రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌కు రైతుబంధు ఇస్తున్నం : మంత్రి జగదీశ్‌రెడ్డి

నార్కట్‌పల్లి, వెలుగు: పొద్దున లేచిన దగ్గర నుంచి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని తిట్టే కాంగ్రెస్‌, బీజేపీ లీడర్లకు కూడా రైతుబంధు ఇస్తున్నాం.. రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి సైతం రైతుబంధు తీసుకుంటున్నారని మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం అమ్మనబోలులో ఏర్పాటు చేసిన 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను సోమవారం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ఇచ్చే ఉచిత విద్యుత్‌తోనే ఉత్తమ్‌, జానారెడ్డి వంటి లీడర్లు హాయిగా నిద్రపోతున్నారన్నారు. 

మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో కూడా 24 గంటల కరెంట్‌ ఇవ్వడం లేదన్నారు. అక్కడ రైతుల మోటార్లకు మీటర్లు పెట్టి ఆరు గంటలే కరెంట్‌ ఇస్తున్నారని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనటువంటి సంక్షేమ పథకాలు అమలుచేస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రధాని మోడీ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కానీ ఉచిత విద్యుత్‌తోనే కేసీఆర్‌ మరోసారి విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి లోన్లు రాకుండా కేంద్రం అడ్డుకుంటోందని చెప్పారు. అమ్మనబోలు గ్రామాన్ని మండలం చేసేందుకు కృషి చేస్తానని, చుట్టుపక్కల గ్రామాలతో మాట్లాడి ఏకగ్రీవ తీర్మానాలు చేసుకోవాలని సూచించారు.