- మొత్తం 15 మందికి చోటు
- మొదటి స్థానంలో బెర్నార్డ్, సెకండ్ ప్లేస్‌లో బెజోస్
న్యూఢిల్లీ : బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ తయారు చేసిన వరల్డ్ సూపర్-రిచ్ క్లబ్‌లో మొత్తం 15 మంది సంపన్నులకు చోటు దక్కింది. వీరందరికీ 100 బిలియన్ల డాలర్ల కంటే ఎక్కువ సంపద ఉంది. మరో విశేషం ఏమిటంటే భారత కుబేరులు, ముకేశ్ అంబానీ (12), గౌతమ్ అదానీ (14) కూడా ఈ లిస్టులో ఉన్నారు. ఈ వ్యక్తుల సంయుక్త నికర విలువ ఈ సంవత్సరం 13శాతం పెరిగి 2.2 ట్రిలియన్ల డాలర్లకు చేరుకుంది. ద్రవ్యోల్బణం, స్టాక్ మార్కెట్‌కు మించి వీరి సంపద పెరిగింది. ప్రపంచంలోని 500 మంది సంపదలో దాదాపు నాలుగింట ఒక వంతు సంపద వీరి వద్దే ఉంది. ఈ15 మంది నెట్‌వర్త్ ఇంతకు ముందే 100 బిలియన్ డాలర్లు దాటినప్పటికీ, వారందరూ ఒకే పరిమాణంలో సమానంగా సంపదను కలిగి ఉండటం ఇదే మొదటిసారి. లో ఓరియల్ వారసురాలు ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్, డెల్ టెక్నాలజీస్ ఇంక్ వ్యవస్థాపకుడు మైఖేల్ డెల్, మెక్సికన్ బిలియనీర్ కార్లోస్ స్లిమ్ గత ఐదు నెలల్లో 100 బిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌కు చేరుకున్నారు. కొందరు ఆ స్థాయిని చాలాసార్లు దాటారు. లగ్జరీ కాస్మెటిక్స్ కంపెనీ ‘లో ఓరియల్’ షేర్లు 1998 తరువాత ఈ ఏడాదిలో భారీగా పెరిగాయి. గత డిసెంబర్‌లో 12 -సంఖ్యల సంపదను సాధించిన మొదటి మహిళగా బెటెన్‌కోర్ట్ మేయర్స్ నిలిచారు. ఈమె101 బిలియన్ల డాలర్ల నికర విలువతో ఇండెక్స్‌లో చేరారు.
డెల్బాస్ కూడా...
ఏఐ- సంబంధిత పరికరాల కోసం డిమాండ్ విపరీతంగా పెరగడంతో, డెల్ టెక్నాలజీస్ షేరు ధర రికార్డు స్థాయికి చేరడంతో మైఖేల్ డెల్ సంపద 100 బిలియన్ డాలర్ల మార్కును కూడా దాటింది. ఆయన ఇప్పుడు 113 బిలియన్ల డాలర్ల సంపదతో బ్లూమ్‌బర్గ్ సంపద సూచికలో 11వ స్థానంలో ఉన్నారు. కొత్తగా చేరినవారిలో 84 ఏళ్ల స్లిమ్ ఉన్నారు. ఈయన 106 బిలియన్ల డాలర్ల సంపదతో 13వ స్థానంలో ఉన్నారు. లాటిన్ అమెరికాలో అత్యంత ధనవంతుడిగానూ నిలిచారు. మెక్సికన్ పెసో బూమ్ వల్ల 2023లో తన నికర విలువ మరో 28 బిలియన్ల డాలర్లు పెరిగింది. కంపెనీల స్టాక్స్ బాగా పెరిగాయి. మనదేశానికి చెందిన 61 ఏళ్ల గౌతమ్ అదానీ, 2023లో షార్ట్ సెల్లర్ దాడి కారణంగా అందరికంటే ఎక్కువ సంపదను కోల్పోయారు. ఇటీవల ఆయన తిరిగి సంపన్నుల గ్రూప్‌కి తిరిగి వచ్చారు. ఆయన ఫ్లాగ్‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ షేర్లు భారీగా పెరిగాయి. ఎల్వీఎంహెచ్ ఫౌండర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ 222 బిలియన్ల డాలర్ల నికర విలువతో ఈ లిస్ట్‌లో మొదటిస్థానంలో ఉన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద లగ్జరీ వస్తువు ల కంపెనీ నుంచి ఆయనకు భారీగా సంపద వచ్చింది. అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ 208 బిలియన్ల డాలర్ల నికర విలువతో రెండవ స్థానంలో నిలిచారు. టెస్లా బాస్ ఎలాన్ మస్క్ 187 బిలియన్ల డాలర్ల నికర విలువతో మూడోస్థానంలో నిలిచారు. అయితే ఈ సంవత్సరం ఆయన 40 బిలియన్ల డాలర్లకు పైగా నష్టపోయారు. టెస్లా స్టాక్స్ విపరీతంగా నష్టపోయాయి.