సొంత ఆస్తులతో జీతాలు ఇస్తున్నా: మోహన్ బాబు

తన ఆస్తులు కుదవబెట్టి తన విద్యాసంస్థల్లో పని చేసే ఉద్యోగులకు జీతాలు ఇచ్చానని నటుడు మోహన్ బాబు అన్నారు. ఈ రోజు వైసీపీ అధినేత జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ఆయన అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..25 శాతం ఉచితంగా విద్యను అందిస్తున్న శ్రీ విద్యానికేతన్ లో ఫీజు రియంబర్స్ మెంట్ విషయమై సీఎం చంద్రబాబును అడిగితే మాట దాటేశరన్నారు. తమ విద్యా సంస్థలకు సంబంధించి రూ.19 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రావాలన్నారు. సరైన సమయంలో పన్ను కడుతున్న తనకు ఏ కారణం చేత రియంబర్స్ మెంట్ ను ఆపారో సమాధానం చెప్పాలన్నారు.

తెలంగాణలో కూడా తనకు స్కూళ్లు ఉన్నాయని, టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి తనకెలాంటీ బాకీ లేదని మోహన్ బాబు ఈ సందర్భంగా తెలిపారు. మూడు రోజుల క్రితం జరిపిన ధర్నాలో ఎటువంటి రాజకీయ ఉద్దేశం లేదని, విద్యార్థులను రెచ్చగొట్టి ధర్నా చేయించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. సీఎం చంద్రబాబును కొత్త కోరికలేమీ అడగట్లేదని.. తాను ఇచ్చిన వాగ్ధానాలనే నిలబెట్టుకోమని అడుగుతున్నామని ఆయన మీడియా ముందు తెలిపారు.