ఐపీఎల్ నేడు (మే 2) హై వోల్టేజ్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. రాజస్థాన్ రాయల్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. హైదరాబాద్ లోని ఉప్పల్ ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది. ఇరు జట్లలో స్టార్ ఆటగాళ్లుండడంతో ఈ మ్యాచ్ ఆసక్తి రేపుతోంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లలో దాదాపు ఎలాంటి మార్పులు చేసే అవకాశం కనిపించడం లేదు. అయితే సన్ రైజర్స్ మాత్రం ఒక కీలక మార్పుతో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తుంది.
విదేశీ ప్లేయర్ల కోటాలో ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసన్ అదరగొడుతుంటే.. కమ్మిన్స్ తన కెప్టెన్సీతో ఆకట్టుకుంటున్నాడు. అయితే జట్టులో మరో విదేశీ ఆటగాడు మార్కరం మాత్రం ప్రభావం చూపించలేకపోతున్నాడు. ఒక్క హాఫ్ సెంచరీ మినహాయిస్తే మిగిలిన మ్యాచ్ ల్లో విఫలమయ్యాడు. ఈ సఫారీ ఆటగాడి స్ట్రైక్ రేట్ కూడా దారుణంగా ఉంది. ఇప్పటికే సన్ రైజర్స్ వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిపోయి తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఈ నేపథ్యంలో మార్కరం స్థానంలో న్యూజిలాండ్ విధ్వంసకర బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ కు అవకాశం దక్కొచ్చు.
ఫిలిప్స్ అంతర్జాతీయ క్రికెట్ లో అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. గతేడాది సన్ రైజర్స్ తరపున మెరుపులు మెరిపించాడు. ఈ కారణంగానే విశ్రాంతి పేరుతో మార్కరంను పక్కన పెట్టొచ్చు. ఈ ఒక్క మార్పు మినహాయిస్తే జట్టులో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. సన్ రైజర్స్ ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్ ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతుంది. మరో మూడు మ్యాచ్ ల్లో గెలిస్తే ప్లే ఆఫ్ కు వెళ్తుంది.
మరోవైపు రాజస్థాన్ రాయల్స్ ఆడిన 9 మ్యాచ్ ల్లో 8 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఇప్పటికే టోర్నీలో 250 పరుగులకు పైగా మూడు సార్లు కొట్టేసిన సన్ రైజర్స్.. చివరి రెండు మ్యాచ్ ల్లో చెన్నై, ఆర్సీబీ జట్లపై బ్యాటింగ్ లో ఘోరంగా విఫలమైంది. దీంతో ఈ రోజు సొంత గడ్డపై ఎలాగైనా గెలవాలని భావిస్తుంది. ఏదైనా అభిమానులకు ఈ మ్యాచ్ లో ఫుల్ కిక్ దొరకడం ఖాయంగా కనిపిస్తుంది.
In all seriousness, in what is Aiden Markram better than Glenn Phillips? pic.twitter.com/3IuphWrb8i
— Prabhakar (@GeniusPrabhakar) May 1, 2024