ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు గ్లెన్ మ్యాక్స్ వెల్ కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు షాక్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ జట్టు ఫ్రాంచైజీ మ్యాక్స్ వెల్ ను కొనసాగించేందుకు ఆసక్తి చూపించట్లేదని సమాచారం. దీనికి తోడు మ్యాక్సీ తాజాగా ఆర్సీబీను అన్ ఫాలో చేయడం ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ ఆసీస్ బ్యాటర్ అన్ ఫాలో చేయడంతో బెంగళూరు జట్టుకు దాదాపు దూరమవుతున్నాడనే వార్తలు వస్తున్నాయి. 2025 ఐపీఎల్ మెగా ఆక్షన్ కు ముందు మ్యాక్స్ వెల్ ను వేలంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
2011 లో రూ. 14.25 కోట్ల రూపాయల భారీ ధరకు మ్యాక్ వెల్ ఆర్సీబీ జట్టులో చేరాడు. ఐపీఎల్ 2024 సీజన్ మ్యాక్స్ వెల్ కు అసలు కలిసి రాలేదు. ప్రపంచంలోనే విధ్వంసకర బ్యాటర్లలో ఒకడైన మ్యాక్ వెల్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ముంచేశాడు. ఒక్క మెరుపు ఇన్నింగ్స్ కూడా లేకపోగా ప్రతి ఇన్నింగ్స్ లో ఘోరంగా విఫలమయ్యాడు. మిడిల్ ఆర్డర్ లో కీలకంగా మారతాడనుకుంటే వరుస వైఫల్యాలతో జట్టుకు భారంగా మారాడు. సీజన్ మొత్తం దారుణంగా విఫలమైన ఈ ఆసీస్ వీరుడు ప్లే ఆఫ్ లో డకౌట్ అయ్యాడు.
Also Read:-క్రికెట్ స్టేడియాల నిర్మాణానికి ల్యాండ్ ఇవ్వండి.. సీఎం రేవంత్ రెడ్డికి హెచ్‌సీఏ విజ్ఞప్తి
ఈ సీజన్ లో మొత్తం 9 ఇన్నింగ్స్ ల్లో 52 పరుగులే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. వీటిలో నాలుగు డకౌట్స్ ఉన్నాయి. స్టార్ ప్లేయర్ అని వరుస అవకాశాలు ఇస్తే ఒక్క మ్యాచ్ లో కూడా ప్రభావం చూపించలేకపోయాడు. 2025 ఐపీఎల్ లో మెగా ఆక్షన్ జరగబోతుంది. దీని ప్రకారం ముగ్గురు లేదా నలుగురు ప్లేయర్లను మాత్రమే ఫ్రాంచైజీ రెటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. బెంగళూరు రెటైన్ చేసుకునే ప్లేయర్ల లిస్టులో మ్యాక్ వెల్ ఉండడనే వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే మ్యాక్ వెల్ వేలంలోకి వస్తాడు. ప్రస్తుతం ఆర్సీబీ మ్యాక్స్ వెల్ కు రూ. 11 కోట్లు చెల్లిస్తుంది.