పోటీ పరీక్షల ప్రత్యేకం.. గ్లోబల్​ వార్మింగ్

పోటీ పరీక్షల ప్రత్యేకం.. గ్లోబల్​ వార్మింగ్

ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలో గ్లోబల్ వార్మింగ్ ఒకటి. ఇందుకు సహజ కారణాలతోపాటు మానవ నిర్మిత కారణాలు ఉన్నాయి. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో పెరుగుతున్నాయి. ఆవరణ వ్యవస్థకు ముప్పు వాటిల్లుతున్నది. వాతావరణ మార్పుల వల్ల రోగాలు వ్యాప్తి చెంది, అధిక మరణ రేటుకు కారణమవుతున్నది. భూమి ఉపరితలంపై ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగడాన్ని గ్లోబల్ వార్మింగ్ అంటారు. గడిచిన రెండు దశాబ్దాల నుంచి ఈ సమస్య వెలుగులోకి వచ్చింది. 

ప్రధాన గ్రీన్ హౌస్ వాయువులు: నీటి ఆవిరి, కార్బన్ డై ఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, ఓజోన్.

సహజ కారణాలు

అగ్ని పర్వతాలు: సహజ కారణాల్లో గ్లోబల్ వార్మింగ్​కు కారణమయ్యే అతిపెద్ద అంశం అగ్నిపర్వతాలు. అగ్నిపర్వతాలు విస్ఫోటనం జరిగినప్పుడు బూడిద, పొగ, ఇతర రసాయనాలు వెలువడుతాయి. ఇది వాతావరణ మార్పులకు ప్రధాన కారణమవుతాయి.

నీటి ఆవిరి: నీటి ఆవిరి అనేది ఒక రకమైన గ్రీన్ హౌస్ వాయువు. భూమి ఉపరితలం ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల నీటి వనరుల నుంచి నీరు అధికంగా ఆవిరి అవుతుంది. ఆ నీటి ఆవిరి వాతావరణంలో నిలిచి ఉండటం వల్ల గ్లోబల్ వార్మింగ్​కు కారణమవుతాయి.

మంచు కరిగిపోవడం: ఎన్నో సంవత్సరాల నుంచి గడ్డకట్టి ఉన్న మంచులో అనేక వాయువులు అంటాయి. ఈ మంచు ప్రధానంగా హిమనీ నదాల్లో ఉంటాయి. ఇది కరిగిపోవడం వల్ల ఇందులోని వాయువులు వాతావరణంలోకి విడుదలవుతాయి. దీనివల్ల భూమి ఉపరితలం ఉష్ణోగ్రత పెరుగుతుంది. 

అటవీ కార్చిచ్చులు: అడవుల దహనం వల్ల పెద్ద మొత్తంలో కార్బన్ డై ఆక్సైడ్ వాతావరణంలోకి విడుదలవడం వల్ల ఉష్ణోగ్రతలు పెరిగి, అది గ్లోబల్ వార్మింగ్​కు కారణమవుతాయి. 

మానవ నిర్మిత కారణాలు

అటవీ నిర్మూలన: మొక్కలు అనేవి ఆక్సిజన్​ను అందించే ప్రధాన వనరులుగా ఉన్నాయి. మొక్కలు కార్బన్ డై ఆక్సైడ్​ను గ్రహించి, ఆక్సిజన్​ను విడుదల చేయడం ద్వారా వాతావరణ సమతుల్యతను నిర్వహిస్తాయి. గృహ, పారిశ్రామిక అవసరాల కోసం అడవుల్లోని మొక్కలను నరికివేస్తున్నారు. దీనివల్ల పర్యావరణ అసమతుల్యత పెరిగి, ఇది గ్లోబల్ వార్మింగ్​కు దారి తీస్తున్నది. 

వాహనాల వినియోగం: వాహనాల కోసం శిలాజ ఇంధనాలను మండించడం వల్ల వాటి నుంచి కార్బన్ డై ఆక్సైడ్, ఇతర విషపూరితాలు వాతావరణంలోకి వెలువడటం వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. 

క్లోరోఫ్లోరో కార్బన్లు: ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజరేటర్లను మనుషులు అధికంగా ఉపయోగించడం వల్ల క్లోరోఫ్లోరో కార్బన్లు వాతావరణంలోకి చేరుతున్నాయి. ఈ క్లోరోఫ్లోరో కార్బన్లు వాతావరణంలోని ఓజోన్ పొర పైన దుష్ప్రభావాన్ని కలిగిస్తున్నాయి. సూర్యుడి నుంచి వెలువడే హానికరమైన అతి నీలలోహిత కిరణాల నుంచి భూ ఉపరితలాన్ని ఓజోన్ పొర రక్షిస్తుంది. క్లోరోఫ్లోరో కార్బన్లు ఓజోన్ పొర క్షీణత కారణమవడం వల్ల ఓజోన్ పొరకు రంధ్రం ఏర్పడి ఈ అతినీల లోహిత కిరణాలు భూమిపైకి చేరి మానవులపై దుష్ర్పభావాలను చూపుతున్నాయి. అంతేకాకుండా భూ ఉపరితలంపై ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. 

పారిశ్రామిక అభివృద్ధి: పారిశ్రామికీకరణ వల్ల భూమి ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. 2013లో వాతావరణ మార్పులపై  నియమించిన అంతర ప్రభుత్వ ప్యానెల్ నివేదిక ప్రకారం 1880 నుంచి 2012 మధ్య ప్రపంచ ఉష్ణోగ్రతలు 0.9 డిగ్రీల సెల్సియస్ పెరిగాయి.

వ్యవసాయం: వివిధ రకాల వ్యవసాయ కార్యకలాపాల వల్ల కార్బన్ డై ఆక్సైడ్, మీథేన్ ఉద్గారాలు విడుదల అవుతున్నాయి.

జనాభా విస్ఫోటనం: జనాభా అధికంగా పెరగడం వల్ల కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలు వెలువడుతున్నాయి. 

ప్రభావాలు

ఉష్ణోగ్రతలు పెరగడం: గ్లోబల్ వార్మింగ్ వల్ల భూమి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతాయి. దీనివల్ల హిమనీనదాలు కరిగిపోతాయి. తద్వారా సముద్ర మట్టం పెరుగుదలకు కారణమవుతాయి. దీనివల్ల తీర ప్రాంతాల్లో తీవ్రమైన దుష్పరిణామాలు సంభవిస్తాయి.

ఆవరణ వ్యవస్థకు ముప్పు: గ్లోబల్ వార్మింగ్ అనేది ప్రవాళ భిత్తికలపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల వృక్ష, జంతు జాతులకు నష్టం జరుగుతుంది. 

వాతావరణ మార్పులు: గ్లోబల్ వార్మింగ్ వల్ల వాతావరణ మార్పులు సంభవిస్తాయి. కొన్ని ప్రాంతాల్లో కరువులు ఏర్పడటం, కొన్ని ప్రాంతాల్లో వరదలు సంభవించడం వంటి సంఘటనలు జరుగుతాయి.

రోగాల వ్యాప్తి: వేడి, ఆర్ధ్రత విధానాల్లో మార్పులు సంభవిస్తాయి. ఇది దోమల పెరుగుదలకు కారణమై తద్వారా రోగాల వ్యాప్తికి కారణమవుతాయి. 

మరణాల రేటు అధికమవడం: వరదలు, సునామీలు, సహజ వాతావరణ పరిస్థితులు మారడం వల్ల సగటు మరణాల రేటు పెరుగుతుంది.

సహజ ఆవాసాలను కోల్పోవడం: వాతావరణ మార్పుల వల్ల వివిధ జంతువులు, వృక్షాలు ఆవాసాలు నష్టపోతున్నాయి. పలు వృక్ష, జీవజాతులు అంతరించిపోయే ప్రమాదం ఉంది. జీవ వైవిధ్యంపై గ్లోబల్ వార్మింగ్ తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. 

పంచామృత్ 

భారతదేశం వాతావరణ మార్పుల కార్యాచరణలో భాగంగా పంచామృత్​ను ముందుకు తీసుకువచ్చింది. 

  • 2030 నాటికి 50 గిగావాట్ల శిలాజేతర ఇంధన సామర్థ్యానికి చేరుకోవడం.
  • 2030 నాటికి భారతదేశం తన ఇంధన అవసరాల్లో 50 శాతం పునరుత్పాదక శక్తి వనరుల నుంచి పొందాలి.
  • 2030 నాటికి అంచనా వేసిన మొత్తం కర్బన్ ఉద్గారాలను బిలియన్ టన్నులకు తగ్గించాలి.
  • 2030 నాటికి ఆర్థిక వ్యవస్థ కర్బన సాంద్రతను 45 శాతం తగ్గించాలి.
  • నికర కర్బన్ ఉద్గారాల లక్ష్యం 2070ను సాధించడం.