బకాయిలు చెల్లించాల్సిందే .. ప్రభుత్వానికి మద్యం కంపెనీల అల్టిమేటం

  • లేకపోతే సరఫరా నిలిపివేస్తామని హెచ్చరిక
  • దాదాపు రూ.3,800 కోట్లు పెండింగ్!​
  • బీర్ల సరఫరా బంద్  చేస్తామని ఇప్పటికే యూబీఎల్  వెల్లడి

హైదరాబాద్, వెలుగు: తమకు బకాయిలు చెల్లించాల్సిందేనని, లేకపోతే మద్యం సరఫరా నిలిపివేస్తామని ప్రభుత్వానికి గ్లోబల్  లిక్కర్  కంపెనీలు అల్టిమేటం జారీ చేశాయి. తెలంగాణ ప్రభుత్వం తమకు దాదాపు రూ.3,800 కోట్ల బకాయిలు చెల్లించాల్సి డియాజియో, పెర్నోడ్  రికార్డ్, కార్ల్స్‌‌బర్గ్   వంటి మద్యం కంపెనీలు చెబుతున్నాయి. బకాయిలు చెల్లించకపోతే సరఫరా నిలిపివేయాల్సి వస్తుందని హెచ్చరించాయి.  తెలంగాణలో 70 శాతం  మార్కెట్  వాటాతో బీర్  రంగంలో అగ్రగామిగా ఉన్న యునైటెడ్  బ్రూవరీస్  (యూబీ).. చెల్లింపులు ఆలస్యం కావడంతో తమ ఆర్థిక పరిస్థితి దిగజారుతోందని, దీంతో తెలంగాణకు బీర్ల సరఫరా నిలిపివేస్తామని ఇప్పటికే ప్రకటించింది. 

రాష్ట్ర ప్రభుత్వం రూ.660 కోట్ల బకాయిలు చెల్లించాల్సి  ఉందని యూబీ కంపెనీ తెలిపింది. కార్ల్స్‌‌బర్గ్  కంపెనీకి దాదాపు రూ.40 కోట్లు, ఏబీ ఇన్ బెవ్  కు రూ.150 కోట్లు ఇవ్వాల్సి ఉంది. విస్కీ, స్కాచ్  తయారీదారులకు ఇంకా ఎక్కువ మొత్తంలో బకాయిలు చెల్లించాల్సిఉంది. పెర్నోడ్  రికార్డ్  కంపెనీకి ఏకంగా రూ.1500 కోట్లు, డయాజియోకు  రూ.1,000 కోట్లు చెల్లించాల్సి ఉంది. రాష్ట్రంలో మద్యం కంపెనీలు తమ ఉత్పత్తులను నేరుగా దుకాణాలకు సరఫరా చేయలేవు. అవి ప్రభుత్వ ఆధ్వర్యంలోని డిపోలకు మాత్రమే సరఫరా చేయాలి. ఆ తర్వాత డిపోల ద్వారానే రిటైల్  వ్యాపారులకు మద్యం చేరుతుంది. దీంతో, కంపెనీలు డబ్బుల కోసం పూర్తిగా ప్రభుత్వంపైనే ఆధారపడాల్సి వస్తోంది.

బీరు తయారీకి 16 శాతం, పన్నులే 70 శాతం

రాష్ట్ర ప్రభుత్వం చెల్లింపుల్లో జాప్యం చేయడమే కాకుండా, 2019---–20 ఆర్థిక సంవత్సరం నుంచి ధరల పెంపుకూ అనుమతించకపోవడంతోనే నష్టపోవాల్సి వస్తున్నదని యునైటెడ్​  బ్రూవరీస్​ లిమిటెడ్  (యూబీఎల్) పేర్కొన్నది. తెలంగాణకు బీర్ల సరఫరా నిలిపివేయాల్సిన పరిస్థితులపై యూబీఎల్​ వివరణ ఇచ్చింది. ‘‘బీరు తయారీ ముడిసరకు ధరలు పెరిగాయి. అందుకు అనుగుణంగా ధరలు పెంచలేదు. బీరు ధరలో తయారీ ధర 16 శాతం మాత్రమే ఇస్తున్నారు. మిగతా మొత్తంలో 70 శాతం ప్రభుత్వ పన్నులే ఉంటున్నాయి. కంపెనీకి సకాలంలో చెల్లింపులు జరగడం లేదు.  దీంతో నష్టాలతో వ్యాపారం చేయలేక రాష్ట్రానికి బీర్ల సరఫరా నిలిపివేయాలని నిర్ణయించాం” అని యూబీఎల్  ఒక ప్రకటనలో  పేర్కొన్నది.