గ్లోబల్‌ వార్మింగ్‌తో సముద్రాలు వేడెక్కుతున్నయ్​

మరో 80 ఏండ్లలో సముద్ర జలాల్లో పెను మార్పులు సంభవించనున్నాయి. గ్లోబల్‌‌ వార్మింగ్‌‌ తగ్గకుంటే 2050 నాటికి సముద్ర జాతులకు ముప్పు తప్పదంటున్నారు సైంటిస్టులు. సముద్ర జలాలు వేడెక్కిపోయి.. నీటి మట్టాలు పెరిగి సముద్ర జీవరాశుల ఉనికికే ముప్పు వాటిల్లుతుందని, ఈ శతాబ్దం చివరికే ఈ పరిణామాలు చోటు చేసుకుంటాయని చెబుతున్నారు. ఈ మేరకు నార్త్​ వెస్ట్రన్​ యూనివర్సిటీ సైంటిస్టుల సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. సముద్రాల్లో పెరుగుతున్న పొల్యూషన్, ఎసిడిఫికేషన్ వల్ల నీటిలో పీహెచ్‌‌ లెవల్స్​ పడిపోతాయని, కార్బన్‌‌ ఉద్గారాల వల్ల సముద్రంలో నీరు మరిగీ మరిగీ యాసిడ్‌‌ తత్వాన్ని పొందుతుందని వీరు తమ రిపోర్ట్​లో వెల్లడించారు. దీన్ని అరికట్టకపోతే ఈ శతాబ్దం చివరి నాటికి సముద్రాల్లో ఎసిడిటీ మరింత పెరిగే ప్రమాదముందన్నారు. సముద్ర జలాల్లో వేడి పెరగడం రెండు రకాల పరిణామాలకు దారి తీయవచ్చని అంచనా వేశారు. మొదటి సినారియో ప్రకారం.. 2050 నాటికి గ్రీన్​హౌస్​ గ్యాస్​ ఎమిషన్​ పీక్​ స్టేజ్​కు చేరుతుందని, ఆ తర్వాత మిగతా 50 ఏండ్ల పాటు క్రమంగా తగ్గుతూ వస్తుందని పేర్కొన్నారు. రెండో సినారియో ప్రకారం.. తదుపరి 80 ఏండ్ల పాటు గ్రీన్​హౌస్​ గ్యాస్​ ఎమిషన్స్ పెరుగుదల ఎక్కువ స్థాయిలోనే కొనసాగుతుందని అంచనా వేశారు. అంతేకాదు పెరిగే యాసిడ్‌‌ తత్వం కారణంగా భూమ్మీద కూడా క్లయిమేట్‌‌లో కొత్త సమస్యలు ప్రారంభమవుతాయన్నారు. గడచిన 4,20,000 నుంచి 300 మిలియన్‌‌ సంవత్సరాల కంటే గత వందేండ్లలో సీవో2 లెవల్స్​భారీగా పెరిగాయని, దీని వల్ల ఇప్పటికే చాలా జాతులు అంతరించిపోయి ఉండవచ్చని వివరించారు.

ఈ మార్పులు ఇలాగే కొనసాగితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు భవిష్యత్​లో ఉండకపోవచ్చని హెచ్చరించారు. సముద్ర జలాల్లో ఉండే ఎన్నో జీవులు నీటి వేడికి చనిపోయి వాటి బోన్స్‌‌, షెల్స్‌‌ లో ఉండే కాల్షియం వల్ల ఈ పరిస్థితి వస్తుందని చెప్పారు. సముద్రాల ఉష్ణోగ్రతకు తోడు భూమి ఉపరితల నీటి ఉష్ణోగ్రత కూడా జతచేరి ఆమ్లత్వం పెరిగిపోయి కాల్షియం కార్బొనేట్‌‌ అధిక పీడనం వల్ల పాలిమార్ఫ్‌‌ జరుగుతున్నందు వల్ల ఈ ప్రమాదం సంభవించే అవకాశముందని అంటున్నారు. నదుల్లో నివసించే అనేక జాతుల లివింగ్‌‌ స్టైల్‌‌లో మార్పులు వచ్చాయని, అవి వివిధ మార్గాల ద్వారా సముద్రాలకు చేరుతున్నాయని, ఇప్పుడు సముద్ర జలాల్లో కూడా టెంపరేచర్లు పెరిగిపోతే వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని అరికట్టాలంటే గ్రీన్​ హౌస్​ గ్యాస్ ఎమిషన్స్​ను తగ్గించడం తప్ప వేరే మార్గం లేదని సైంటిస్టులు సూచిస్తున్నారు.