవేట్ సెక్టార్ లో ఎలాంటి కాన్ఫిడెన్స్ కనిపించడం లేదు.

సగం కుటుంబాలకు పైసలు కావాలి

చివరిగా, ఆర్థిక సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనేందుకు భారీ ప్రకటనలకంటే ప్రాక్టికల్​గా ఉపయోగపడే చర్యలు తీసుకోవడం మేలు. డిమాండ్​ను పెంచేందుకు ఎలాంటి అదనపు చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు చేతిలో డబ్బు కావాల్సింది నిరు పేదలకు. కానీ వారిని పట్టించుకోవడం లేదు. డైరెక్ట్​ క్యాష్​ ట్రాన్స్​ఫర్​ అవసరమైనవి దేశంలోని సగం కుటుంబాలు ఉన్నాయి. కానీ వారి అకౌంట్లలోకి మోడీ ప్రభుత్వం డబ్బులు వేయడం లేదు. ప్రస్తుతం ఎకనమిస్టులంతా రికమెండ్​ చేస్తున్నది ఇదే. కరోనా తర్వాతి పరిస్థితుల్లో డైరెక్ట్​ క్యాష్​ ట్రాన్స్​ఫర్​ స్కీమ్​ చాలా ఉపయోగపడుతుంది.

కన్జూమర్​ డిమాండ్​ పెరగాలి

మోడీ ప్రభుత్వం ఆదరాబాదరాగా ఎలాంటి ప్రభావం చూపించలేని ఎకనమిక్ ప్యాకేజీని రూపొందించింది. ప్రధాని మోడీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆత్మ నిర్భర్ ప్యాకేజీతోపాటు ప్రస్తుత చర్యలు ఎకానమీ కోలుకునేందుకు చాలా స్వల్పంగానే దోహదపడ్డాయి. ఇప్పుడు కావాల్సింది.. డబ్బు నేరుగా కన్జూమర్ల చేతిలోకి వెళ్లడం. ప్రజల చేతిలో డబ్బు పెడితేనే డిమాండ్ మళ్లీ పుంజుకుంటుంది. బహుశా కాంగ్రెస్ మినిమం ఇన్ కం గ్యారెంటీ(ఎంఐజీ)ని గుర్తించింది. దాని పేరు న్యుంతుమ్ ఆయ్ యోజన (న్యాయ్)గా మార్చారు. పేరు ఏదైనా దీనిని అమలు చేయడం ముఖ్యం. ప్రజల చేతిలో డబ్బు పెట్టడం ద్వారా మాత్రమే డిమాండ్ కు ఊతం లభిస్తుంది. మోడీ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేసిందంటే.. డబ్బును ఒకచోటి నుంచి ఇంకో చోటికి మళ్లించడం మాత్రమే. ఎల్టీసీ క్యాష్​వోచర్ స్కీం, ఫెస్టివల్ అడ్వాన్స్ విషయంలో అచ్చం ఇలాగే జరుగుతుంది. ప్రజల చేతిలో అదనపు డబ్బును పెట్టడం ద్వారా డిమాండ్ పెరుగుతుంది. కానీ.. అందుబాటులో ఉన్న డబ్బును బలవంతంగా ఖర్చు పెట్టించడం వల్ల కాదు. ఎల్టీసీ లేదా ఫెస్టివల్ అడ్వాన్స్.. పేరు ఏదైనా ఒక ఉద్యోగికి చెందిన డబ్బు ఇది. దీనిని ప్రజల చేతుల్లో అదనపు డబ్బును పెట్టడంగా భావించరాదు. ఉద్యోగుల చేతుల్లో మాత్రమే కాదు.. ఎక్కువ మంది ప్రజల చేతుల్లో అదనపు డబ్బును పెడితే.. అప్పుడు మాత్రమే కన్జూమర్ డిమాండ్ పెరుగుతుంది. ప్రస్తుత చర్యలతో డిమాండ్ పెరగడం అన్న ప్రశ్నే లేదు. రాష్ట్రాలకు ఎలాంటి అదనపు సాయం అందలేదు. అలా చేసి ఉంటే ఎక్స్ పెండిచర్ ద్వారా డిమాండ్ పెరిగేందుకు మరో మార్గం ఉండేది.

వెంకట్ పర్సా 
సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ ఎనలిస్ట్​ప్రజల