ఈ ఇల్లు కాకపోతే ఇంకో ఇల్లు, ఈ ఊరు కాకపోతే మరో ఊరు, ఈ దేశం కాకపోతే ఇంకో దేశం అనుకుంటం. కానీ ఈ భూమి కాకపోతే ఇంకో భూమి అనుకోవడానికి తావేలేదు. భూమిని కాపాడుకోవడమే ఇప్పుడు మన ముందు ఉన్న ఏకైక మార్గం. భూగ్రహం మీద జీవరాశి ఉండడానికి ముఖ్య కారణాలు, సూర్యుడి నుంచి సరైన దూరంలో ఉండటం, ప్రమాదకర రేడియేషన్ నుంచి కాపాడే రక్షణ కవచం లాంటి అయస్కాంత క్షేత్రం ఉండటం, ఓజోన్ పొర, జీవించడానికి అవసరమైన వాతావరణ స్థితి, నీరు ద్రవరూపంలో లభించడం, భూమి గురుత్వాకర్షణ శక్తి కలిగి ఉండటం. చిన్న చిన్న ఉపద్రవాలు, సహజసిద్ధమైన మార్పులు, సంభవించినప్పటికీ, ఎనిమిది లక్షల సంవత్సరాల నుంచి భూమి స్థిరంగా కొనసాగుతున్నది. అడవులను నాశనం చేయడం, విపరీతంగా రసాయన ఎరువులు వాడటం, సహజ వనరులను విచక్షణా రహితంగా వాడటం వల్ల భూవాతావరణంలో నాణ్యత లోపించడం ప్రారంభమై ఇయ్యాల మనం చూస్తున్న అస్థిరత స్థితి కొనసాగుతున్నది.
పొంచి ఉన్న ప్రమాదం..
వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ‘గ్లోబల్ వార్మింగ్’ సంభవిస్తున్నది. దీని మూలంగా వాతావరణ సమతుల్యత, పర్యావరణ వ్యవస్థలో మార్పులొస్తున్నాయి. ఈ గ్లోబల్ వార్మింగ్ కు ముఖ్య కారణాలు అడవుల నాశనం, శిలాజ ఇంధనాల వినియోగం, వ్యర్థాలను పారవేయడం, అధిక వ్యవసాయం, సహజ వనరుల అధిక వాడకం. ఇప్పటికే ఈ గ్లోబల్ వార్మింగ్ దుష్ఫలితాలను అనుభవిస్తున్నాం. పర్యావరణ సమతుల్యత లోపించి మొక్కల పెరుగుదల వ్యవస్థల్లో మార్పులు వచ్చాయి. చాలా జంతుజాల రకాలు కనుమరుగైపోయాయి. మంచు గడ్డలు కరిగి సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. దీని వల్ల ఒక శతాబ్ద కాలంలో సముద్ర మట్టాలు18 సెంటీమీటర్లు పెరిగాయి. 2100 నాటికి సముద్ర మట్టాలు1 మీటర్ వరకు పెరిగే ప్రమాదం ఉంది. కొన్ని దశాబ్దాల తర్వాత వేల సంఖ్యలో సరస్సులు, శీతాకాలంలో మంచుపొరలు లేకుండా పోతాయి. సముద్ర ఉపరితలాలపై వీచే వేడి గాలుల వల్ల ప్రమాదకర రీతిలో తుఫానులు, హరికేన్లు సంభవిస్తాయి. తరచూ కరువులు వచ్చి, ఎడారులు విస్తరిస్తాయి. అధికశాతం కార్బన్ డయాక్సైడ్ సముద్రాల్లోకి చేరి సముద్ర జలాల్లో కరిగిపోయి ఆమ్లీకరణ శాతం పెరుగుతుంది. దీని వల్ల సముద్రప్రాణులు నశించి సముద్రాల్లో వాతావరణ సమతుల్యత లోపిస్తుంది. వాతావరణ స్థితి సూచికలో మార్పుల వల్ల వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ 2021 నాటికి 6 శాతం పెరిగి ఇప్పుడు 36.30 బిలియన్ టన్నులుగా ఉంది. ఏడాదికి 11,680.42 టన్నుల కార్బన్ డయాక్సైడ్ విడుదల చేస్తూ చైనా(ప్రపంచ వాటాలో 32 శాతం) ముందు వరుసలో ఉన్నది. అమెరికా ఏడాదికి 4,535.3 టన్నులతో (ప్రపంచ వాటాలో 12.6 శాతం) రెండో స్థానంలో ఉండగా, ఇండియా 2,411.73 టన్నులతో(ప్రపంచ వాటాలో 7 శాతం) మూడో ప్లేస్లో ఉంది. కార్బన్ డయాక్సైడ్‌ను అతి తక్కువగా విడుదల చేసే దేశాల్లో పోలాండ్ 282.40 టన్నులతో మొదటి స్థానంలో, ఫ్రాన్సు 290.49 టన్నులతో రెండో స్థానంలో, టర్కీ 317.22 టన్నులతో మూడో స్థానంలో ఉన్నాయి. తలసరిగా చూస్తే1.79 టన్నుల కార్బన్డయాక్సైడ్ విడుదలతో భారత్110వ స్థానంలో ఉంది.
కార్బన్ డయాక్సైడ్ 280 పీపీఎం దాటితే..
వాతావరణంలో నాణ్యత లోపం శృతిమించి పోయి భూమి మీద జీవరాశి మనుగడ ప్రశ్నార్థకం కాకుండా ఉండడానికి 2009లో స్టాక్ హోమ్ విశ్వవిద్యాలయంలో పని చేస్తున్న జాన్ రాక్ స్రామ్ అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన మరో 28 మంది సైంటిస్టులతో కలిసి భూగ్రహం ప్రమాదకర స్థితిలోకి పోకుండా నియంత్రించడానికి 9 గ్రహ సూచికలు రూపొందించారు. అవి వాతావరణ మార్పు, సముద్ర ఆమ్లీకరణ, ఓజోన్ పొర క్షీణత, ప్రపంచ మంచినీటి లభ్యత, భూ వినియోగంలో బయోస్పియర్ సమగ్రత కోత, రసాయన కాలుష్యం, వాతావరణంలో ఏరోసోల్ సాంద్రత, జీవ రసాయన ఎరువుల వినియోగంలో మార్పు. వీటిలో ఎక్కువ క్షీణదశలో ఉన్న సూచిక వాతావరణ మార్పు. ఈ సూచికకు సైంటిస్టులు నిర్దేశించిన ప్రామాణికం కార్బన్ డయాక్సైడ్ 280 పీపీఎం. అయితే ప్రస్తుతం కార్బన్ డయాక్సైడ్ 417 పీపీఎంగా నమోదైంది. ఈ పెరుగుదల వల్ల వాతావరణంలోఉష్ణోగ్రతలు పెరుగుతాయి.1800లో వాతావరణ ఉష్ణోగ్రతతో పోల్చినప్పుడు ఇప్పటి భూఉష్ణోగ్రత 1.1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెరిగింది. 2011–20 దశాబ్దం అత్యంత వేడిగా ఉన్న దశాబ్దంగా నమోదైంది. కార్బన్ డై ఆక్సైడ్ విడుదల ఇలాగే కొనసాగితే 2100 నాటికి ఉష్ణోగ్రతలు1.5 డిగ్రీల నుంచి 5.3 డిగ్రీ సెంటిగ్రేడ్ పెరిగే ప్రమాదం ఉంది. కేవలం ఉష్ణోగ్రత పెరగడమే కాదు దాని వల్ల ఇతర గ్రహ సూచికల్లో కూడా మార్పులు సంభవిస్తాయి.
దిద్దుబాటు చర్యలు అత్యవసరం..
వాతావరణ మార్పులను నియంత్రించడానికి దిద్దుబాటు చర్యలు అత్యవసరంగా చేపట్టాలి. సాధ్యమైనంత తొందరగా శిలాజ ఇంధన వనరులైన పెట్రోల్, డీజిల్, గ్యాస్, బొగ్గు వాడకం తగ్గించి సౌర, పవన, సముద్ర అలల విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించాలి. పెట్రోలియం ఆధారిత వాహనాల వాడకం తగ్గించి, విద్యుత్ వాహనాల వాడకం పెంచాలి. ఇండ్ల గోడలు, పైకప్పులు సహజసిద్ధమైన నిర్మాణాలు చేపట్టి ఏసీలు, ఫ్రిజ్ ల వాడకం తగ్గించాలి. విరివిగా చెట్లను పెంచి తద్వారా కార్బన్ డై ఆక్సైడ్ శాతాన్ని తగ్గించి ఆక్సిజన్ శాతం పెంచాలి. పట్టణాలు, నగరాల్లో వర్టికల్ గార్డెన్స్ ప్రోత్సహించి వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్, ఉష్ణోగ్రతను తగ్గించాలి. సేంద్రియ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించి భూమి పొరల్లో కార్బన్ డయాక్సైడ్ తగ్గించి సముద్ర జలాలు ఆమ్లీకరణ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి, దాన్ని కాల్చినప్పుడు జరిగే వాతావరణ కాలుష్యం నివారించాలి. ఏది ఏమైనా భూమి ఒక్కటే ప్రాణికోటి ఉన్న గ్రహం అని మనం మరిచిపోవద్దు. ప్రతి దేశం, ప్రతి ప్రభుత్వం, ప్రతి పౌరుడు ఈ భూమి మన అందరిది. దీన్ని అందరూ కలిసికట్టుగా కాపాడు కోవాలనే గట్టి సంకల్పంతో ముందుకు వెళ్లాలి. ప్రభుత్వాలు కూడా ప్రస్తుతం ఉన్న చట్టాలను సవరించి, అవసరమైతే కొత్త చట్టాలను చేసి వాటి అమలు పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించాలి. పర్యావరణ శాస్త్రవేత్తలు, సామాజిక వేత్తలు, ప్రభుత్వేతర సంస్థలు భూ గ్రహానికి భవిష్యత్తులో సంభవించే విపత్తులు గురించి ప్రజల్లో అవగాహన కల్పించి జరగబోయే ప్రమాదాన్ని నిలువరించాలి.
–మల్లెల శివ ప్రసాద్, జాయింట్ కమిషనర్, ఎంజీఎన్ఆర్ఈజీఎస్, ఏపీ