వనపర్తి, వెలుగు: సీఎం కేసీఆర్కృషితో సాగునీటిలో కాకతీయుల నాటి వైభవం వచ్చిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. గురువారం వనపర్తి జిల్లా పడమటి తండా, చీమనగుంటపల్లి, కర్నే తండా, సల్కలాపురం, అప్పరెడ్డిపల్లి, వెంకటంపల్లి, చిలుకటోనిపల్లి, వెల్టూరు చెక్ డ్యాములు, బుద్ధారం పెద్ద చెరువు రిజర్వాయర్, వీరాంజనేయ లిఫ్ట్ ఇరిగేషన్, గణప సముద్రం పునరుద్ధరణ పనులను రాష్ట్ర ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. వనపర్తి జిల్లాలో 16 చెక్ డ్యాములను మంజూరు చేయగా మొదటి దశలో ఐదు, రెండో దశ లో 11 చెక్ డ్యాములను నిర్మించినట్లు చెప్పారు. దీంతో భూగర్భ జలమట్టం రికార్డు స్థాయిలో జిల్లాలో పెరిగిందన్నారు. వనపర్తి జిల్లాలోని 216 గ్రామాలలో ఖాసీం నగర్ గ్రామానికి తప్ప అన్ని గ్రామాలకు కృష్ణా జలాలను అందించామని నిరంజన్ రెడ్డి చెప్పారు. ఖిల్లాగణపురం మండలం కర్నె తండా లిఫ్ట్ ను వచ్చే వానాకాలానికి పూర్తిచేసి సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనర్ ఇరిగేషన్ అడ్వైజర్ విజయ్ ప్రకాశ్, చీఫ్ ఇంజనీర్లు హమిద్ ఖాన్, రఘునాథ్ రావు, ఈఈ మధుసూదన్ పాల్గొన్నారు.
డిసెంబర్ లోగా సిలబస్ పూర్తి చేయాలి
వనపర్తి టౌన్, వెలుగు: జిల్లాలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో డిసెంబర్ చివరి నాటికి సిలబస్ పూర్తి చేయాలని డీఐఈవో జాకీర్ హుస్సేన్ అన్నారు. గురువారం వనపర్తిలో జిల్లాలోని గవర్నమెంట్ కాలేజీల ప్రిన్సిపాల్స్, సబ్జెక్ట్ లెక్చరర్లతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా డీఐఈవో మాట్లాడుతూ ఇంటర్ బోర్డు ఆదేశాల మేరకు జూనియర్ కాలేజీల్లో ఇంటర్ స్టూడెంట్లకు ప్రత్యేకంగా ఎంసెట్ కోచింగ్ ఇవ్వాలన్నారు. దీనికోసం కాలేజీలో ఎంసెట్ రాసే స్టూడెంట్లను సెలక్ట్ చేసుకొని జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఎంసెట్ క్లాస్‌లు నిర్వహించాలన్నారు. పబ్లిక్ ఎగ్జామ్స్ పూర్తికాగానే ఇంటెన్సివ్ రెసిడెన్షియల్ సమ్మర్ ఎంసెట్ కోచింగ్ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఫ్రీ కోచింగ్ తో పాటు ఫ్రీ స్టడీ మెటీరియల్ కూడా పంపిణీ చేస్తామన్నారు.
వేతనాలు పెంచాలంటూ ఆశా వర్కర్ల ధర్నా
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: ఉద్యోగ భద్రత కల్పించి, కనీస వేతనం రూ.26వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు గురువారం మహబూబ్‌నగర్ కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కురుమూర్తి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు వైద్యసేవలందిస్తున్నా చాలిచాలనీ వేతనాలతో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దీప్లానాయక్, జిల్లా కార్యదర్శి చంద్రకాంత్, 300 మంది ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
గద్వాల, వెలుగు: ఆశా కార్యకర్తలకు జాబ్ గ్యారంటీ కల్పించి, సమస్యలు పరిష్కారించాలని డిమాండ్‌చేస్తూ జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ ముందు వంటావార్పు నిర్వహించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి నరసింహ మాట్లాడుతూ ప్రభుత్వం ఆశాలకు ఫిక్డ్స్డ్శాలరీ ఇవ్వాలని, పని భారం తగ్గించాలని డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో ఆశా వర్కర్ల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పద్మ, సునీత, లీడర్లు కాంతమ్మ, చెన్నమ్మ, సరస్వతి పాల్గొన్నారు.
భూ సర్వేను వెంటనే కంప్లీట్ చేయండి
గద్వాల, వెలుగు: నేషనల్ హైవే కోసం పెండింగ్‌లో ఉన్న భూ సర్వేను వెంటనే కంప్లీట్ చేయాలని జోగులాంబ గద్వాల కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆఫీసర్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లో తహసీల్దార్లు, సర్వేయర్లు, జిల్లా ఆఫీసర్లతో మీటింగ్ నిర్వహించారు. సర్వే పనులు ఎంతవరకు వచ్చాయి, రైతులకు పేమెంట్ ఎంత ఇవ్వాల్సి ఉంది అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కేటీ దొడ్డి, గట్టు, ఆరగిద్ద, యాపదిన్నె, వెంకటాపురం, నందిన్నె, తప్పెట్లమొరుసు, ఐజ, జడదొడ్డి, బింగిదొడ్డి, వడ్డేపల్లి, రాజోలిలో పెండింగ్ లో ఉన్న సర్వే పనులు అన్నింటిని కంప్లీట్ చేయాలన్నారు. రైతులకు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా వ్యవసాయ పొలాలకు వెళ్లే రోడ్లు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం ఓటర్నమోదుకు వచ్చిన అప్లికేషన్లపై ఫీల్డ్విజిట్చేయాలని తహసీల్దార్లను కలెక్టర్ఆదేశించారు. కార్యక్రమంలో ఈఈ కాజా జుబేర్ అహ్మద్, రహీముద్దీన్ పాల్గొన్నారు.
కాంగ్రెస్‌లో సీనియర్లు, జూనియర్ల తేడా లేదు
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: కాంగ్రెస్‌లో సీనియర్లు, జూనియర్లు అంటూ తేడాలు ఏమీ లేవని, అందరం కలసికట్టుగా పోరాటం చేసి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం నాగర్‌కర్నూల్‌లోని తన సొంతింట్లో మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. ఇప్పుడేమో ఎమ్మెల్సీ కవితపై ఈడీ దాడులు జరిగితే ఏదో జరిగిపోయిందని, తనను ఎవరూ పలకరించడం లేదని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. కాంగ్రెస్ హయాంలో చేసిన ప్రాజెక్టులను శిలాఫలకాలు వేసుకొని తాము చేసినట్లుగా ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. దేశం, రాష్ట్ర రాజకీయాలలో అధ్వాన పరిస్థితులు ఉన్నాయని, ఒకరిపైఒకరు ఆరోపణలు చేసుకుంటూ అభివృద్ధిని పక్కనపెట్టేశారన్నారు. ప్రజాస్వామ్యానికి విఘాతం కల్పించేలా టీఆర్ఎస్ వ్యవహరిస్తోందని ఆరోపించారు. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గితే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని చెప్పిన కేంద్రం.. అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పటికీ తగ్గించలేదన్నారు. కార్యక్రమంలో తెలకపల్లి జడ్పీటీసీ సుమిత్ర, జిల్లా నాయకులు నారాయణ గౌడ్, లక్ష్మయ్య, నిజాముద్దీన్ పాల్గొన్నారు.
జిల్లాలో రేషన్ షాపుల పనితీరు బాగుంది
సెంట్రల్ సివిల్ సప్లయి డైరెక్టర్ సంగీత్ సింగ్లా
మహబూబ్ నగర్ కలెక్టరేట్, జడ్చర్ల, బాలానగర్, వెలుగు: జిల్లాలో రేషన్ షాపుల పనితీరు బాగుందని సెంట్రల్ సివిల్ సప్లై డైరెక్టర్ సంగీత్ సింగ్లా అన్నారు. గురువారం జిల్లాలోని బాలానగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్ మండలాల్లోని కలెక్టర్ ఎస్.వెంకటరావుతో కలిసి పలు గ్రామాల్లో రేషన్ షాపులను తనిఖీ చేశారు. రేషన్ షాపుల్లో ప్రజలకు పంపిణీ చేస్తున్న సరుకులు, రిజిస్టర్ల నిర్వహణ, సరుకుల తూకం నాణ్యతను పరిశీలించారు. బాలానగర్ మండలం గుండెడ్ , కేతిరెడ్డిపల్లి, జడ్చర్ల మండలం గంగాపూర్ గ్రామంలో రేషన్‌షాపులను తనిఖీ చేశారు. అనంతరం మహబూబ్ నగర్ సమీపంలోని పిల్లలమర్రి, కేసీఆర్ఎకో అర్బన్ పార్క్ ను సందర్శించారు. అడిషనల్ కలెక్టర్లు తేజస్ నందలాల్ పవర్, కె. సీతారామారావు, సివిల్ సప్లయి జిల్లా మేనేజర్ జగదీష్, డీఎస్ఓ బాలరాజు, జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ సత్యనారాయణ, టూరిజం అధికారి వెంకటేశ్వర్లు, తహసీల్దార్లు లక్ష్మీనారాయణ, పార్థసారథి పాల్గొన్నారు.
మన ఊరు–మన బడి పనులు స్పీడప్ చేయాలి
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: జిల్లాలో మన ఊరు– మనబడి ప్రోగ్రాం కింద చేపట్టిన పనులను స్పీడప్ చేయాలని కలెక్టర్ ఎస్.వెంకట్ రావు ఆదేశించారు. గురువారం కలెక్టర్‌తన క్యాంపు ఆఫీసులో ఈడబ్ల్యూఐడీసీ ఇంజనీరింగ్ ఆఫీసర్లతో మన ఊరు–మన బడి పనులపై సమీక్షించారు. పనులు పూర్తయిన కేజీబీవీని ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు. మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ తో పాటు అన్ని స్కూల్స్ పనులు కంప్లీట్ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమీక్షలో ఏఈ రామచందర్, డిప్యూటీ ఈఈ రాము పాల్గొన్నారు.
జోగుళాంబ ఆలయానికి అంతర్జాతీయ అవార్డు
అలంపూర్, వెలుగు: దేశంలోనే ఐదో శక్తిపీఠమైన అలంపూర్జోగుళాంబ అమ్మవారి ఆలయానికి అంతర్జాతీయ స్థాయిలో అవార్డు దక్కింది. గురువారం హిందుస్థాన్ గగన్ గౌరవ్ జ్యోతిర్లింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బెంగుళూరులో శక్తిపీఠ సమాగం నిర్వహించారు. ఈ సందర్భంగా కర్ణాటక మంత్రి సుధాకర్ చేతులమీదుగా ఆలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఈవో పురేందర్ కుమార్, ఆలయ అర్చకుడు ఆనంద్ శర్మ, వేద పండితులు శ్యాం కుమార్ శర్మ అవార్డును అందుకున్నారు. సాంస్కృతిక రంగంలో విశేష సేవలందించినందుకు ఆలయానికి ఈ అవార్డు దక్కింది.