ఖైరతాబాద్, వెలుగు: హిందూ దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనం ఎందుకు అని పలువురు వక్తలు ప్రశ్నించారు. ప్రభుత్వ ఆధీనం నుంచి తప్పించి, హిందువులకు హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. సనాతన ధర్మ పరిరక్షణ, గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సమావేశం నిర్వహించారు. రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఎం.నాగేశ్వరరావు, డాక్టర్ వెలగపూడి ప్రకాశరావు, ఎల్వీ గంగాధరశాస్త్రి పాల్గొని మాట్లాడారు. దేశంలోని ఒక్కో మతానికి ఒక్కో రూల్ఎందుకు అని ప్రశ్నించారు.
ప్రభుత్వం హిందూ ఆలయాలను మాత్రమే తన ఆధీనంలో ఎందుకు తీసుకుంటుందో సమాధానం చెప్పాలన్నారు. హైందవ ఆలయాల్లో పనిచేస్తున్న కొంతమంది అధికారులకు హిందూ దేవుళ్లపై విశ్వాసం లేదని, అలాంటి వారు భక్తులకు, ప్రజలకు ఎలా సేవ చేస్తారని ప్రశ్నించారు. ఆలయ భూములను, ఆస్తులను కాపాడుకోవడంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. కానుకలు దుర్వినియోగం అవుతున్నాయని ఆరోపించారు. సమావేశంలో రామెల్ల అవధానులు, పంకజ్ శ్రీనివాసన్ తదితరులు పాల్గొని మాట్లాడారు. అనంతరం బుక్ ఆవిష్కరించారు.