‘మిస్ వరల్డ్​’తో.. తెలంగాణకు ప్రపంచ గుర్తింపు

‘మిస్ వరల్డ్​’తో..   తెలంగాణకు  ప్రపంచ గుర్తింపు

హైదరాబాద్ నగరం మరో ప్రపంచ వేడుకకు వేదికగా మారింది. ‘హప్పెనింగ్ సిటీ’గా పేరొందిన ఈ నగరం 72 వ ప్రపంచ సుందరి పోటీల నిర్వహణకు ఆతిథ్యం ఇవ్వనుంది.  ప్రపంచంలోని  దాదాపు 140 దేశాల నుంచి ఈ ప్రపంచ సుందరి  పోటీలలో పాల్గొననున్నారు.  2025  మే 7 వ తేదీ నుంచి 31వ తేదీ వరకు హైదరాబాద్​లో  జరిగే  72వ మిస్ వరల్డ్ పోటీలను కవర్ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3000 మందికి పైగా జాతీయ, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు హాజరుకానున్నారు. 

ప్రస్తుత       ప్రపంచ   సుందరి,   జెకోస్లోవేకియాకు చెందిన క్రిస్టినా జెకోవా, మిస్ వరల్డ్ చైర్మన్,  సి.ఈ.ఓ  జూలియా మొర్లే,  తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, టూరిజం, కల్చర్ శాఖ  కార్యదర్శి స్మిత సబర్వాల్  హైదరాబాద్​లో నిర్వహించనున్న మిస్ వరల్డ్ పోటీల వివరాలు మీడియాకు వెల్లడించారు.  


మే 6 ,7 తేదీలలో ప్రపంచ సుందరీమణులు హైదరాబాద్​లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ  విమానాశ్రయానికి  చేరుకుంటారు.  మే 10 వ తేదీన గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో తెలంగాణ సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా ఈ మిస్ వరల్డ్ పోటీల ప్రారంభోత్సవం జరుగుతుంది.  మే 12న  నాగార్జున సాగర్ లోని  బుద్ధవనంను ఈ పోటీలలో  పాల్గొనేవారు సందర్శిస్తారు.  మే 13న హైదరాబాద్​లోని  చౌమహల్లా ప్యాలెస్​లో జరిగే హెరిటేజ్ వాక్​లో పాల్గొంటారు.

మే15న యాదగిరి గుట్ట పర్యటన

14 న  ప్రపంచ హెరిటేజ్ కట్టడమైన చారిత్రక రామప్ప దేవాలయాన్ని సందర్శిస్తారు.  అదేరోజు, హన్మకొండ లోని  కాళోజి   కళాక్షేత్రంలో స్థానిక విద్యార్థుల సమావేశంలో పాల్గొంటారు.  మే 15న యాదగిరి గుట్ట,  పోచంపల్లిలో పర్యటిస్తారు.  మెడికల్ టూరిజంలో భాగంగా 16న హైదరాబాద్​లోని పలు ప్రముఖ  ఆసుపత్రులకు వెళ్తారు.  మే 17న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్  స్పోర్ట్స్ గ్రాండ్ ఫైనల్ ఉంటుంది. 19 న  పోలీస్  కమాండ్ కంట్రోల్ రూమ్  సందర్శన,  మే 20, -21 తేదీలలో గచ్చిబౌలిలోని  టిహబ్​లో  కాంటినెంటల్  క్లస్టర్  ఫైనల్ పోటీలు జరుగుతాయి. 

21వ తేదీన శిల్పారామంలో  క్రాఫ్ట్ వర్క్ షాప్​లో పాల్గొంటారు. 22న శిల్పకళావేదికలో మిస్ వరల్డ్  టాలెంట్ ఫైనల్ పోటీలు జరుగుతాయి.  మే 23న హైదరాబాద్ ISBలో కీలక పోటీలు. 24 న  హైటెక్స్ లో  మిస్ వరల్డ్  టాప్ మోడల్,  ఫ్యాషన్ ఫైనల్ పోటీలు జరుగుతాయి.  25న జువెలరీ, ముత్యాల ఆభరణాల ప్రదర్శన నిర్వహిస్తారు.  మే 26న బ్రిటిష్  రెసిడెన్సీ లేదా  తాజ్ ఫలక్​నామాలో  గ్రాండ్​గా డిన్నర్  ఏర్పాటు చేశారు.  మే 31వ తేదీన  హైటెక్స్​లో  మిస్ వరల్డ్ ఫైనల్ పోటీలు జరుగుతాయి. జూన్ 2 వ  తేదీన విజేతలు రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రిని కలుస్తారు.  

ప్రపంచపటంలో విరాజిల్లనున్న తెలంగాణ పర్యాటకం

తెలంగాణ రాష్ట్రాన్ని  ప్రపంచ పర్యాటక రంగంలో అగ్రగామిగా  నిలుపనున్నామని రాష్ట్ర  ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే  తెలంగాణ టూరిజం పాలసీని విడుదల చేసింది.  దీనిలో  భాగంగా 72వ  మిస్ వరల్డ్ పోటీలకు మే 7 నుంచి31 వ తేదీ వరకు ఆతిథ్యం ఇచ్చే అసాధారణ అవకాశాన్ని తెలంగాణ రాష్ట్రం పొందింది.

  డాక్టర్లు, ఇంజినీర్లు, క్రీడాకారులు, సామాజిక కార్యకర్తలు, లాయర్లు, ఇండస్ట్రియలిస్టులు, సృజనాత్మక కళాకారులు ఇలా భిన్న రంగాలకు చెందిన దాదాపు 140  దేశాలకు చెందిన ప్రతిభావంతులు అందాల పోటీలకు పార్టిసిపెంట్స్​గా రానున్నారు.  ఈ మిస్ వరల్డ్ పోటీలతో టూరిజం అభివృద్ధితోపాటు తెలంగాణ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందనుంది.   

టూరిస్టుల  భద్రతలో  తెలంగాణ అగ్రగామిగా, పెట్టుబడులకు గమ్యస్థానంగా, అంతర్జాతీయ విమానాశ్రయంతో సహా ఇతర మౌలిక సదుపాయాలు కలిగిన రాష్ట్రంగా,  అద్భుతమైన  సంస్కృతీ సంప్రదాయాలు,  ప్రాచీన కట్టడాలతో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి ఈ మిస్ వరల్డ్ పోటీలు దోహదపడనున్నాయి. 

మిస్ వరల్డ్ పోటీల కార్యక్రమంలో  తెలంగాణ సాంస్కృతిక, పర్యాటక అంశాలు, స్థానిక హస్తకళలు,  సంగీత, సంప్రదాయ నృత్యాల ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు.  ప్రపంచంలోని దాదాపు 240 దేశాలలో ఈ మిస్ వరల్డ్​ పోటీలు నేరుగా ప్రసారం కానున్నాయి. 

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌- కన్నెకంటి వెంకట రమణ, జాయింట్​ డైరెక్టర్​,ఐ అండ్ ​పీఆర్–​