- అమెరికాలో ఒకవైపు ఎండలు.. మరోవైపు కుండపోత
- అరబ్ కంట్రీస్‌లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు
- హజ్ యాత్రలో 550 మందికి పైగా మృతి
- ఢిల్లీలో హీట్ వేవ్స్.. రెండ్రోజుల్లో 20 మంది బలి
- ప్రపంచ వ్యాప్తంగా విపత్కర పరిస్థితులు
- గ్లోబల్ వార్మింగ్ కారణమంటున్న శాస్త్రవేత్తలు
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తున్నది. కెనడాలో ఏడాది నుంచి కార్చిచ్చు వేలాది ఎకరాలను బూడిద చేస్తుంటే.. దుబాయ్‌లో వరదలు ముంచెత్తుతున్నాయి. ఢిల్లీలో హీట్ వేవ్స్ కారణంగా జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక అమెరికాలోని కోస్టల్ రీజియన్‌లో రికార్డు స్థాయి టెంపరేచర్లు నమోదవుతున్నాయి. ఉక్కపోత కారణంగా అక్కడి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జూన్‌లో 1,400 మంది వడదెబ్బతో చనిపోయారు. ఫ్లోరిడాలో మాత్రం అల్పపీడన ద్రోణి కారణంగా రెండు వారాలుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తు తున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది. ఐదొందల నుంచి వెయ్యేండ్లకు ఒకసారి ఈ స్థాయిలో వరదలు సంభవిస్తుంటాయని అక్కడి అధికారులు చెప్తున్నారు. సుమారు రూ.8,340 కోట్ల మేర నష్టం సంభవించిందని తెలిపారు. దక్షిణ ఫ్లోరిడా తీవ్రంగా ప్రభావితం అయింది. మరో వారం రోజుల పాటు ఇలాగే ఉంటుందని, అత్యవసరం అయితే తప్ప ఎవరూ బయటికి రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు.
క్లైమేట్ చేంజ్ కారణంగా యూఎస్‌లో 16 వేల కంటే ఎక్కువ డ్యామ్‌లు, 50కు పైగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు ప్రమాదంలో ఉన్నట్టు యూఎస్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ తెలిపింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి అన్ని దేశాలు క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్ ఎదుర్కొంటున్నాయి.
ఈజిప్ట్‌లో 51 డిగ్రీల టెంపరేచర్
గ్లోబల్ వార్మింగ్ కారణంగానే ప్రపంచ దేశాలన్నీ విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని వాతావరణ శాస్ర్తవేత్తలు చెప్తున్నారు. పారిశ్రామిక విప్లవం కంటే ముందే గ్రీన్హౌస్ గ్యాస్ పొల్యూషన్ పెరిగిందని అంటున్నారు. నిరుడుతో పోలిస్తే 1.3 డిగ్రీల టెంపరేచర్ పెరిగినట్లు హెచ్చరిస్తున్నారు. ప్రతి ఏడాది సముద్రాల్లో నీటి మట్టం పెరుగుతూ వస్తున్నది. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగానే ఆకస్మిక వరదలు, కార్చిచ్చులు, వడగండ్లు, తుఫానులు, హీట్‌వేవ్స్, విపరీతమైన ఎండలు, మంచు తుఫాన్లు, పిడుగులు పడ్తున్నాయి. లండన్, పారిస్, బెర్లిన్ సహా యూరప్‌లోని పలు ప్రాంతాల్లో టెంపరేచర్లు క్రిస్మస్ టైమ్ కంటే రికార్డు స్థాయిలో పడిపోయాయి. కరువు, వరదలు, కార్చిచ్చుతో గ్రీస్, స్పెయిన్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈజిప్ట్‌లో 51 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. చైనాలో ఆకస్మిక వరదల కారణంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతిన్నది. తూర్పు ఆఫ్రికాలో ఏండ్ల తరబడి ఎదుర్కొన్న కరువు తర్వాత సంభవించిన వరదల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. పశువులు కొట్టుకుపోయాయి. గాజాలో ఎండలు మండిపోతున్నాయి. దక్షిణాసియాలోని చాలా దేశాల్లో ఎండలు దంచికొడ్తున్నాయి.
గ్రీస్, ఇటలీ, ఫ్రాన్స్‌లో దెబ్బతిన్న ఎయిర్ క్వాలిటీ
మార్చిలో సహారా ఎడారిలో డస్ట్ స్టార్మ్స్ సంభవించాయి. మధ్యధరా సముద్రంలోని సిసిలీ ద్వీపంలో ఆకాశం పసుపు, నారింజ రంగులోకి మారిపోయింది. గ్రీస్ నుంచి ఇటలీ మీదుగా ఫ్రాన్స్ వరకు ఎయిర్ క్వాలిటీ దెబ్బతిన్నది. ఈ పరిస్థితి ఆకస్మిక వరదలకు కారణమైంది. అదేవిధంగా.. సిరియా, ఇరాక్, ఇరాన్ దేశాలు మరింత కరువులోకి జారిపోయాయి. ఈ పరిస్థితులన్నింటికీ ప్రధాన కారణం గ్లోబల్ వార్మింగ్ఎఫెక్ట్ అని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఏప్రిల్‌లో ఫిలిప్పిన్స్ లో రికార్డు స్థాయిలో టెంపరేచర్లు నమోదవుతుండటంతో స్కూల్స్, పవర్ ప్లాంట్లను అక్కడి ప్రభుత్వం మూసివేసింది. ఇప్పుడు ఎల్‌నినో ఎఫెక్ట్ కారణంగా ఫుడ్ సప్లై చైన్ దెబ్బతింటుందేమో అని ఆందోళన చెందుతున్నది. సౌతీస్ట్ ఆసియాలో వరదల కారణంగా కెన్యా, టాంజానియా, ఉగాండా, బురుండిలో 500 మందికి పైగా చనిపోయారు.
హజ్ యాత్రలో 550 మందికి పైగా మృతి
హై టెంపరేచర్ కారణంగా ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 550 మందికి పైగా హజ్ యాత్రికులు చనిపోయినట్టు అరబ్ దౌత్య అధికారులు వెల్లడించారు. మృతుల్లో
భారతీయులు 68 మంది ఉన్నట్టు తెలిపారు. అలాగే జోర్డాన్ వాసులు 60 మంది కాగా, మిగిలిన వారు ఈజిప్ట్, తదితర దేశాలకు చెందినవారని చెప్పారు. వీరంతా ఎండ వేడిమి తట్టుకోలేక అనారోగ్యంతో మృతి చెందినట్లు వెల్లడించారు. మృతులకు సంబంధించిన వివరాలను మక్కా సమీపంలోని అల్-ముయిసెమ్ హాస్పిటల్ అందుబాటులో ఉంచామని తెలిపారు.
2049 నాటికి 38 ట్రిలియన్ డాలర్ల నష్టం
ఈ ఏడాది ప్రారంభం నుంచి ప్రపంచ వ్యాప్తంగా విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. విమానాల నుంచి పవర్ గ్రిడ్ల వరకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోని ప్రతిదీ ప్రభావితమైంది. 2049 నాటికి వాతావరణపరమైన మార్పుల వల్ల ప్రపంచ వ్యాప్తంగా 38 ట్రిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లుతుందని ఓ సర్వే సంస్థ ప్రకటించింది. పారిస్ ఒప్పందంలోని లక్ష్యాలకు అనుగుణంగా కర్బన ఉద్గారాలు తగ్గించడానికి అవసరమైన అంచనా వ్యయం.. 6 ట్రిలియన్ డాలర్లు దాటేసింది. 2023లో క్లీన్ టెక్నాలజీల ఖర్చు రికార్డు స్థాయిలో 1.8 ట్రిలియన్ డాలర్లను తాకింది.