గ్లెన్ మెక్‌గ్రాత్ ప్రపంచ అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్. బుల్లెట్లలా బంతలు సంధించి ప్రత్యర్థి బ్యాట్స్ మెన్లను ముప్పుతిప్పులు పెట్టిన మేటి ఆటగాడు. అతడు ఆటలోనే కాదు.. సాహసాలు చేయడంలోనూ దిట్టే. అయితే, ఈ మాజీ ఆస్ట్రేలియన్ క్రికెటర్ తన ఇంట్లో పాము దూరినప్పుడు అతడో స్నేక్ క్యాచర్ గా మారాడు. ఇంట్లోకి ప్రవేశించిన పామును ఫ్లోర్ క్లీన్ చేసే కర్ర సాయంతో ధైర్యంగా పట్టుకునేందుకు ప్రయత్నించాడు. అందుకు సంబంధించిన వీడియోను మెక్‌గ్రాత్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయగా అది కాస్త వైరల్ అయింది. వీడియో చూసిన నెటిజన్లు 'బ్రిలియంట్' అంటూ ప్రసంశించారు. మరికొందరు 'స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్ ను మీ స్థానంలో ఉంటే ఏడ్చుకుంటూ పరిగెత్తేవారని' ట్రోల్ చేశారు.
వివరాల్లోకి వెళితే..
గ్లెన్ మెక్‌గ్రాత్ ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌లో నివాసం ఉంటున్నారు. కొద్దిరోజుల క్రితం ఓ మూడు కొండచిలువలు ఆయన ఇంట్లోకి ప్రవేశించాయి. వాటిని చూసిన గ్లెన్ స్వయంగా రంగంలోకి దిగారు. ఫ్లోర్‌ను శుభ్రం చేసే కర్రతో ఓ కొండ చిలువ ఉన్న దగ్గరకు వెళ్లారు. దాన్ని కర్రతో నొక్కి పట్టి.. చేత్తో తోకను పట్టుకున్నారు. తర్వాత దాన్ని బయట పడేసి వచ్చారు. అనంతరం ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు.
సాధారణంగా ఇళ్లలోకి అప్పుడప్పుడు పాములు రావటం సహజం. ఇండియాలోని పట్టణాలు, నగరాల్లో కంటే పల్లెటూళ్లలో ఎక్కువగా పాములు ఇంట్లోకి దూరే సంఘటనలు చోటుచేసుకుంటూ ఉంటాయి. కానీ, ఆస్ట్రేలియాలో పరిస్థితి వేరుగా ఉంటుంది. అడవులు ఎక్కువగా ఉండటం వల్ల పెద్ద సర్పాలు తరచుగా ఇళ్లలోకి వస్తూ ఉంటాయి. చాలా మందికి వాటిని ఎలా పట్టుకుని బయట వదిలేసేయాలో తెలిసి ఉంటుంది. ఒక్కోసారి పెద్ద పెద్ద సెలెబ్రిటీ ఇళ్లలోకి కూడా పాములు వస్తూ ఉంటాయి. తాజాగా, ప్రముఖ స్టార్ క్రికెటర్ గ్లెన్ మెక్‌గ్రాత్ ఇంట్లోకి ఏకంగా మూడు కొండచిలువలు దూరాయి.