కొద్దిసేపు ప్రపంచమంతా ఎక్కడికక్కడ నిలిచిపోయిందా అనిపించింది. రన్‌వేల మీదే నిలిచిపోయిన విమానాలు. ఎయిర్ పోర్టుల్లో బారులు తీరిన ప్రయాణికులు. ఆన్‌లైన్ బ్యాంకింగ్ పనిచేయక కాల్‌సెంటర్లకు వరుస ఫోన్లు. అసలేం జరుగుతుందో తెలియక అయోమయంలో కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులు. దీనంతటికీ కారణం మైక్రోసాఫ్ట్ విండోస్ పనిచేయకపోవడమే. ప్రపంచవ్యాప్తంగా లక్షల కంప్యూటర్లు, విండోస్‌తో పనిచేసే మెషిన్లు ఒక్కసారిగా మొరాయించాయి.
ఆ ఎఫెక్ట్ కంపెనీలు, సంస్థలతో పాటు సామాన్యుడి మీద కూడా పడింది. విండోస్ ఇన్‌స్టాల్ చేసిన ఒక్క శాతం కంప్యూటర్లలో సమస్య వస్తేనే ఇలా ఉందంటే.. ప్రపంచంలోని అన్ని కంప్యూటర్లు క్రాష్ అయితే! ఆ పరిస్థితులను అంచనా వేయడం కూడా కష్టమే కదా. అసలు విండోస్ ఎందుకు పనిచేయలేదు? ఆ అంతరాయం ఏయే వ్యవస్థల మీద ఎక్కువ ప్రభావం చూపింది? ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తాయి? అసలు టెక్నాలజీ లేకపోతే బతకలేమా?
చైనాలో ‘నో’ ఎఫెక్ట్
ప్రపంచంలో ఎన్నో దేశాలు మైక్రోసాఫ్ట్ విండోస్ ఔటేజ్ వల్ల ఇబ్బందిపడ్డాయి. కానీ.. చైనాపై మాత్రం అంతగా ప్రభావం చూపలేదు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ రిపోర్ట్ ప్రకారం.. చైనాలోని విదేశీ వ్యాపారాలు, హోటల్ చెయిన్స్ మాత్రమే ఎఫెక్ట్ అయ్యాయి. చైనాలోని మౌలిక సదుపాయాలు, మెజారిటీ సేవల మీద ఎఫెక్ట్ లేదు. సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే బ్రిటన్, అమెరికాలో కూడా విమానాలు రద్దయ్యాయి. భారతదేశం, నేపాల్, పాకిస్తాన్ లాంటి చైనా పొరుగు దేశాల్లోని ఎయిర్ సర్వీసుల్లో అంతరాయం ఏర్పడింది.
అయినా... చైనాలో ఆ పరిస్థితి కనిపించలేదు. ఎందుకంటే.. చైనా సైబర్ సెక్యురిటీ విషయంలో థర్డ్ పార్టీ, విదేశీ సర్వీసుల మీద ఆధారపడటం చాలా తక్కువ. విదేశీ హార్డ్‌వేర్లను కూడా చాలా తక్కువగా వాడుతుంది. ఆ దేశంలో మైక్రోసాఫ్ట్ వాడేవాళ్లు కూడా తక్కువే. చైనాలో పనిచేస్తున్న విదేశీ సంస్థలు మాత్రమే క్రౌడ్ స్ట్రయిక్ సేవలు వాడుతున్నాయి.