- క్యాంపస్ రిక్రూట్‌మెంట్ స్టార్టయి 10 రోజులు కాకుండానే భారీగా ఆఫర్లు
- ఇండియన్ టాలెంట్ కు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్న గ్లోబల్ కంపెనీలు
బిజినెస్ డెస్క్, వెలుగు: ఐఐటీ స్టూడెంట్లకు రూ. కోట్లల్లో జీతాలివ్వడానికి కూడా కంపెనీలు వెనకడుగేయడం లేదు. క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ స్టార్టయి 10 రోజులు కూడా కాకుండానే చాలా ఐఐటీలకు వేలల్లో ఆఫర్స్ వచ్చాయి. ఈ సారి రూ. కోటి శాలరీ ప్యాకేజి అందుకున్న స్టూడెంట్లు బాగా పెరిగారు. కొంత మందికి రూ. 2 కోట్ల శాలరీ ప్యాకేజిని ఆఫర్ చేసి మరీ హైర్ చేసుకున్నారు. కిందటేడాదితో పోలిస్తే ఈ ఏడాది జరుగుతున్న క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో ఎక్కువ మంది ఐఐటీయన్లను కంపెనీలు నియమించుకున్నాయి. ఐఐటీ కాన్పూర్, రూర్కీ, ఖరగ్‌ఫూర్, వారణాసి (బీహెచ్‌యూ) లకు చెందిన 80 మంది స్టూడెంట్లు ఈ ఏడాది రూ. కోటికి పైగా శాలరీ ప్యాకేజిని దక్కించుకోవడం విశేషం. ఇది కిందటేడాది అన్ని ఐఐటీల నుంచి రూ. కోటి ప్యాకేజి తీసుకున్న స్టూడెంట్ల కంటే ఎక్కువ. ఐఐటీ కాన్పూర్, మద్రాస్, ఖరగ్‌పూర్, రూర్కీ, గౌహతి, బీహెచ్‌యూలు ఏకంగా 220 కి పైగా ఇంటర్నేషల్ ఆఫర్స్‌ను అందుకున్నాయి. ఐఐటీ మద్రాస్ నుంచి ఈ ఏడాది 45 మంది స్టూడెంట్లకు ఇంటర్నేషనల్ కంపెనీల నుంచి ఆఫర్స్ వచ్చాయి. ఇది కిందటేడాది వచ్చిన 16 ఆఫర్స్‌తో పోలిస్తే 181 శాతం ఎక్కువ. ఐఐటీ గౌహతి నుంచి 28 మంది, ఐఐటీ కాన్పూర్ నుంచి 47 మంది, ఐఐటీ బీహెచ్‌యూ నుంచి 35 మంది స్టూడెంట్లకు ఇంటర్నేషనల్ ఆఫర్స్ వచ్చాయి. క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ స్టార్టయ్యి కొన్ని రోజులే అయినప్పటికీ, ఐఐటీ ఖరగ్‌పూర్‌కు 1,300 ఆఫర్లు, ఐఐటీ గౌహతికి 625 ఆఫర్లు, ఐఐటీ మద్రాస్‌కు 1,208 ఆఫర్లు వచ్చాయి. ఐఐటీ స్టూడెంట్లకు రూ. 2 కోట్ల వరకు ప్యాకేజి ఇవ్వడానికి కూడా కంపెనీలు వెనకాడడం లేదు. క్యాబ్ సర్వీస్‌లను అందించే ఉబర్ ఐఐటీ బాంబే స్టూడెంట్లకు రూ. 2 కోట్ల ప్యాకేజిని ఆఫర్ చేసింది.
ఇండియన్సే ఎందుకు..
గ్లోబల్ కంపెనీలు ఇండియన్ ట్యాలెంట్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ సీఈఓగా సత్య నాదెళ్ల, గూగుల్ సీఈఓగా సుందర్ పిచాయ్, తాజాగా ట్విటర్ సీఈఓగా పరాగ్ అగర్వాల్ పనిచేస్తున్న విషయం తెలిసిందే. అరవింద్ కృష్ణ (ఐబీఎం), శంతను నారాయణ్ (అడోబ్), రాజీవ్ సూరి (ఇన్మార్శాట్), పునీత్ రంజన్ (డెలాయిట్ ).. ఇలా మల్టీ నేషనల్ కంపెనీలకు సీఈఓలుగా పనిచేస్తున్న ఇండియన్ ఆరిజన్స్ లిస్టు చాలా పెద్దగానే ఉంటుంది. ఇలా కంపెనీలను నడపడానికి ఇండియన్స్‌ను ఫౌండర్లు ఎంచుకోవడంలో కారణాలు లేకపోలేదని ఎనలిస్టులు పేర్కొన్నారు. సమస్యలను పరిష్కరించగలిగే గుణం, ఇంగ్లిష్ భాష స్పష్టంగా ఉండడం, హార్డ్ వర్క్.. ఈ అంశాలను గ్లోబల్ కంపెనీల ఫౌండర్లను ఆకర్షిస్తున్నాయని చెబుతున్నారు. ‘అనేక మతాలు, భాషలు, సంప్రదాయాల మధ్య పెరుగుతుండడంతో క్లిష్టమైన సమస్యల్లో కూడా ముందుండి నడిపించగలిగే సత్తా ఇండియన్స్‌కు ఉంది’ అని ఐఐటీ గ్రాడ్యుయేట్ , సన్‌మైక్రోసిస్టమ్స్ ఫౌండర్ వినోద్ ఖోస్లా అభిప్రాయపడ్డారు. దేశ ఎడ్యుకేషన్ సెక్టార్‌లో నెలకొన్న కాంపిటేషన్, సొసైటీలోని సమస్యలు వారి సోషల్ స్కిల్స్‌ను మెరుగుపరుస్తున్నాయని చెప్పారు. వీటికి అదనంగా ఐఐటీ లాంటి సంస్థల్లో నేర్చుకున్న టెక్నికల్ ఎడ్యుకేషన్ సాయపడుతోందని అభిప్రాయపడ్డారు. సిలికాన్ వ్యాలీ (యూఎస్)కి టెక్నికల్ ఎక్స్‌పర్టులు చాలా మంది కావాలి. కేవలం టెక్నికల్ నాలెడ్జే కాకుండా వివిధ కమ్యూనిటీలను మేనేజ్ చేయగలగడం, అనుకోని పరిస్థితుల్లో నడిపించగలగడం వంటి గుణాలను కంపెనీల ఫౌండర్లు, షేరుహోల్డర్లు కోరుకుంటున్నారు.
రాత్రికి రాత్రే కాలేదు..
‘ఇన్నోవేషన్స్ కావాలంటే రూల్స్‌ను బ్రేక్ చేయాల్సిందే. ఇండియాలో ఒక్క రూల్ కూడా బ్రేక్ చేయకుండా బతకలేం. కారణం ఏదైనా కావొచ్చు లేదా అవినీతి, అసమర్ధ పాలనను డీల్ చేయాలనుకోవడానికైనా రూల్స్ బ్రేక్ చేయాల్సిందే’ అని ఇండియన్ అమెరికన్ అకాడమిక్ వివేక్ వాధ్వా అన్నారు. సిలికాన్ వ్యాలిలో పనిచేసినప్పుడు ఈ స్కిల్స్ అన్నీ సాయపడతాయని అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ఇక్కడ నిరంతరం అథారిటీని ఛాలెంజ్ చేయాల్సిందేనని అన్నారు. ఇంకా ఎంఐటీ, హార్వర్డ్ కంటే 10 రెట్లు ఎక్కువ కష్టంగా ఐఐటీ ఎంట్రెన్స్ ఉంటుందని అన్నారు. ప్రస్తుతం మల్టీ బిలియనీర్ కంపెనీలను నడుపుతున్న ఇండియన్ సీఈఓలకు ఆ పదవులు రాత్రికి రాత్రే రాలేదని ఐఐటీ బాంబే డిప్యూటీ డైరెక్టర్ ఎస్ సుదర్శన్ అన్నారు. అగర్వాల్, పిచాయ్, నాదెళ్ల వీరందరూ ఏళ్లకు ఏళ్లు కంపెనీల్లో పనిచేసి అంచలు అంచలుగా ఎదిగారని చెప్పారు. ఆయా కంపెనీల ఫౌండర్ల నమ్మకాన్ని పొందగలిగారని వాద్వా అన్నారు.