- సొంత నావిగేషన్‌కు 3జీపీపీ ఓకే
మనం సొంతంగా తయారు చేసుకున్న నావిగేషన్ సిస్టం నావిక్‌ను దేశీయంగా, అంతర్జాతీయంగా మొబైల్ ఫోన్లలో వాడుకునేందుకు మార్గం సుగమమైంది. అతి త్వరలోనే యూజర్లు తమ తమ ఫోన్లలో నావిక్‌తో దూసుకుపోయే అవకాశం వచ్చింది. ఇస్రో తయారు చేసిన నావిక్‌కు ప్రపంచవ్యాప్తంగా మొబైల్ టెలిఫొనీకి ప్రొటోకాల్స్‌ను అభివృద్ధి చేసే ప్రపంచ ప్రమాణాల సంస్థ 3జీపీపీ ఆమోదం తెలిపింది. నావిక్ (నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టెల్లేషన్)లోని స్పెసిఫికేషన్లకు ఓకే చెప్పింది. దీంతో దానిని వాణిజ్యపరంగా వాడుకునేందుకు అవకాశం లభించింది. సెప్టెంబర్ 16 నుంచి 20 వరకు అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన థర్డ్ జనరేషన్ పార్ట్నర్షిప్ ప్రాజెక్ట్ (3జీపీపీ) సమావేశంలో దానిని ఆమోదించారు. రిల్16 ఎల్టీఈ, రిల్ 17–5జీ ఎన్ఆర్ స్పెసిఫికేషన్లకు ఓకే చెప్పారు. దీంతో అమెరికన్ జీపీఎస్‌కు బదులు నావిక్‌ను వివిధ ఫోన్లలో ఏర్పాటు చేసేలా టెలికమ్యూనికేషన్స్ స్టాండర్డ్స్ డెవలప్మెంట్ సొసైటీ, ఇండియా (టీఎస్డీఎస్ఐ) కసరత్తులు చేస్తోంది. నావిక్ కోసం ఐఆర్ఎన్ఎస్ఎస్ సిరీస్‌లో ఏడు ఉపగ్రహాలను ఇస్రో పంపించిన సంగతి తెలిసిందే. నావిక్‌కు 3జీపీపీ ఆమోదం తెలపడం ఆనందంగా ఉందని ఇస్రో చైర్మన్ కె.శివన్ అన్నారు. కమ్యూనికేషన్ కోసం 8 ఉపగ్రహాలు కక్ష్యలో ఉన్నాయని, అందులో ఏడు నావిక్ కోసం, ఒకటి మెసేజింగ్ కోసం పనిచేస్తున్నాయని వివరించారు. సామాన్యులకు సేవలందించేలా త్వరలోనే నావిక్ యాప్‌ను తీసుకొస్తామని ఆయన చెప్పారు. సముద్రం, భూమి, ఆకాశమార్గాల్లో నావిగేషన్‌కు, విపత్తు నిర్వహణ, వాహనాలను ట్రాకింగ్, మ్యాపింగ్ కోసం నావిక్ ఉపయోగపడుతుంది. కార్లు, ఇతర వాహనాల్లో విజువల్, వాయిస్ నావిగేషన్నూ పొందొచ్చు. మిలటరీ సేవలకూ ఉపయోగపడుతుంది. ఎరిబ్, ఏటిస్, సీసీఎస్ఏ, ఈటీఎస్ఐ, టీఎస్డీఎస్ఐ, టీటీఏ, టీటీసీ వంటి సంస్థలు 3జీపీపీలో సభ్యులుగా ఉన్నాయి.