
- మరింత ముంచిన చైనా రివేంజ్ సుంకాలు
- చైనా, జపాన్, ఇండియా సహా అమెరికాలోనూ హాహాకారాలు
- కరోనా తర్వాత భారీగా పడిన మన సెన్సెక్స్, నిఫ్టీ
- మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు సైతం 15% దాకా నష్టాల్లోకి..!
- పది సెకండ్లలో భారతీయుల రూ. 20 లక్షల కోట్లు గాయబ్
- ఘోరంగా పతనమైన చైనా, జపాన్, బ్రెజిల్, హాంకాంగ్ స్టాక్స్
- అమెరికాను వణికిస్తున్న 1987 నాటి ‘బ్లాక్ మండే’,
- ఆర్థిక మాంద్యం భయాలు టారిఫ్‌లపై వెనక్కి తగ్గని ట్రంప్.. చర్చలతోనే పరిస్థితి అదుపులోకి!
సెంట్రల్ డెస్క్, వెలుగు: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదలుపెట్టిన టారిఫ్ వార్తో ప్రపంచ మార్కెట్లు ఆగమవుతున్నాయి. చైనా, బ్రెజిల్, జపాన్, కెనడా, మెక్సికో, స్విట్జర్లాండ్, రష్యా, ఆస్ట్రేలియా, ఇండియాతోపాటు అమెరికా మార్కెట్లు సైతం కుప్పకూలుతున్నాయి. ఇన్వెస్టర్ల సంపద తుడిచిపెట్టుకుపోతున్నది. ట్రంప్‌కు రివేంజ్‌గా అమెరికాపై చైనా కూడా టారిఫ్ వేస్తానని ప్రకటించడం మరింత ఆజ్యం పోసినట్లయింది. రెండు రోజుల వీకెండ్ సెలవుల తర్వాత సోమవారం ఇండియా దలాల్ స్ట్రీట్ ఓపెన్ అవుడుతోనే బ్లడ్ బాత్ కనిపించింది. సెన్సెక్స్ 4 వేల పాయింట్లు, నిఫ్టీ50 1,200 పాయింట్ల నష్టాలతో మొదలయ్యాయి. మొదట్లో ఈ రెండు కీలక ఇండెక్స్‌లు 5 శాతం నష్టపోయి చివర్లో కాస్త కోలుకున్నాయి. మిడిల్ క్లాస్ ప్రజలు ఎక్కువగా ఇన్వెస్ట్ చేసే స్మాల్, మిడ్‌క్యాప్ షేర్లు సైతం 10 నుంచి 15 శాతం దాకా పడిపోయాయి. ఉదయం పది సెకండ్లలోనే మన ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ. 20 లక్షల కోట్లు ఆవిరై పోయింది. చివరికి అది రూ.14 లక్షల కోట్ల నష్టంతో ముగిసింది. 2020 కరోనా తర్వాత ఇంతలా మన షేర్ మార్కెట్లు పడటం ఇదే తొలిసారి. భారత్‌తో పోలిస్తే చైనా, జపాన్, బ్రెజిల్, హాంకాంగ్ మార్కెట్లయితే 10 శాతం వరకు నష్టాలను మూటగట్టుకున్నాయి. అమెరికాలో హాహాకారాలు కొనసాగుతున్నాయి. వరుసగా నాలుగు సెషన్స్ నుంచి అక్కడి ఇండెక్స్‌లు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. 1987 అక్టోబర్‌లో యూఎస్ మార్కెట్లను కుదిపేసిన ‘బ్లాక్ మండే’ పరిస్థితి రిపీట్ అవ్వొచ్చన్న భయాలు నెలకొన్నాయి.
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ కొలువుదీరినప్పటి నుంచి మన ఇండియా షేర్ మార్కెట్లు పైకి కిందికి ఊగిసలాడుతున్నాయి. ఈ నెల 2న అన్ని దేశాలపై ట్రంప్ టారిఫ్‌లు వేయడంతో పతనం పీక్స్‌కు చేరింది. శుక్రవారం 75,364 పాయింట్లతో ముగిసిన బీఎస్ఈ సెన్సెక్స్ సోమవారం 71,449 పాయింట్లతో ఓపెన్ అయింది. రోజంతా నష్టాల్లోనే కొనసాగుతూ చివరికి 73,137 దగ్గర ముగిసింది. నిఫ్టీ 50 శుక్రవారం 22,904 పాయింట్లతో క్లోజ్ కాగా.. సోమవారం 21,758 పాయింట్లతో ఓపెన్ అయింది. సెన్సెక్స్ మాదిరిగానే దాదాపు 5 శాతం నష్టాలతో మొదలై.. చివరికి 3.25 శాతం నష్టాలతో నిఫ్టీ 50 ముగిసింది. నిరుడు డిసెంబర్లో 82వేల మార్క్ దగ్గర ఉన్న సెన్సెక్స్, 24,500 మార్క్ దగ్గర ఉన్న నిఫ్టీ 50 ఇప్పుడు కుప్పకూలాయి. గత ఐదు సెషన్లలో సుమారు 5,000- నుంచి 6,000 పాయింట్లు సెన్సెక్స్ పడిపోయింది. సోమవారం అన్ని సెక్టార్ల స్టాక్స్‌లో ‘రెడ్’ సిగ్నలే కనిపించింది. కొన్ని స్టాక్స్ అయితే 15 శాతం మేర పడిపోయాయి. మన అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్ ఐదు సెషన్స్‌లో ఏడున్నర శాతానికిపైగా నష్టపోయింది. విప్రో, ఇన్ఫోసిస్ పరిస్థితి అట్లనే ఉంది. అయితే.. సోమవారం మొదట్లో ఈ షేర్లు పడ్డప్పటికీ తర్వాత కాస్త కోలుకున్నాయి. అత్యధికంగా మెటల్ సెక్టార్ సోమవారం ఒక్కరోజే 7శాతం నష్టాలను మూటగట్టుకుంది. 2020 కరోనా టైమ్‌లో, అంతకు ముందు 2008లో ఆర్థిక మాంద్యం టైమ్‌లో కనిపించిన పతనమే ఇప్పుడూ రిపీట్ అయింది.
మరింత ముంచిన చైనా రివేంజ్
అన్ని దేశాలపై సుంకాలు వేస్తున్నట్లు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ లెక్కలతో ముందుకు రాగా.. దీనికి రివేంజ్‌గా చైనా కూడా టారిఫ్ యుద్ధం మొదలుపెట్టింది. అమెరికా నుంచి తమ దేశానికి దిగుమతి అయ్యే అన్ని వస్తువులపై 34 శాతం టారిఫ్ వేస్తామని శుక్రవారం రాత్రి జిన్‌పింగ్ ప్రకటించారు. దీంతో వాణిజ్య యుద్ధం మరింత ముదురుతున్నదన్న సంకేతాలు మార్కెట్లలోకి వెళ్లాయి. పైగా యురోపియన్ యూనియన్‌దేశాలు కూడా అమెరికాపై టారిఫ్‌లు విధించేందుకు సిద్ధమవుతున్నాయన్న వార్తలు ఇంకింత హీట్ పుట్టించాయి. ట్రంప్ టారిఫ్‌లకు తోడు చైనా రివేంజ్ వల్ల సోమవారం ప్రపంచ మార్కెట్లు కుప్పకూలాయి. రివేంజ్‌కు సిద్ధమైన చైనా అయితే భారీగా నష్టపోయింది. 8 నుంచి 10 శాతం వరకు ఆ దేశ మార్కెట్లు పతనమయ్యాయి. ఒకప్పుడు ఉన్నట్లుగా ఇప్పుడు గ్లోబల్ పరిస్థితులు ఉండబోవని, జాగ్రత్తగా ఉండాలని సింగపూర్ ప్రధాని ప్రకటించడం కూడా భయాలను రేకెత్తించింది.
అమెరికా ఆగం.. 1987 రిపీట్!
‘అమెరికా ఫస్ట్’.. ‘మేక్ అమెరికా గ్రేట్ అగెయిన్’ అంటూ టారిఫ్‌ల నినాదమెత్తుకున్న ట్రంప్ తీరుకు ఆయన సొంత దేశం అమెరికా కూడా ఘోరంగా దెబ్బతింటున్నది. ఈ నెల 2న ‘లిబరేషన్ డే’ అంటూ అన్నిదేశాలపై ట్రంప్ టారిఫ్‌లు అమలును మొదలుపెట్టారు. ఇండియాపై 26శాతం వరకు విధించారు. ట్రంప్ టారిఫ్‌లు ప్రకటిస్తున్న సమయంలో అమెరికా స్టాక్ మార్కెట్ ఇండెక్స్‌లు డోజోన్స్, నాస్డాక్ పాజిటివ్‌గా ట్రేడ్ అయ్యాయి. ఒకానొక దశలో 5శాతం వరకు గ్రీన్‌లో నడిచాయి. ఆ వెంటనే కుప్పకూలడం మొదలుపెట్టాయి. రెండు రోజుల్లో (గురువారం, శుక్రవారం కలిపి) రూ. 415 లక్షల కోట్ల అమెరికన్ ఇన్వెస్టర్ల సంపద హుష్‌కాకి అయింది. శుక్రవారం డోజెన్స్ 5.5 శాతం, నాస్డాక్ 5.8 శాతం పడిపోయాయి. ఇంతలా అమెరికా మార్కెట్లు పడిపోవడం 1987 తర్వాత ఇదే మొదటిసారి అని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. మూడు సెషన్స్‌లో డోజోన్స్, నాస్డాక్ 10 నుంచి 15 శాతం పడిపోయింది. 1987 అక్టోబర్19 ఇప్పటికీ అమెరికా మార్కెట్లలో ‘బ్లాక్ మండే’. అప్పట్లో డోజోన్స్ 22.6 శాతం క్రాష్ అయింది. ఆ తర్వాత ట్రంప్ సెకండ్ టర్మ్ అధికారం చేపట్టినప్పటి నుంచి బ్లాక్ మండే భయాలు అమెరికా మార్కెట్లలో వినిపిస్తున్నాయి. మూడురోజుల్లో జరిగిన నష్టాన్ని చూసి తప్పకుండా 1987 అక్టోబర్ 19 నాటి పరిస్థితి వస్తుందని ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడానికే తాను టారిఫ్ వార్ మొదలు పెట్టానని ట్రంప్ చెప్తున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇన్నాళ్లూ ఆగమైందని, ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నదని, ఆరోగ్యంగా ముందుకు వస్తుందని ఆయన అంటున్నారు. ఇప్పుడు కనిపిస్తున్న నష్టాలు తాత్కాలికమేనని, భవిష్యత్తు అమెరికాదేనని చెప్తున్నారు. కానీ, ట్రంప్ తీరును అమెరికన్లు కూడా తీవ్రంగా తప్పుబడ్తున్నారు. మూడురోజులుగా అక్కడ 50 రాష్ట్రాల్లో జనం వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు. ట్రంప్ తీరు వల్ల ఆర్థిక సంక్షోభం ఏర్పడే పరిస్థితి దాపురించిందని, అన్ని ధరలు పెరిగిపోయాయని, నిత్యావసర వస్తువులకు కటకట ఏర్పడుతున్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
స్టాక్స్‌తోపాటు క్రూడ్ పడటం దేనికి సంకేతం?
ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుప్పకూలడంతోపాటు క్రిప్టో కరెన్సీ కూడా భారీగా పడిపోతున్నది. ఈ నెల 2న రాత్రి 72లక్షల వరకు ట్రేడ్ అయిన బిట్ కాయిన్.. ఇప్పుడు 67 లక్షల దగ్గర నడుస్తున్నది. అంటే ఐదురోజుల్లో 5లక్షల పాయింట్లు నష్టపోయింది. స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతుంటే.. క్రూడాయిల్, గోల్డ్ రేట్లు పెరగాలి. కానీ, అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. క్రూడాయిల్ ఐదురోజుల్లో 15శాతం పడిపోయింది. ఏడాది కింద 90 డాలర్లు ఉన్న బారెల్ క్రూడాయిల్ ధర ఇప్పుడు 63 డాలర్లకు పడిపోయింది. గల్ఫ్ కోఆపరేషన్స్ కౌన్సిల్ స్టేట్స్ అయిన బెహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతర్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పై కూడా ట్రంప్ టారిఫ్ వార్‌కు దిగడంతో క్రూడ్ పడిపోతున్నది. గోల్డ్ రేట్ కూడా తగ్గుతున్నది. షేర్ మార్కెట్లతోపాటు క్రూడాయిల్, గోల్డ్ పడిపోవడం ఆర్థిక మాంద్యానికి సంకేతాలని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆర్థిక మాంద్యం దిశగా అమెరికా పయనిస్తున్నదని, ఇది ప్రపంచ మంతా విస్తరించే ప్రమాదం ఉందని భావిస్తున్నాయి. మొన్నటి వరకు అమెరికాలో రెసిషన్ పరిస్థితులు 35శాతం ఉన్నాయని చెప్పిన ప్రముఖ సంస్థ గోల్డ్‌మెన్ సాచెస్ ఇప్పుడు దాన్ని 45శాతానికి చేర్చింది. ట్రంప్ మాత్రం.. క్రూడ్ ఆయిల్ పడిపోతున్నదంటే అది ఆర్థికవ్యవస్థ బలోపేతానికి సంకేతమని, రెసిషన్స్కు చాన్స్ లేదని అంటున్నారు.
వాట్ నెక్ట్స్
సోమవారం ఒక్కసారిగా మార్కెట్లు భారీగా కుప్పకూలడానికి ట్రంప్ విధించిన టారిఫ్‌లకు తోడు రివేంజ్‌గా చైనా విధించిన 34శాతం టారిఫ్ కారణమని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. చైనాతోపాటు ఇతర దేశాలు కూడా రివేంజ్‌కు దిగితే పరిస్థితి అదుపుతప్పుతుందని ఇన్వెస్టర్లు సెల్లింగ్ సైడ్ మొగ్గుచూపుతున్నారు. ఈ పరిస్థితి కూల్ ఆఫ్ కావలంటే.. ముందున్న ఆప్షన్లలో మొదటిది ట్రంప్ దిగిరావడం, రెండోది ఇతర దేశాలు ట్రంప్‌తో చర్చలు జరపడం. తమపై చైనా విధించిన రివేంజ్ టారిఫ్‌లను ట్రంప్ కొట్టిపారేశారు. అమెరికాపై అత్యధికంగా టారిఫ్ వేస్తున్న దేశాల్లో చైనా ఒకటని, దానికి రెసిప్రోకల్ టారిఫ్‌ను తాము విధించామని, ఇప్పుడు మళ్లీ వేయడం హాస్యాస్పదమని ఆయన ఖండించారు.
50 దేశాల వరకు ట్రంప్‌తో టారిఫ్‌లపై చర్చించేందుకు రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. వియాత్నం అయితే ఏకంగా అమెరికాపై తమ టారిఫ్‌లను జీరో చేస్తామన చెప్తున్నది. అధికారంగా ఆ దేశం ప్రకటించనప్పటికీ.. ఒకవేళ వియాత్నం జీరో టారిఫ్‌ను ప్రకటిస్తే మాత్రం స్టాక్ మార్కెట్లకు శుభ పరిణామమని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. వియాత్నం జీరో చేస్తే తామూ ఆ దేశంపై టారిఫ్‌లను జీరో చేస్తామని అమెరికా అధికార వర్గాలు చెప్తున్నాయి.
మన దేశం కూడా అమెరికాతో టారిఫ్‌లపై చర్చలకు రెడీ అవుతున్నట్లు తెలుస్తున్నది. చైనా మాదిరిగా రివేంజ్ టారిఫ్‌లతో అసలుకే ఎసరు వస్తుందని, చర్చలతోనే ట్రేడ్ బంధాన్ని బలోపేతం చేసుకోవచ్చని ఇండియా భావిస్తున్నది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కోసం ఇండియా వెళ్తే, ఈ దిశగా చర్చలు మొదలైతే.. స్టాక్ మార్కెట్‌కు గుడ్ న్యూసే.
రెండు నెలలకోసారి జరిగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మీటింగ్ సోమవారం మొదలైంది. బుధవారం ఆ మీటింగ్వివరాలు బయటకు రానున్నాయి. ఈసారి కూడా రెపో రేట్స్‌ను ఆర్బీఐ కట్ చేసే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్లు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే షేర్ మార్కెట్లకు బూస్టింగ్లభిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్బీఐ రేట్ కటింగ్స్ వైపు మొగ్గు చూపొచ్చని, అయితే.. ఆర్థిక మాంద్యం వార్తల నేపథ్యంలో వెనక్కి కూడా తగ్గొచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నెలకొన్న భయాలు కొన్నిరోజులు కొనసాగవచ్చని, అప్పటివరకు ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగులు వేయాలని మార్కెట్ వర్గాలు సలహా ఇస్తున్నాయి.