
యూఎస్ డాలర్‌పై ఇన్వెస్టర్లకు నమ్మకం తగ్గుతోంది. ఈ కరెన్సీని విడిచి పెట్టి స్విస్ ఫ్రాంక్, జపనీస్ యెన్, యూరో, బంగారం వంటి ఇతర సేఫ్ అసెట్స్ వైపు పరుగులు తీస్తున్నారు. ట్రంప్ టారిఫ్‌లను 90 రోజుల పాటు వాయిదా వేసినా, డాలర్ విలువ పతనం ఆగడం లేదు. అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఇన్వెస్టర్లకు నమ్మకం తగ్గుతుండడమే ఇందుకు కారణమని ఎనలిస్టులు భావిస్తున్నారు. సాధారణంగా గ్లోబల్ ఆర్థిక వ్యవస్థలో అస్థిరత నెలకొంటే డాలర్‌కు డిమాండ్ పెరగాలి. కానీ, గత వారం రోజులుగా డాలర్ వాల్యూ పడుతుతోంది. మరోవైపు స్విస్ ఫ్రాంక్ విలువ డాలర్ మారకంలో 10 ఏళ్ల గరిష్టానికి చేరుకుంది.
బంగారం ధర ఆల్ టైమ్ గరిష్టాన్ని టచ్ చేసింది. జపనీస్ యెన్, యూరో విలువ కూడా పెరిగింది. యూరో మారకంలో డాలర్ విలువ శుక్రవారం ఒకటిన్నర శాతం పడగా, బ్రిటన్ పౌండ్ మారకంలో ఒక శాతం పడింది. మేజర్ కరెన్సీలతో డాలర్ విలువను కొలిచే డాలర్ ఇండెక్స్ గురువారం 3 శాతం తగ్గి100 దిగువకు పడిపోయింది. గత 12 నెలల్లో ఇంత వేగంగా డాలర్ వాల్యూ పడడం ఇదే మొదటిసారి. 2023 జులై తర్వాత మొదటిసారిగా 100 దిగువకు పతనమైంది. బుధవారం హిస్టారికల్ ర్యాలీ తర్వాత యూఎస్ స్టాక్ మార్కెట్లూ భారీగా పడ్డాయి. లాంగ్ టెర్మ్ యూఎస్ ట్రెజరీలను కూడా ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో అమ్మేస్తున్నారు.
మన రూపాయిపై ప్రభావం..
రూపాయి విలువ శుక్రవారం డాలర్ మారకంలో 61 పైసలు బలపడి 86.07వద్ద సెటిలయ్యింది. డాలర్ క్షీణిస్తుండడం, చమురు ధరలు తగ్గడంతో త్వరలో రూపాయి బలపడే అవకాశం ఉందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఇండియాపై 26 శాతం టారిఫ్ రేటును జులై 9 వరకు వాయిదా వేస్తామని ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. రూపాయి బలపడడానికి ఇదొక కారణం. డాలర్ మారకంలో రూపాయి శుక్రవారం 86.22 వద్ద ఓపెన్ అయ్యింది. ఇంట్రాడేలో 85.95 వరకు మెరుగుపడింది.