ఏటా 26.7 వేల కోట్ల టన్నుల గ్లేషియర్స్ కరిగిపోతున్నయ్

భూమిపై ఉన్న అనేక గ్లేషియర్స్, మంచు కొండలు వేగంగా కరిగిపోతున్నాయి. గడిచిన 20 ఏండ్లలో ప్రతి సంవత్సరం 26.7 వేల కోట్ల టన్నుల చొప్పున ఐస్ కరిగి.. నీటిగా మారి సముద్రాల్లో కలుస్తోంది. దీంతో 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు సముద్ర మట్టం 21 శాతం పెరిగిందని సైంటిస్టులు చెబుతున్నారు. భూమిపై దాదాపు 2 లక్షల పైగా ఉన్న గ్లేషియర్స్‌‌పై ఫ్రెంచ్ రీసెర్చర్లు చేసిన స్టడీలో ఈ విషయం తేలింది. ఏటా ఇంత వేగంగా సముద్రపు నీటి లెవెల్ పెరగడం డేంజర్ అని, ప్రపంచ వ్యాప్తంగా తీర ప్రాంతాల్లో ఉండే కోట్ల మంది ప్రజలు, ఇతర జీవులపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

శాటిలైట్ ఇమేజెస్ ఆధారంగా..

గడిచిన రెండు దశాబ్దాలుగా గ్లేషియర్లు కరిగిపోతున్న తీరుపై ఫ్రాన్స్‌‌లోని యూనివర్సిటీ ఆఫ్​ టౌలోస్ సైంటిస్టులు అధ్యయనం చేశారు. ప్రపంచం మొత్తం మీద ఉన్న 217,175 గ్లేషియర్లు, మంచుకొండలకు సంబంధించిన శాటిలైట్ ఇమేజ్‌‌లు, ఏరియల్ ఫొటోలు, హైరెజల్యూషన్ మ్యాప్‌‌ల ఆధారంగా సైంటిస్టులు ఈ స్టడీ చేశారు. రీజియన్, ఆయా ప్రాంతాల్లో టెంపరేచర్లలో మార్పులను బట్టి గ్లేషియర్లు కరుగుతున్న వేగంలో తేడా ఉంది. అయితే యావరేజ్‌‌గా గడిచిన 20 ఏండల్లో ఏటా 26.7 వేల కోట్ల టన్నుల ఐస్ కరిగిపోయిందని సైంటిస్టులు గుర్తించారు. 2000 సంవత్సరం తర్వాత గ్లేషియర్లు కరుగుతున్న స్పీడ్ పెరిగిందని, ప్రతి పదేండ్లకోసారి స్పీడ్‌‌లో మార్పు సగటున ఏటా 4,800 కోట్ల టన్నులు చొప్పున పెరుగుతూ వస్తోందని తెలిపారు. దీని వల్ల 6 నుంచి 19 శాతం వరకు సముద్రమట్టం పెరుగుతోందని చెప్పారు. ఈ 20 ఏండ్లలో ఏడు రీజియన్లలో గ్లేషియర్ల నుంచి 83 శాతం మంచు నీళ్లయిపోయిదని అంచనా వేస్తున్నారు. ప్రపంచంలోని ఇతర రీజియన్లతో పోలిస్తే ఆసియాలోని గ్లేషియర్లు కొంత మేర నెమ్మదిగా కరుగుతున్నట్లు సైంటిస్టులు చెబుతున్నారు. హిమాలయాలు, కారాకోరం, హిందూ కుష్, టెన్ షాన్ లాంటి గ్లేషియర్లన్నీ కలిపి (హైమౌంటెన్ ఆసియా రీజియన్) 8 శాతం మంచు కరిగిపోయినట్లు తెలిపారు.

కోస్టల్ సిటీలపై ఎఫెక్ట్

గ్లేషియర్లు వేగంగా కరిగిపోవడం వల్ల సముద్రపు మట్టం పెరిగి ప్రపంచవ్యాప్తంగా కోస్టల్ సిటీలపై తీవ్రంగా ఎఫెక్ట్ పడుతుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఈ శతాబ్దం చివరి నాటికి దాదాపు 20 కోట్ల మంది జనాభా నివసించే తీర ప్రాంతాలు అక్కడి సముద్రపు తీవ్రమైన అలల (హై టైడ్) లెవెల్‌‌ కంటే డౌన్‌‌లో ఉండే పరిస్థితిని చూస్తామని తెలిపారు. తుఫాన్లు వచ్చినప్పుడు, సముద్రం అలజడిగా ఉన్నప్పుడు అలలు ఆయా ప్రాంతాలపై విరుచుకుపడే ప్రమాదం ఉందన్నారు. సముద్ర మట్టం పెరుగుదల వల్ల జల వనరులు కూడా దెబ్బతింటాయని, రాబోయే 30 ఏండ్లలో తీర ప్రాంతాల్లో నివసించే దాదాపు 100 కోట్ల జనాభా తీవ్రమైన మంచి నీటి కొరతను ఎదుర్కొంటారని హెచ్చరించారు.

దేశాల పాలసీల్లో మార్పు రావాలె

గ్లేషియర్లు కరిగిపోవడానికి ప్రధానమైన కారణాల్లో ఒకటి గ్లోబల్ వార్మింగ్‌‌ అని సైంటిస్టులు తెలిపారు. దీని వల్ల జరిగే వాతావరణ మార్పుల కారణంగా పెను ఉత్పాతాలను చూడాల్సి రావొచ్చని చెప్పారు. ఈ విషయంపై సామాజిక, రాజకీయ చర్చ జరగాల్సి ఉందని, వాతావరణ మార్పులపై దేశాలు వాటి పాలసీల్లో మార్పులు చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాలని సైంటిస్టులు సూచిస్తున్నారు. ఈ రీసెర్చ్ ఫలితాల ఆధారంగా దేశాలు అప్రమత్తమ వుతాయని ఆశిస్తున్నామని సైంటిస్ట్ ఆండ్రూ షెపర్ట్ అన్నారు. గ్లేషియర్స్ కరిగిపోవడం, సముద్ర మట్టాల పెరుగుదల వల్ల జల వనరులపై పడే ప్రభావాన్ని ఆయా దేశాల్లో సైంటిస్టులు కోస్టల్ ఏరియాల్లో లోతైన అధ్యయనం చేస్తే భవిష్యత్‌‌ ప్రమాదాన్ని ఏరియాల వారీగా గుర్తించవచ్చని అన్నారు.