కోల్‌బెల్ట్,వెలుగు: మందమర్రి ఏరియా బొగ్గు గనుల్లో 2024–-25 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి 72శాతం సాధించిందని ఏరియా సింగరేణి జీఎం జి.దేవేందర్ తెలిపారు. శనివారం మందమర్రిలోని జీఎం ఆఫీస్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నవంబర్ బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత వివరాలను వెల్లడించారు. నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి 3,12,500 టన్నులకు 60శాతంతో 1,88,975 టన్నులను సాధించినట్లు చెప్పారు. ఆర్కేపీ ఓసీపీలో 133 శాతం, కేకే5 అండర్ గ్రౌండ్ మైన్‌లో 117శాతం బొగ్గు ఉత్పత్తి సాధించాయని, ఏరియాలోని గనుల్లో 35శాతం మంది కార్మికులు విధులకు గైర్హాజరవుతున్నారని, యూజీ మైన్లలో టార్గెట్ బొగ్గు ఉత్పత్తి రావడంలేదన్నారు.
ఆర్కేపీ ఓసీపీ రెండో ఫేజ్ పనులు చేపట్టేందుకు 375 హెక్టార్ల ఫారెస్ట్ భూమి, 600 హెక్టార్ల నాన్ ఫారెస్ట్ భూములు అవసరమని తెలిపారు. ఫారెస్ట్ భూముల పర్మిషన్ కోసం సంబంధితా కేంద్ర,రాష్ట్ర ఫారెస్ర్టీ, ఎన్విరాన్మెంట్ శాఖలకు కార్పొరేట్ యాజమాన్యం అవసరమైన డాక్యుమెంట్లు సబ్మిట్ చేయనున్నట్లు చెప్పారు. ఏడాదిన్నర లోపు పర్మిషన్ వచ్చే ఛాన్స్ ఉందని, 12ఏళ్లు ఓసీపీ జీవితకాలం ఉంటుందన్నారు. కేకే5 మైన్ మరో నాలుగేళ్లు నడవనుందని, దాన్ని ఓపెన్‌కాస్ట్ చేసేందుకు అడ్వాన్స్ ప్లానింగ్ సిద్ధం చేస్తున్నామన్నారు.
ఈ రెండు ప్రాజెక్టులు వస్తే మందమర్రి ఏరియాకు పునర్వైభవం వస్తుందన్నారు. కేకే ఓసీపీ ప్రభావిత నిర్వాసితుల కోసం పెద్దనపల్లిలో ఏర్పాటు చేస్తున్న పునరావాస (ఆర్అండ్ఆర్) కేంద్రాన్ని సింగరేణిలోనే మోడల్ కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. సమీపంలో ఉన్న హిల్ ప్రాంతాన్ని టూరిజం, ట్రెక్కింగ్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.
కాసీపేట1, 2 , 1ఏ గనుల్లో బొగ్గు ఉత్పత్తి కోసం శాండ్ స్ర్టవింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామన్నారు. శాంతిఖని గనిలో లాంగ్వాల్ టెక్నాలజీ ఏర్పాటుకు ఈసీ పర్మిషన్ రావాల్సి ఉందన్నారు. ఏరియాలో రూ.340 కోట్లతో కొత్తగా 67.5 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో డీజీఎం(ఐఈడీ) రాజన్న, ఏరియా ఇంజనీర్ వెంకటరమణ, పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, సివిల్ ఎస్ఈ రాము, డివైపీఎం ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.